ఠక్కున... ఫారిన్‌ టూర్‌!

విదేశీ పర్యటనలు చెయ్యాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది. కానీ చాలామందికి తగినంత సమయం దొరకదు. ఒక వైపు ప్రయాణాలకే రెండు మూడు రోజుల సమయం తీసుకొనే అమెరికా, యూరప్‌ దేశాల టూర్లకు కనీసం పదిరోజులైనా కేటాయించాల్సిందే! సన్నాహాలు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. అయితే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లినంత ఈజీగా... గంట నుంచీ మూడున్నర గంటల్లో మన దేశంలోని ముఖ్య నగరాల నుంచీ చేరుకోగలిగే విదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి కొన్నిటి మీద ఓ లుక్కేద్దాం...
 
 
థాయిలాండ్‌
పర్యాటకులకు స్వర్గథామం థాయిలాండ్‌. ముఖ్యంగా ఇక్కడ నైట్‌లైఫ్‌ టూరిస్టులను సమ్మోహనపరుస్తుంది. ఇరుకుగా ఉండే కాలువల్లో తేలుతూ ఉండే మార్కెట్లు కళ్ళు తిప్పుకోనివ్వవు. నోరూరించే స్ట్రీట్‌ ఫుడ్‌ నుంచి మీరు తప్పించుకోలేరు. ‘ల్యాండ్‌ ఆఫ్‌ స్మైల్స్‌’ అని స్థానికులు ముద్దుగా పిలుచుకొనే ఈ దేశం ఘనమైన చరిత్రకూ, సంస్కృతికీ, ఆలయాలకూ కూడా ఖ్యాతి గాంచింది. సాగర తీరాలూ, దీవుల్లో వెన్నెల రాత్రుల్లో పార్టీలు సరేసరి! అందుకే విదేశీయులు ఎక్కువగా ఇష్టపడే ఆసియా పర్యాటక గమ్యంగా థాయిలాండ్‌ గుర్తింపు పొందింది. వినోదాన్నీ, సాహసాలనూ ఇష్టపడే వారికి పెర్‌ఫెక్ట్‌ డెస్టినేషన్‌ ఇది. 
 
ప్రయాణ సమయం: రెండు గంటల ముప్ఫై నిముషాలు (కోల్‌కతా- బ్యాంకాక్‌ మధ్య)- మూడున్నర గంటలు (హైదరాబాద్‌- బ్యాంకాక్‌ మధ్య)
 వీసా:    ముందుగా తీసుకోవలసిన అవసరం లేదు. ఆ దేశంలో అడుగు పెట్టిన వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రధాన ఆకర్షణలు: బ్యాంకాక్‌లోని గ్రాండ్‌ ప్యాలెస్‌, థాయిలాండ్‌లో అతి పెద్ద దీవి ఫుకెట్‌ ఐల్యాండ్‌, ఆ దేశంలో అతి పురాతన నగరాల్లో ఒకటైన అయుత్తహ్యాలో పురాతన బౌద్ధ శిల్పాలు, సుఖోతాయ్‌లోని ప్రాచీన అవశేషాలు, ఖో సముయ్‌ దీవి, పట్టయ్యా సముద్ర తీరం, ఛియాంగ్‌ రాయ్‌లోని శ్వేత ఆలయం
 
 
నేపాల్‌
నేపాల్‌ ప్రాచీనమైన సంస్కృతికీ, గొప్ప ఆలయాలూ, చారిత్రక కట్టడాలకూ నిలయం మాత్రమే కాదు... అత్యద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారే హిమసీమ కూడా. హిందూ, బౌద్ధ మతాల కలబోతగా కనిపించే నేపాల్‌ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ట్రెక్కింగ్‌, స్కైడైవింగ్‌, బర్డ్‌ వాచింగ్‌... ఇలా ఎన్నో యాక్టివిటీలకు అనువైన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. నేపాల్‌లో భారత కరెన్సీని ఖర్చుపెట్టుకోవచ్చు. అయితే దొంగ నోట్ల బెడద కారణంగా వందరూపాయలకు పైబడిన డినామినేషన్లలో నోట్లను ఈ మధ్యే ఆ దేశం నిషేధించింది.
 
ప్రయాణ సమయం: ఒక గంటా ఇరవై నిముషాలు (కోల్‌కతా- ఖాట్మండూ మధ్య)- గంటా నలభై అయిదు నిముషాలు(ఢిల్లీ- ఖాట్మాండూ మధ్య)
వీసా: భారతీయులకు తప్పనిసరిగా కాదు. ప్రభుత్వ సంస్థ ఇచ్చిన ఫోటో గుర్తింపు కార్డు సరిపోతుంది.
ప్రధాన ఆకర్షణలు: నేపాల్‌ రాజధాని ఖాట్మాండూలోని పశుపతినాథ ఆలయం, అక్కడికి సమీపంలోని బౌద్ధనాథ ఆలయం, ఖాట్మాండూ లోయలో నీటిమీద తేలే బుద్ధ నీలకంఠ (మహా విష్ణువు) విగ్రహం, గౌతమ బుద్ధుడి జన్మస్థలమైన లుంబినీ, ఖాట్మాండూ లోయలోని స్వయంభు ఆలయం, మహేంద్ర గఫా గుహలు, పోఖ్రా లోయ, టెర్రకోట్‌ ఉత్పత్తుల నిలయం ఖక్తాపూర్‌
 
 
ఒమన్‌
ఘనమైన చారిత్రక వారసత్వం, అత్యాధునికమైన సౌకర్యాల కలబోత ఒమన్‌. వేల సంవత్సరాల నాటి కట్టడాలూ, ఇసుక ఎడారులూ, బీచ్‌లూ, ప్రాచీనమైన కోటలూ, సమున్నతమైన పర్వతాలూ ... ఇలా టూరిస్టులను ఆకట్టుకొనే ప్రదేశాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. సిరామిక్‌ వస్తువులు, చేతుల్తో తయారు చేసిన సంప్రదాయ డిజైన్ల నగలూ, లెదర్‌ వస్తువులూ, ఊలు ఉత్పత్తులు మంచి నాణ్యతతో ఈ దేశంలో లభిస్తాయి. జూన్‌- ఆగస్ట్‌ నెలల మధ్య ఎండలు తీవ్రంగా ఉంటాయి. మిగిలిన ఏ నెలల్లోనైనా సందర్శనకు ఈ దేశం అనువుగా ఉంటుంది.
 
ప్రయాణ సమయం: రెండు గంటల యాభై నిముషాలు (ముంబాయి- మస్కట్‌ మధ్య)- మూడుగంటల నలభై నిముషాలు (హైదరాబాద్‌- మస్కట్‌ మధ్య)
వీసా: భారతదేశ పౌరులు ఒమన్‌ ఏంబసీ నుంచి వీసా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రధాన ఆకర్షణలు: ఇబ్రా నగరం నుంచి వహీబా ఇసుక మేటల్లో ఒంటెలు, జీపుల మీద ప్రయాణం, బహ్లా కోట, నిజ్వా కోట, మసీద్‌, మసీరా దీవి, మస్కట్‌లో సుల్తాన్‌ కాబూస్‌ గ్రాండ్‌ మసీదు, సుర్‌ ప్రాంతంలో ఎడారిని కలిసే సముద్రతీరం, సుమ్‌హురాన్‌లో రెండువేల ఏళ్ళ క్రితం నాటి ప్రాచీన నౌకాశ్రయం అవశేషాలు
 
 
 భూటాన్‌
దక్షిణాసియాలో మాల్దీవుల తరువాత అతి తక్కువ జనాభా ఉన్న దేశం భూటాన్‌. మన దేశానికి ఎంతో సమీపంలో ఉన్నా, చూడచక్కని అందాలకు నెలవైనా భూటాన్‌కు వెళ్ళే భారతీయుల సంఖ్య తక్కువే. ఈ దేశంలోని సమున్నతమైన పర్వతాలు ట్రెక్కింగ్‌కు ఎంతో అనువుగా ఉంటాయి. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఇది ఒకటి. వన్య ప్రాణులకూ, వృక్ష సంపదకూ, అపురూపమైన బౌద్ధ సంస్కృతికీ నిలయం భూటాన్‌. బౌద్ధారామాలతో విలసిల్లే ఈ దేశం కాలుష్యరహితంగా ఉంటుంది. భూటాన్‌ రాజధాని థింపో. అక్కడికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో పారో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ దేశంలో ఏడాది పొడుగునా ఏవో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.
 
ప్రయాణ సమయం: ఒక గంటా పది నిముషాలు (కోల్‌కతా- పారో మధ్య)- రెండు గంటలు (న్యూఢిల్లీ-పారో మధ్య)
వీసా: భారతీయులకు తప్పనిసరి కాదు. ప్రభుత్వ సంస్థ ఇచ్చిన ఫోటో గుర్తింపు కార్డు సరిపోతుంది.
ప్రధాన ఆకర్షణలు: పదహారో శతాబ్దంలో నిర్మించిన రిన్‌పుంగ్‌ కోట, పునాఖాలోని కోట, వేలాడే వంతెన, థింపూలో పర్వత పాదాల దగ్గర నిర్మించిన బుద్ధ 169 అడుగుల బుద్ధ విగ్రహం, టైగర్‌ నెస్ట్‌ బౌద్ధారామం, నూట ఎనిమిది స్థూపాల దోఛులా పాస్‌
 
 
శ్రీలంక
సంస్కృతి పరంగా, పౌరాణికంగా భారత్‌తో ఎంతో సన్నిహితమైన దేశం శ్రీలంక. ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా సందర్శించడానికి ఈ దేశం అనువుగా ఉంటుంది. అద్భుతమైన సాగర తీరాలూ, వన్యప్రాణులూ, అరుదైన వృక్షాలతో అలరాలే అటవీ ప్రాంతాలూ, నేషనల్‌ పార్కులూ, సమున్నతమైన ఆలయాలూ, కోటలూ శ్రీలంక ప్రత్యేకతల్లో కొన్ని. రామాయణ గాథలో ప్రస్తావించిన ప్రదేశాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. ఈ మఽధ్య ‘రామాయణ్‌ యాత్ర’ పేరిట మన దేశం నుంచి ఐఆర్‌సిటిసి లాంటి సంస్థలు ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి. అంతేకాదు, తక్కువ బడ్జెట్‌లో శ్రీలంకను చుట్టేసి రావచ్చు.
 
ప్రయాణ సమయం: ఒక గంటా ఇరవై నిముషాలు (చెన్నై- కొలంబో మధ్య)- గంటా యాభై నిముషాలు
(హైదరాబాద్‌ - కొలంబో మధ్య)
వీసా: భారతీయులకు అవసరంలేదు. అయితే స్పెషల్‌ పర్మిట్‌ (ఇటిఎ- ఎలకా్ట్రనిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్‌) తీసుకోవాలి.
ప్రధాన ఆకర్షణలు: క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నాటి ధంబుల్లా గుహాలయం, నువారా ఎలియా సమీపంలోని సీతమ్మ గుడి, కొలంబోలోని గంగరామయ ఆలయం, కాండీ నగరంలో బుద్ధుడి దంతం భద్రపరచిన మందిరం, మ్యూజియం, ఎలియా, కాండీ తదితర ప్రాంతాల్లోని జలపాతాలు, కాండీ నుంచి ఎల్లా వరకూ కొండల్లోంచీ, సొరంగాల్లోంచీ సాగే రైలు ప్రయాణం, మిరిస్సా సముద్ర తీరంలో డాల్ఫిన్లు