Passport-in-Four-days

నాలుగు రోజుల్లోనే పాస్‌పోర్టు!

అడయార్‌(చెన్నై): దరఖాస్తు చేసుకున్న నాలుగు రోజుల్లో పాస్‌పోర్టును అందజేయనున్నట్టు చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి కే బాలమురుగన్‌ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌ కార్డులను విధిగా సమర్పించాల్సి ఉంటుందని ఇలాంటి వారికి కేవలం నాలుగు రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేస్తామని తెలిపారు. అలాగే పాస్‌పోర్టు దరఖాస్తులను పోలీసులు తనిఖీ చేసేందుకు వీలుగా మొబైల్‌ పోలీసు యాప్‌ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ సౌకర్యంతో చెన్నైతో పాటు విలుపురం, కడలూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చినట్టు తెలిపారు. ఈ తరహా విధానం దేశంలో మూడు రాష్ట్రాల్లో అమల్లో ఉందన్నారు.

 
ఇపుడు కొత్తగా తమిళనాడులో ప్రవేశపెట్టినట్టు ఆయన వివరించారు. అలాగే, రాష్ట్రంలోని 280 ఈసేవా కేంద్రాల్లో కూడా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతవాసులు సులభంగా పాస్‌పోర్టు పొందేందుకు వీలుగా ఈ స్కీమ్‌ను అమలుచేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది చెన్నై ప్రాంతీయ కార్యాలయం ద్వారా 4 లక్షల పాస్‌పోర్టును జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3 లక్షల పాస్‌పోర్టులను అందజేసినట్టు తెలిపారు. పాస్‌పోర్టు కోసం సమర్పించే దరఖాస్తుల పరిశీలన సమయాన్ని 19 రోజుల నుంచి 2 రోజులకు తగ్గించినట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజే ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరిగేలా చర్యలు చేపట్టినట్టు చెప్పారు.