రూ.16,700 కోట్లు!

దుబాయ్‌ రియల్టీలో మనోళ్ల పెట్టుబడులు
దుబాయ్‌: అత్యంత విలాసవంతమైన గల్ఫ్‌ నగరంగా పేరున్న దుబాయ్‌లో మనోళ్లు భారీగా స్థిరాస్తులు కూడబెట్టుకుంటున్నారు. తమ దేశంలో అధికంగా ప్రాపర్టీలు కొనుగోలు చేస్తున్న విదేశీయుల్లో భారతీయులే అధికమని దుబాయ్‌ లాండ్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఈ శాఖ వద్దనున్న సమాచారం ప్రకారం.. గత ఏడాది దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో మనోళ్లు ఏకంగా రూ.30,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాదిలో గడిచిన 9 నెలల్లో 3,696 మంది భారతీయులు రూ.16,700 కోట్ల విలువైన ప్రాపర్టీలు కొనుగోలు చేశారు. జనవరి నుంచి సెప్టెంబరు వరకు మొత్తం 38,800 మంది విదేశీ ఇన్వెస్టర్లు దుబాయ్‌ రియల్టీ మార్కెట్లో రూ.2.87 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తులను తమ సొంతం చేసుకున్నారు.
 
దశాబ్దకాలంలో భారీ విస్తరణ
గడిచిన దశాబ్దకాలంలో దుబాయ్‌ లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ నిర్మాణాలు చేపట్టింది. అందులో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా, మానవ నిర్మిత పామ్‌ ఐలాండ్‌, స్కై దుబాయ్‌, ది స్నో పార్క్‌ ప్రముఖమైనవి. వీటితోపాటు భారీ, లగ్జరీ షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య సముదాయాలను నిర్మించింది. దాంతో దుబాయ్‌ వాణిజ్యంతో పాటు టూరిజం, రియల్టీ రంగాలకు హబ్‌గా మారింది. తద్వారా విదేశీయుల్లో దుబాయ్‌ ప్రాపర్టీల పట్ల ఆకర్షణ పెరిగింది.
 
ముంబై కంటే చౌక
దుబాయ్‌లో ప్రాపర్టీ కొనుగోలుదారులకు అవకాశాలు అపారం. సాధారణ అపార్ట్‌మెంట్ల దగ్గరి నుంచి విలాసవంతమైన విల్లాలు, పెంట్‌ హౌజ్‌లు, స్టూడియో అపార్ట్‌మెంట్ల వరకు ఏం కావాలన్నా లభిస్తాయని రియల్టర్లు అంటున్నారు. అంతేకాదు.. ముంబై, బెంగళూరు, పుణె వంటి నగరాలతో పోలిస్తే దుబాయ్‌లోనే ప్రాపర్టీలు చౌకగా లభిస్తుండటం, వాటిపై ఆకర్షణీయమైన అద్దె లభిస్తుండటంతో మనోళ్లకు ఈ నగరంపై మోజు పెరిగిందని వారంటున్నారు. ప్రస్తుతం తమ కస్టమర్లలో భారతీయుల వాటా 10 శాతం పైమాటేనని దుబాయ్‌కి చెందిన ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీ నఖీల్‌ సీఈఓ సంజయ్‌ మన్‌చందా తెలిపారు.
 
అంతర్జాతీయ హబ్‌
నిలకడైన ఆర్థిక వృద్ధి, భారీ మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధమైన నగర విస్తరణ, ప్రపంచ దేశాలతో కనెక్టివిటీ వంటి అంశాలు దుబాయ్‌ని అంతర్జాతీయ హబ్‌గా మార్చేశాయని శోభ రియల్టీ చైర్మన్‌ పీఎన్‌సీ మీనన్‌ అన్నారు. శోభ రియల్టీతోపాటు పలు భారత స్థిరాస్తి సంస్థలు కూడా ఈ నగరంలో ప్రాజెక్టులు చేపట్టాయి.