ప్రపంచంలో పవర్‌ఫుల్ పాస్‌పోర్టులివే

వీసా అక్కర్లేకుండానే ఎన్నో దేశాలకు

జర్మనీ పాస్‌పోర్ట్‌తో ఏకంగా 158 దేశాలకు
రేటు ఎక్కువే.. లాభం కూడా అధికమే
భారతదేశ పాస్‌పోర్టుతో 59 దేశాలకు

విదేశీ ప్రయాణాలు చేసేవారి సంక్షేమం కోసం సొంతదేశాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాయి. అందులో భాగంగానే పాస్‌పోర్టును అందిస్తుంటాయి. ఫలానా వ్యక్తి తమ దేశ పౌరుడు అని తెలిపే ఈ పాస్‌పోర్టు... విదేశాల్లో ఉన్నప్పుడు ఎదురయ్యే అనేక ఇబ్బందులను ఎదుర్కొనగలిగేలా చేస్తుంది.  నియంతృత్వ పోకడలు ఉన్న కొన్ని దేశాలు తప్పితే ప్రపంచంలోని చాలా వరకూ దేశాలు పాస్‌పోర్టులను అందిస్తున్నాయి. అయితే అన్ని దేశాల పాస్‌పోర్టులు ఒకటేనా అంటే.. కాదని కచ్చితంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ సమాజంలో తమ పౌరుల భద్రత, వారికి ప్రత్యేక గుర్తింపును కల్పించేలా కొన్ని దేశాలు పాస్‌పోర్టులను అందిస్తుంటాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులపై ఓ లుక్కేద్దామా...
 
యూరోపియన్ యూనియన్‌లోని అత్యంత శక్తివంతమైన జర్మనీ తమ దేశ పౌరులకు పాస్‌పోర్టుల ద్వారా చాలా సదుపాయాలు కల్పిస్తోంది. ఎటువంటి వీసా అక్కర్లేకుండా ఏకంగా 158 దేశాలకు వెళ్లవచ్చు. స్టూడెంట్ వీసా, బిజినెస్ వీసా, ట్రావెల్ వీసా వంటి ఊసే లేకుండా ఆయా దేశాల పర్యటన చేయవచ్చు. ఈ పాస్‌పోర్ట్ ఖరీదు 45 యూరోలు కాగా అంతర్జాతీయ సమాజంలో దీనికి మూడో ర్యాంకు లభించింది. జర్మనీ తర్వాత యూరోపియన్ యూనియన్‌లోని స్వీడన్ కూడా అంతే మొత్తంలో దేశాలకు వీసా లేకుండా వెళ్లగలిగేలా తమ పౌరులకు అవకాశం కల్పించింది. 1995లో యూరోపియన్ యూనియన్‌లో కలిసిన ఈ దేశం పాస్‌పోర్టు ఖరీదు 28 యూరోలు. అంతర్జాతీయ సమాజంలో ఈ పాస్‌పోర్టు మొదటి స్థానంలో ఉంది. 
 
ఈ రెండు దేశాల తరువాతి స్థానంలో ఫిన్‌ల్యాండ్ నిలుస్తోంది మొత్తం 157 దేశాలకు వీసా అక్కర్లేకుండా ప్రయాణం చేయగలిగేలా తమ దేశ పౌరులకు పాస్‌పోర్టును అందిస్తోంది. ఈ పాస్‌పోర్టు ఖరీదు 37 యూరోలు కాగా దీనికి అంతర్జాతీయంగా రెండో ర్యాంకు లభించడం గమనార్హం. స్విడ్జర్లాండ్ కూడా 157 దేశాలకు వీసా అక్కర్లేకుండా తమ పౌరులు స్వేచ్ఛగా వెళ్లగలిగే విధంగా పాస్‌పోర్టులను అందిస్తోంది. యూరోపియన్ యూనియన్‌కు చెందని దేశాల్లో స్విడ్జర్లాండ్ పాస్‌పోర్ట్ అగ్రస్థానంలో ఉంది. అయితే అంతర్జాతీయంగా దీని ర్యాంకు 19 కాగా దీని ఖరీదు 112 యూరోలు. నియంతృత్వ పాలన ఉన్న దేశంగా చెప్పుకునే ఉత్తర కొరియాకు వీసా లేకుండా వెళ్లగలిగే దేశాల్లో స్విడ్జర్లాండ్ ఒకటి కావడం విశేషం. వీటితో పాటు మరికొన్ని దేశాలు కూడా అత్యధిక దేశాలకు వీసా లేకుండా ప్రయణించే సౌకర్యాన్ని తమ పౌరులకు కల్పిస్తున్నాయి. 
 
దేశం పాస్‌పోర్ట్ ర్యాంక్ వీసా ఫ్రీ దేశాలు ఖరీదు
ఫ్రాన్స్ 11 157 66 యూరోలు
స్పెయిన్ 8 157 20 యూరోలు
యూకే 4 157 73 యూరోలు
డెన్మార్క్ 6 156 65 యూరోలు
ఇటలీ 14 156 89 యూరోలు
ది నెదర్లాండ్స్ 10 156 52 యూరోలు
బెల్జియం 9 156 50 యూరోలు
దక్షిణ కొరియా ---- 156 ----
నార్వే 15 156 39 యూరోలు
 
ఆయా దేశాలకున్న విలువ, అంతర్జాతీయ సమాజంలో దేశాల వాణిజ్యం, దేశాల మధ్య సంబంధాలు వంటి వాటిపై ఆధారపడి పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తారు. భారతదేశ పాస్‌పోర్టుతో మొత్తం 59 దేశాలకు వీసా అక్కర్లేకుండా వెళ్లవచ్చు. ఈ పాస్‌పోర్ట్ ర్యాంకు కూడా 59 కావడం విశేషం. 

పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. ఈ 59 దేశాల్లో మనదే రాజ్యం..