పాన్‌కార్డుల జారీకి.. నూతన విధానాలు

ఉద్యోగుల కోసం ప్రత్యేక నిబంధనలు
ఆధునిక పద్ధుతులలో కార్డుల జారీ
అవగాహన కల్పించాలంటున్న ఉద్యోగులు
పాన్‌కార్డుల జారీకి ప్రభుత్వం నూతన విధానాలు తీసుకొచ్చింది. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అవసరమైన పర్మినెంట్‌ ఖాతా నెంబర్‌(పాన్‌)కార్డులను మరింత ఆధునికంగా తీర్చిదిద్దున్నారు. ప్రతి ఆర్థిక అవసరానికి ఎంతో ఉపయోగపడే ఈ కార్డు ప్రాధాన్యం ఇటీవలకాలంలో బాగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరికి ఈ కార్డు అవసరం ఉన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆర్థికపరమైన వ్యవహారాలకు బ్యాంకు లావాదేవీలకు తప్పనిసరిచేశారు. దీంతో ఉద్యోగుల జీవితాల్లో ఈ కార్డుకు ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. ప్రతి ఉద్యోగి పాన్‌కార్డు చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఆదాయం పొందుతున్న వ్యక్తులు కార్డు కలిగి ఉండాలి. దీనివల్ల ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్డులను జారీ చేస్తున్నారు. వీటిని ఆదాయపన్నుశాఖకు అనుసంధానం చేసి వారి నియంత్రణలో ఉంచడంవల్ల ఉద్యోగుల ఆదాయ వ్యయాలన్నీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
 
కాకినాడ సిటీ: ఇటీవలకాలంలో ఈ పాన్‌కార్డును ఉద్యోగుల ఆధార్‌కార్డుతో కూడా లింక్‌ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి. నిత్య జీవితంలో ఉద్యోగులు ఉపయోగిస్తున్న రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఏటీఎం కార్డుల కంటే పాన్‌కార్డు ప్రాధాన్యం పెరిగింది. ఉద్యోగులందరికీ ఈ కార్డును తప్పనిసరి చేస్తూ నిబంధన విధించారు. జిల్లాలో 60వేలకు పైగా ఉద్యోగులున్నారు. వీరందరూ పాన్‌కార్డును తీసుకోవాలి. దీనిపై చాలా మందికి అవగాహన లేదని, అవగాహన కల్పించాలని ఉద్యోగ సంఘాల నాయకులంటున్నారు. డిసెంబరులో ముగిసిన గడువును మార్చి వరకు పెంచాలంటున్నారు.
 
ఎలా తీసుకోవాలి..
జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి సర్టిఫికెట్‌, చిరునామా ధ్రువీకరణ, వ్యక్తిగత గుర్తింపు కార్డు, ఆధార్‌, ఓటరుకార్డు డ్రైవింగ్‌ లైసెన్సు పాస్‌పోర్టు ఉండాలి. ఆదాయపన్నుశాఖనుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే పాన్‌కార్డులను తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం యూటీఐ, యూటీ ఐటీఎ‌ఫ్ఎల్‌ సెంటర్లు, కార్వే సంస్థ, టిన్‌ వంటి వాటికి అధికారాలు ఇచ్చింది.
 
పాన్‌కార్డు ప్రాధాన్యం
ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లిస్తున్న వారైనా తప్పనిసరిగా ఈ కార్డులను కలిగి ఉండాలి. ప్రతి కార్డుకు ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. అందులో ఉద్యోగి పుట్టిన సంవత్సరం సంఖ్య కూడా మధ్యలో ఒక దగ్గర ఉంటుంది. ఈ సంఖ్య ద్వారా ఉద్యోగి ఆర్థిక లావాదేవీలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణ కిందకు వస్తాయి. ఆదాయపన్నుశాఖ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులు ప్రతి సంవత్సరం తమ ఆదాయ వ్యయాలకు సంబంధించిన రిటర్న్స్‌ దాఖలు చేయాలి. కార్డులను ఆధార్‌తో లింక్‌ చేయడంవల్ల సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతోంది.
 
ఆధార్‌తో అనుసంధానం
ఉద్యోగులకున్న పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకునే కార్యక్రమాన్ని అధికారులు చేపడుతున్నారు. ఉద్యోగులు ఈ కార్డులను అధికారికంగా జారీ చేసే సంస్థల వద్దకు వెళ్లి చేయించుకోవాలి. లేదా ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉన్న కంప్యూటర్ల ద్వారా కూడా ఎవరికి వారు అనుసంధానం చేసుకునే ఉంది.
 
కార్డు తప్పనిసరి చేసిన అంశాలు
రూ.2లక్షలకు పైబడి బంగారం ఇతర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా పాన్‌కార్డుండాలి. రూ.50వేలకు పైబడి బ్యాంకులో డిపాజిట్‌ చేసినా ఒకేసారి రూ.50వేలు విత్‌డ్రా చేసినా పాన్‌కార్డునివ్వాలి. ఎల్‌ఐసీ ప్రీమియం సొమ్మును ఒకేసారి రూ.50వేలకు పైబడి చెల్లిస్తే కార్డు తప్పనిసరిగా ఉండాలి. డెబిట్‌ కార్డులను క్రెడిట్‌ కార్డులను బ్యాంకుల నుంచి తీసుకోవాలంటే పాన్‌కార్డుండాలి. కార్లు, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కార్డుండాలి. మ్యూచ్‌వల్‌ ఫండ్సులో పెట్టుబడులు పెట్టే సమయంలో కూడా జమ చేయాలి.
 
ఉద్యోగులకు ప్రయోజనాలు
ఇతర గుర్తింపు కార్డుల మాదిరిగా ఈ కార్డులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆదాయ పన్ను శాఖ అధికారులు పన్ను చెల్లిస్తున్న ఉద్యోగులకు వారు చేసిన ఆర్థిక వ్యవహారాలకు చెందిన 26 ఏఎస్‌ స్టేట్‌మెంటును ఏడాదికి ఒక పంపిస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌ నుంచి మరుసటి ఏడాది మార్చి వరకు ఉద్యోగులు జరిపిన ఆర్థిక లావాదేవీలను రికార్డు చేసి జాబితా రూపంలో పంపుతారు. దీని ద్వారా తమ ఆదాయానికి సమర్పించే ఫారం 16ను పంపించడానికి సులభతరం అవుతుంది. ఉద్యోగుల ఆస్తులకు చట్టబద్ధత ఉంటుంది. బ్యాంకు లావాదేవీలకు చాలా ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో దీన్ని సిటిజన్‌ కార్డుగా కేంద్రం తీర్చిదిద్దుతుంది. పాన్‌కార్డుపై ఫోటో ఉండడంవల్ల అధికారిక గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది.
 
దరఖాస్తు ఇలా..
వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. www.inc ometaxindia.gov.in, www.utiitl.com, www. tin. nsdl.com వంటి సైట్లలో దరఖాస్తు చేసుకోవాలి. మీసేవా, ఈసేవా కేంద్రాల ద్వారా చేసుకునే అవకాశం కల్పించలేదు. పాన్‌కార్డుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్నుతో కలిపి రూ.110 మాత్రం చెల్లించాలి. విదేశాల్లో ఉంటున్న వారు కూడా అక్కడినుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వారు చిరునామాకు పంపడానికి రూ.910 చెల్లించాలి. అన్ని వివరాలతో దరఖాస్తు చేసుకున్న తర్వాత 15రోజులకు ఇచ్చిన చిరునామాకు అందుతుంది.
 
ఉద్యోగుల్లో మరింత అవగాహన పెంచాలి
పాన్‌కార్డు వినియోగం, ప్రయోజనాలపై చిరుద్యోగుల్లో అవగాహన పెద్దగా లేదు. కల్పించాలి. జిల్లాలో 60వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. అందరికీ దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి అవగాహ ఉండదు. వారికీ కల్పించాలి. అధికారులు దీనిపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే పాన్‌కార్డు తీసుకోవాలంటున్నారు. నిబంధనలు ఇతర విషయాలపై అవగాహన కల్పిస్తే ఉద్యోగులకు మంచి ప్రయోజనం ఉంటుంది.
-కేఎస్‌వీ సుబ్బారావు, ఉద్యోగి, రెవెన్యూ విభాగం
 
గడువు పెంచాలి
పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో లింకు చేసుకునే ప్రక్రియకు గడువు మార్చి వరకు పెంచాలి. అనుసంధానం గురించి చాలామందికి తెలియదు. జిల్లాలో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పట్టణ ప్రాంతాలకు దీనిపై కాస్త పరిజ్ఞానం, సౌకర్యాలున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల ఉద్యోగులకు ఇబ్బందులున్నాయి. అధికారులు కార్యక్రమాలు చేసేందుకు అదేశాలివ్వాలి.
-కె.వీరబాబు, అధ్యక్షుడు, కలెక్టరేట్‌ రెవెన్యూ ఉద్యోగుల సంఘం