సొంతగడ్డకు ఎన్నారై కుటుంబాన్ని రప్పించిన ఆంధ్రజ్యోతి-నవ్య’ రచన ఇదే

ఆంధ్రజ్యోతి వారపత్రిక అయిన ‘నవ్య’లో వచ్చిన ఓ రచనను చూసి స్వదేశానికి అమెరికాలో స్థిరపడిన నాగలక్ష్మి అనే ఎన్నారై మహిళ తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. ఆ రచన.. ఆమెతోపాటు మొత్తం కుటుంబంలోనూ మార్పు తెచ్చింది. వారి కుటుంబంపై అంతగా ప్రభావం చూపిన ఆ రచన ఏంటో మీరూ చదవండి.

 
*********
 
జానకిరావుకి డెబ్బయి ఏళ్ళు. అయినా గట్టిగానే ఉంటాడు. బీపీ లేదు. షుగర్‌ లేదు. తిన్నది అరగకపోవడం లేదు. నిద్ర పట్టక పోవడం లేదు. జలుబు లేదు. జ్వరం లేదు. ఎంత దూరమైనా నడుస్తానంటాడేగాని, లిఫ్ట్‌ ఇస్తానన్నా తీసుకోడు. పొట్టిగా సన్నగా ఉంటాడు జానకిరావు. ఓ చేతిలో గొడుగూ, మరో చేతిలో పెద్దసైజు సంచీ ఉంచుకుని కాలనీ అంతటా తిరుగుతూ ఉంటాడు. ఏ సాయానికైనా ఏ వేళనైనా పిలిస్తే పలుకుతాడు. పని అంటే చాలు! ముందుంటాడు. పదిమందితో కలివిడిగా ఉంటాడు. 

రావడం రావడమే జానకిరావు కాలనీకి ఒంటరిగా వచ్చాడు. సింగిల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ తీసుకుని, సింగిల్‌గానే ఉంటున్నాడు. భార్యాబిడ్డలు ఉన్నారో లేదో తెలియదు. ఆ వివరాలు అడిగితే నవ్వే అతని సమాధానం అవుతుంది. ఎవరో చెప్పారు, అతనికి భార్యా, ఓ కొడుకూ, ఓ కూతురూ ఉన్నారని. అయితే వాళ్ళంతా అమెరికాలో ఉంటున్నారట! జానకిరావు కూడా రెండేళ్ళక్రితం వరకూ అమెరికాలోనే ఉన్నాట్ట! తర్వాతే అక్కడ ఉండడం కష్టం అనిపించి ఇక్కడకి వచ్చేశాట్ట! కూడా భార్య రావాలిగా? రాలేదా? అంటే ఆమె రానన్నదనీ, కూతురింట ఉండిపోతానన్నదనీ చెప్పారు. 

జానకిరావుకి వంట వచ్చు. అన్నీ చక్కగా వండుకుంటాడు. పొద్దుటిపూట ఎప్పుడూ ఇడ్లీనే తింటాడు. ఇడ్లీలను పువ్వుల్లా మెత్తగా పెట్టుకుంటాడు. మధ్యాహ్నం లంచకి రెండుకూరలూ, పచ్చడీ, పులుసూ ఉండి తీరాలి. ఓపిగ్గా చేసుకుంటాడవన్నీ. సాయంత్రం స్నాక్స్‌ పెద్దగా అక్కర్లేదుగాని, రాత్రి డిన్నర్‌కి మాత్రం మూడు చపాతీలూ, అంత పప్పూ ఉండాల్సిందే! దానికి ముందు రెండు పెగ్గులు బ్రాందీ పడాలి. అది లేకపోతే గంగ వెర్రులెత్తిపోతాడు జానకిరావు. అయితే ఆ రెండు పెగ్గులూ ఒక్కడూ కూర్చుని తాగడు. దానికి కంపెనీగా ఒకరిద్దరు మిత్రులుండాలి. వారి మందు ఖర్చు కూడా తానే భరిస్తానంటాడతను. 

రాత్రి పన్నెండు గంటల వేళ మంచి నిద్రలో ఉంటాడు జానకిరావు. తలుపు తడతారెవరో! ఏఁవి టమ్మా? ఏఁవైందంటే...మా మామగారికి ఏం బాగాలేదు సార్‌! హార్టెటాక్‌ అనుకుంటాను, మెలికలు తిరిగిపోతున్నారంటే... నిద్రమత్తు వదిలించుకుని జానకిరావు తక్షణ చర్యలు తీసుకుంటాడు. అంబులెన్స్‌ను  పిలుస్తాడు.  అంబులెన్సు వచ్చేంత వరకూ పేషెంట్‌ దగ్గర ఉండి, జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. పేషెంట్‌ని ఆసుపత్రిలో జాయిన్చేసి, అవసరమైతే ఆపరేషనకి డబ్బు సర్దుతాడు. ఆపరేషన సక్సెస్‌ అయి, పేషెంట్‌ బతికి బట్టకడితే స్వీట్లు పంచిపెడతాడు. ఈ వ్యవహారంలో నాలుగైదు రోజులు నిద్ర ఉండదు. సరైన తిండి ఉండదు. రాత్రి మందు ఉండదు. పట్టించుకోడు జానకిరావు. చిరాకు పడడు. అయ్యా! మా కోడలు పిల్ల నొప్పులు పడుతోంది! అబ్బాయి టూర్లో ఉన్నాడు. ఇంటికి మగదిక్కు లేదు. మీరే చూడాలంటే...జానకిరావుకి పట్టపగ్గాలు ఉండవు. కోడలు పిల్లను ఆసుపత్రిలో జాయిన్చేసి, ఆమెకు పథ్యం పెట్టేంత వరకూ బిజీబిజీగా ఉంటాడు. బారసాలనాడు హడావుడి అంతా అతనిదే! పిల్లాడికి ఏం పేరు పెట్టాలి దగ్గర నుంచి వాడికి ఆ రోజు కానుకగా తాను ఏమివ్వాలన్న విషయమై జానకిరావు ఎంతగా హైరానా పడతాడో మాటల్లో చెప్పలేం. 

కట్టుకున్న పెళ్ళాన్నీ, కన్నవాళ్ళనీ అమెరికాలో వదులుకుని, ఇక్కడ ఏమీ కాని వాళ్ళకోసం ఇంతగా హైరానా పడుతున్నావే ఎందుకయ్యా ఇదంతా? అని జానకిరావుని ఇంతవరకూ ఎవరూ అడగలేదు కాని, అడిగితే:  కట్టుకున్నది కూతురింట ఉండిపోయింది. ఆమె అక్కడే ఉండాలి. ఆమె అవసరం అక్కడ చాలా ఉంది. మనవణ్ణీ మనవరాలినీ చూసుకోవాలామె. నేను కొడుకు ఇంట్లోనే ఉండాలి. కొడుకూ కోడలూ ఇద్దరూ ఉద్యోగులవడంతో ఆ ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేకపోయాను. ఒంటరిగా జీవించడం అంటే కావాలని అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే! పక్షవాతాన్నీ, గుండెజబ్బుల్నీ కౌగిలించుకోవడమే! పైగా పదిమందితో కలివిడిగా ఉండేందుకు వీలులేని పరిస్థితి అక్కడ. అది ఇక్కడ లేదు, ఉండదు. అందరూ కావాలనుకోవడం మంచి ఆరోగ్యచిట్కా. అదే నా ఆరోగ్య రహస్యం. అందుకే వచ్చేశానిక్కడికి అన్నది జానకిరావు సమాధానం అవుతుంది.