ఎన్నారైలూ.. పీఓఏ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

పవర్‌ ఆఫ్‌ అటార్నీ (ఏఓఏ) అంటే మన పరోక్షంలో వేరే వ్యక్తి మన తరపున విధులను నిర్వర్తించడానికి మనమే ఇచ్చే అధికారం. సాధారణంగా భారత్‌లో ఆస్తులు ఉండి.. విదేశాలకు వెళ్లే ఎన్నారైలు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ సంబంధిత విషయాల్లోనే పవర్‌ ఆఫ్‌ అటార్నీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 

పవర్‌ ఆఫ్‌ అటార్నీలో ముఖ్యమైనవి రెండు రకాలు 
1)జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ
2)స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ

జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ అంటే మన పరోక్షంలో చేయవల్సిన పనులకు సంబంధించి పూర్తి అధికారాలివ్వడం. స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ అంటే పూర్తి అధికారం కాకుండా ముఖ్యమైన పర్పస్‌ కోసం మాత్రమే ఇచ్చేది. 

 గుర్తుంచుకోవాల్సినవి:

1)పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చేవారు, తీసుకునే వారు తప్పనిసరిగా మేజర్‌లై ఉండాలి. చిన్న పిల్లలు దీనికి అనర్హులు. 
2)పీఓఏ అనేది పూర్తిగా లీగల్‌ పర్పస్‌ కోసమే. 
3)పీఓఏ అనేది కచ్చితంగా మేజిస్ట్రేట్‌ చేత నోటరీ చేయించి, స్టాంప్‌ వేయించి రిజిస్టర్‌ చేయించి ఉండాలి. 
4)విదేశాల్లో ఉంటూ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇవ్వాలనుకుంటే దగ్గర్లోని ఇండియన్‌ కాన్సులేట్‌ ద్వారా పూర్తి చేయవచ్చు. 
5)ఎవరికైనా తప్పని సరి పరిస్థితుల్లో పీఓఏ ఇవ్వాల్సి  వస్తే.. స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ మాత్రమే ఇవ్వాలి. జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఎవరికీ ఇవ్వకపోవడమే మంచిది. 
6)ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడని వ్యక్తికే పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇవ్వాలి. అటార్నీ తీసుకునే వ్యక్తి మీకు దగ్గరి బంధువై.. చాలా నమ్మకస్తుడై ఉండాలి.