ఓవర్సీస్ మెడికల్ ఇన్సూరెన్స్‌తోనే మేలు

విదేశీ ప్రయాణాలు చేసేటప్పడు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం తప్పనిసరి. లేకుంటే ఆసుపత్రులకు భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాతావరణ మార్పుల వల్ల అనేక రోగాలు వస్తుంటాయి. అందుకే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నప్పడు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఎటువంటి కంపెనీల దగ్గర నుంచి ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?.. ఇండియాలోని మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర నుంచి పాలసీలను పొంది.. విదేశాల్లో అయే ఆసుపత్రి ఖర్చును పూర్తి స్థాయిలో పొందగలరా...? వంటి వాటి గురించి తెలుసుకుంటే మంచిది.
 
భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లేటప్పుడు టికెట్లతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్‌ను కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గరే తీసుకుంటుంటారు. ఎజెంట్లకు ఆయా కంపెనీల నుంచి వచ్చే కమీషన్ల కోసం ప్రయాణీకులకు అవసరం లేని పాలసీలను కూడా అంటగడుతుంటాయి. వీరు ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన వారేమీ కాదు. ఏదయినా సమస్య వచ్చినప్పడు వీరు తమకు సంబంధం లేదన్నట్టు పక్కకు తప్పుకుంటారు. దీనివల్ల ప్రయాణీకులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ట్రావెల్ ఏజెన్సీ వారి దగ్గర నుంచి కంటే ఏ దేశానికయితే మీరు వెళ్తున్నారో.. ఆ దేశపు కంపెనీల నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భారత దేశంలో మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుని విదేశీ ప్రయాణాలు చేయవద్దనడానికి వారు కారణాలనూ చెబుతున్నారు. 
 
1. విదేశాల్లోని ఆసుపత్రులు ఆయా దేశాల ఇన్సూరెన్స్ కంపెనీలతో సంబంధాలు కలిగి ఉంటారు. అందువల్ల అక్కడి కంపెనీల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటే ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకపోవచ్చు. 
 
2. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద నుంచి మెడికల్ రీయింబర్స్‌మెంట్ పోందడం అనుకున్నంత సులభమైన పనేమీ కాదు. దరఖాస్తుల మీద దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణం ముగించుకుని ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియన్ కంపెనీల నుంచి ఇన్సూరెన్స్ పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏ ఆసుపత్రిలో చేరారు.. ఎంత ఖర్చయింది.. దానికి సంబంధించిన రసీదులు ఏవీ... అంటూ సవాలక్ష పత్రాలు అడుగుతాయి. అదే అక్కడి కంపెనీల ద్వారా అయితే ఇంత కష్టం ఉండదు. అక్కడి ఆసుపత్రులే కనుక మీ పని సులభంగా అయిపోతుంది. 
 
3. స్థానిక ఆసుపత్రులు అందించే సేవలకనుగుణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీలను అందిస్తుంటాయి. ఆ పాలసీలను తక్కువ రేటుకే అందించే విధంగా స్థానిక ఆసుపత్రులతో ముందుగానే అవగాహన కుదుర్చుకుంటాయి. ఎక్కువ రేటు గల పాలసీలు కొనడం వల్ల ప్రయాణీకులు నష్టపోతుంటారు. అక్కడ అయిన ఖర్చు.. పాలసీ కంటే తక్కువ అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకు మీరు మేలు చేకూర్చిన వారవుతారు. అందుకే అక్కడి పాలసీలను క్షుణ్ణంగా చదివి వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆయా పాలసీల ద్వారా గరిష్టంగా ఎంత సొమ్ము వస్తుందో తప్పని సరిగా చూసుకోవాలి.