Postal-Service-for-International-Parcel

ఫారిన్‌ పార్శిళ్లకు పోస్టల్‌ సర్వీస్‌.. వారంలో అనుకున్న దేశానికి...

  • విదేశాలకు సులువుగా వస్తువుల సరఫరా
  • హుమాయున్‌నగర్‌ పోస్టాఫీస్‌లోనే కస్టమ్స్‌ తనిఖీలు
  • విదేశీ తపాలా కార్యాలయానికి రోజుకు 300కిపైగా పార్సిళ్లు
  • తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక కేంద్రం

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన పిల్లలకు తినుబండారాలు.. చుట్టపు చూపుగా అమెరికాకు వెళ్లిన తల్లిదండ్రులకు రోజువారీగా కావాల్సిన మందు గోళీలు.. దుస్తులు, ఎలక్ర్టానిక్‌ వస్తువులను పంపించాలనుకునేవారు ఇక ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. గతంలో మాదిరిగా ఇతర ప్రాంతంలో తనిఖీలు లేకుండా మన వద్దే ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌. నగరంలోని హుమాయున్‌నగర్‌ పోస్టాఫీస్‌ కేంద్రంగా విదేశీ తపాలా కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది.
 
జూన్‌ 11 నుంచి..
హుమాయున్‌నగర్‌ బ్రాంచ్‌ పోస్టాఫీస్‌ పర్యవేక్షణలో గత నెల 11 నుంచి ఫారిన్‌ పార్సిల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి నుంచే రాష్ట్రవ్యాప్తంగా విదేశాలకు నేరుగా వస్తువులను పంపించుకునే సౌకర్యాన్ని ప్రారంభించగా, ఇక్కడ కార్యాలయం, సౌకర్యాలను సమకూర్చుకున్న తర్వాత పూర్తిస్థాయి సేవలు మొదలుపెట్టారు. అమెరికా, యూకే, యూఏఈ, ఆస్ర్టేలియా, కెనడాలో నివసిస్తున్న తమ వారికి కావాల్సిన వస్తువులను ఇక్కడినుంచి పంపించేలా రాష్ర్ట్రం మొత్తానికి కలిపి హుమాయున్‌నగర్‌ పోస్టాఫీస్‌లో సెంటర్‌ ఏర్పాటుచేశారు.

గతంలో ఇబ్బందులు..
విదేశాల్లో నివసిస్తున్న తమ పిల్లలు, బంధువులకు కావాల్సిన వస్తువులను గతంలో పోస్టాఫీస్‌, ప్రైవేట్‌ పార్సిల్‌ సెంటర్ల ద్వారా పంపించేవారు. మన రాష్ట్రం నుంచి పంపించే ప్రతి వస్తువునూ ముంబయిలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేసేవారు. తనిఖీల పేరిట అక్కడే మూడ్రోజుల సమయం గడిచిపోయేది. అనుమానం ఉన్న వస్తువులను నిర్లక్ష్యంగా మూలకు పడేసేవారు. పచ్చ ళ్లు, తినుబండారాల వంటివి పాడైపోతుండేవి.
 
ఇప్పుడు హాయిగా..
గతంలో ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నయ్‌లో మాత్రమే ఉన్న తనిఖీ కేంద్రాలను విదేశాల్లోని తెలుగు ప్రజల సౌకర్యార్థం కస్టమ్స్‌ శాఖ అధికారులు రాష్ర్టాల వారీగా ప్రారంభించారు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్‌ పోస్టాఫీస్‌ వేదికగా తెలంగాణ కేంద్రం, అమరావతి వేదికగా ఏపీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో గంటల వ్యవధిలోనే వస్తువులను తనిఖీ చేసి పంపిస్తున్నారు. వారం రోజుల్లోనే మనం పంపిన వారికి వస్తువులు చేరుతున్నారు.
 
ఏయే వస్తువులు పంపించుకోవచ్చంటే..
విదేశీ తపాలా కార్యాలయం నుంచి అనుమతి పొందిన పచ్చళ్లు, మెడిసిన్‌, దుస్తులు, బొమ్మలు, ఆల్బమ్స్‌, ఫొటోలు, పాతకాలపు గుర్తులను పంపించుకోవచ్చు. వాటితోపాటు 2 కిలోల రిజిస్టర్‌ పోస్ట్‌, 20 కిలోల పార్సిల్‌, 30 కిలోల స్పీడ్‌, 250 గ్రాముల నుంచి 30 కిలోల వరకు స్పీడ్‌ పోస్ట్‌లు చేసుకోవచ్చు. 30 కిలోల బరువు దాటిన తర్వాత ఆపై ఉన్న బరువును మరో పార్సిల్‌ కింద లెక్క కట్టుతారు.
 
ఏవి పంపించొద్దంటే..
నిషేధిత మాదక ద్రవ్యాలు, సైక్రియాట్రిక్‌ మందులు, వైల్డ్‌లైఫ్‌ ప్రొడక్ట్స్‌, తుపాకీలు, సముద్రతీరంలో లభించే వస్తువులను నిషేధించారు. ఆయా వస్తువులపై అనుమానం కలిగితే వెంటనే పంపిస్తున్న వ్యక్తికి కాల్‌ చేసి కేంద్రానికి రప్పించి వస్తువులను వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారు.
 
పని వేళలు..
విదేశీ తపాలా కార్యాలయం సోమవారం నుం చి శనివారం వరకు రోజూ 10 గంటల నుంచి 4 గంటల వరకు పని చేస్తుంది. ఆ తర్వాత ఆ రోజు వచ్చిన పార్సిళ్లను అన్నింటిని ప్రత్యేక వాహనంలో సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి విమానంలో ఆయా చిరునామాలకు చేరవేస్తారు.
 
చార్జీలు ఇలా...
హుమాయున్‌నగర్‌లోని విదేశీ తపాలా కేంద్రానికి తీసుకొచ్చిన వస్తువులను తొలుత కస్టమ్స్‌ అధికారులు మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేస్తారు. తర్వాత వస్తువులను కాటన్‌ బాక్సుల్లో భద్రపరిచి పక్కనే ఉన్న ఇంటర్నేషనల్‌ బుకింగ్‌ సెంటర్‌ (ఐబీసీ)కు పంపిస్తారు. అక్కడ పార్సిల్‌ బరువును బట్టి రవాణా చార్జీ వేస్తారు. 250 గ్రాముల వస్తువును అమెరికాకు పంపించాలనుకుంటే రూ.1003 తీసుకుంటున్నారు. అదే పార్సిల్‌ను ఇంగ్లండ్‌కు పంపాలంటే రూ.1600 తీసుకుంటున్నారు. మొదటి 250 గ్రాముల బరువు తర్వాత వచ్చే 250 గ్రాముల బరువుకు 10 శాతం అదనంగా చార్జీ వసూలు చేస్తున్నట్లు ఐబీసీ సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ అల్లె మల్లే్‌షబాబు తెలిపారు. వచ్చే ఆగస్టు ఒకటి నుంచి విదేశాల్లో ఉన్నవారు కూడా తమవారికి తక్కువ చార్జీలతో వస్తువులను పంపించుకునే సౌకర్యాన్ని పోస్టల్‌ శాఖ కల్పించనున్నట్లు తెలిపారు. హుమాయున్‌నగర్‌ విదేశీ తపాల కేంద్రానికి రోజూ 300 నుంచి 400 వరకు పార్సిళ్లను విదేశాలకు పంపిస్తున్నట్లు కస్టమ్స్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సన్ని జోసెఫ్‌ పేర్కొన్నారు.