భారత విద్యాసంస్థల్లో ఎన్నారై స్టూడెంట్స్‌కు రిజర్వేషన్లు!

భారత ప్రముఖ విశ్వ విద్యాలయాల్లో చదవాలనుకునే ఎన్నారై విద్యార్థులకు శుభవార్త. వారు భారత్‌లో చదువుకోవాలనుకుంటే ఇకపై వారు రిజర్వేషన్‌ కోటాలో సీట్లు సంపాదించుకోవచ్చు. అలాగే ఎన్నారై ఫీజు కూడా కట్టనవసరం లేదు. 

కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ, సాంకేతిక కోర్సుల్లోనూ ఎన్నారైలకు సూపర్‌ న్యూమరీ కోటా కింది 15 శాతం రిజర్వేషన్‌ ఇవ్వనున్నట్టు భారత ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీయులు, పర్సన్‌ ఆప్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (పీఐఓ) కార్డు హోల్లర్లు, ఓసీఐ (ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా) కార్డు హోల్డర్లు, గల్ఫ్‌ కంట్రీల్లో పని చేస్తున్న వారి పిల్లలు ఈ కోటాను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇకపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్నారై విద్యార్థులు కట్టే ట్యూషన్‌ ఫీజు, ఇతర ఫీజులను ఫారిన్‌ నేషనల్‌/పీఐఓ కేటగిరీల కింద తీసుకోవాలి. ప్రత్యేకంగా ఎన్నారై ఫీజు తీసుకోకూడదు. అలాగే గల్ఫ్‌ కంట్రీలో పనిచేస్తున్న వారి పిల్లలను భారత విద్యార్థుల్లాగానే ట్రీట్‌ చేయాలి. ప్రభుత్వ విద్యాలయాలు, విద్యాసంస్థలే కాకుండా డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేట్‌ విద్యాసంస్థలూ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి.