పాన్‌కార్డుల జారీకి నూతన విధానాలు

ఉద్యోగుల కోసం ప్రత్యేక నిబంధనలు 

ఆధునిక పద్ధతిలో కార్డుల జారీ

ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అవసరమైన పర్మనెంట్‌ అకౌంటు నంబరు (పాన్‌)కార్డులను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఆర్దిక అవసరానికి ఎంతో ఉపయోగపడే ఈ కార్డు ప్రాధాన్యత ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ప్రతి వారికి ఈ కార్డు అవసరం ఉన్పప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన వ్యవహారాలకు బ్యాంకు లావాదేవీలకు తప్పనిసరి చేశారు ఇందువల్ల ఉద్యోగుల జీవితాల్లో ఈ కార్డు ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఉద్యోగంలో చేరిన ప్రతివారు పాన్‌ కార్డును తీసుకోవడానికి  సిద్దపడుతుంటారు. ప్రభుత్వం నుంచి ఆధాయం పొందుతున్న వ్యక్తులు కార్డు కలిగి ఉండటం వల్ల ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో ఈ పాన్‌ కార్డులను  జారీ చేస్తుంటారు ఈ కార్డులను ఆదాయ పన్ను శాఖకు అనుసంధానం చేసి వారి నియంత్రణలో ఉంచడం వల్ల ఉద్యోగుల ఆదాయ వ్యయాలన్నీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.  ఇటీవల కాలంలో ఈ పాన్‌ కార్డును ఉద్యోగుల ఆధార్‌ కార్డుతో కూడా లింక్‌ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి. నిత్య జీవితంలో  ఉద్యోగులు ఉపయోగిస్తున్న రేషను కార్డు ఆధార్‌ కార్డు గుర్తింపుకార్డు ఏటీఎం కార్డుల కన్నా పాన్‌కార్డు ప్రాధాన్యత ఎంతో ఎక్కువైంది. ఉద్యోగులందరికి ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన విధించారు.
 
పాన్‌ కార్డు గురించి..
ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లిస్తున్న వారైనా తప్పనిసరిగా ఈ కార్డులను కలిగి ఉండాలి. ప్రతి కార్డుకు ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. అందులో ఉద్యోగి పుట్టిన సంవత్సరం సంఖ్య కూడా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఈ సంఖ్య ద్వారా ఉద్యోగి ఆర్థిక లావాదేవీలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణ కిందకు వస్తాయి. ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులు ప్రతి సంవత్సరం తమ ఆదాయ వ్యయాలకు సంబంధించిన రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందించడానికి పాన్‌కార్డు తప్పనిసరి. ఈ కార్డులను ఆధార్‌తో లింకు చేయడం వల్ల సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతోంది.
 
ఎలా తీసుకోవాలి
 • జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి పాస్‌ సర్టిఫికెట్‌, చిరునామా ధ్రువీకరణ. వ్యక్తిగత గుర్తింపు కార్డు, ఆధార్‌, ఓటరు కార్డు డ్రైవింగు లైసెన్సు పాస్‌ పోర్టు.
 • ఆదాయపన్ను శాఖ నుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే పాన్‌ కార్డులను తీసుకోవాలి.
 • యూటీఐ,యూటీ ఐటీఎఫ్‌ఎల్‌ సెంటర్లు కార్వే సంస్థ టిన్‌ వంటి సంస్థలకు ఈ పాన్‌కార్డులను జారీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ కేంద్రాలలో మాత్రమే కార్డుల కోసం  ధరఖాస్తులు చేసుకోవాలి
 • వెబ్‌సైట్‌ ద్వారా కూడా నేరుగా ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌కంటాక్సు ఇండియా డాట్‌ జిఓవి.డాట్‌ ఇన్‌కి దరఖాస్తు చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ యూటీఐఐటీఎల్‌ డాట్‌కాం లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టీఐఎన్‌.డాట్‌ ఎన్‌ఎస్‌డీఎల్‌ డాట్‌కాం వంటి సైట్‌లలో కూడా నమోదు చేసుకోవాలి.
 • మీసేవా ఈసేవా కేంద్రాల ద్వారా పాన్‌కాక్డు కోసం ధరఖాస్తును పంపించడానికి అవకాశం లేదు.  పాన్‌కార్డు కోసం ప్రభుత్వ ప్రవేశపెట్టిన జిఎస్‌టీ పన్నుతో కలిపి రూ.110 మాత్రం చెల్లించవలసి ఉంటుంది.
 • భారత దేశానికి చెంది  విదేశాలలో ఉంటున్న వారు కూడా అక్కడి నుంచి దరఖాస్తు చేసుకుని దీనిని పొందవచ్చు వారి విదేశీ చిరునామాకు పంపించడానికి రూ.910లు చెల్లించవలసి ఉంటుంది.
 • అన్ని వివరాల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్న తర్వాత 15 రోజులకు ఇచ్చిన చిరునామాకు పాన్‌కార్డు  అందుతుంది.
కార్డు తప్పనిసరి చేసిన అంశాలు
 • రూ.2 లక్షలకు పైబడి బంగారం ఇతర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా పాన్‌కార్డును అందించాలి
 • రూ.50. వేలకు పైబడి బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసినా ఒకేసారి రూ.50 వేలు విత్‌డ్రా చేసినా పాన్‌కార్డును ఇవ్వాలి.
 • ఎల్‌ఐసీ ప్రీమియం సొమ్ముని ఒకేసారి రూ.50 వేలకు పైబడి  చెల్లిస్తున్నట్లయితే పాన్‌ నంబరును తప్పనిసరిగా అందించాలి.
 • బ్యాంకుల నుంచి డెబిట్‌ కార్డులను క్రెడిట్‌ కార్డులను తీసు కోవాలంటే పాన్‌కార్డును లేదా నంబరును తెలియజే యాలి.
 • కార్లు ఇతర పెద్ద వాహనాలను కొనుగోలు చేసే సమయంలో కూడా పాన్‌ కార్డును అందించవలసి ఉంటుంది.
 • మ్యూచువల్‌ ఫండ్సులో పెట్టుబడులు పెట్టే  సమయంలో కూడా పాన్‌కార్డులను తప్పనిసరిగా జత చేయాలి.
ఉద్యోగులకు ప్రయోజనాలు
 • ఉద్యోగులకు పాన్‌కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇతర గుర్తింపు  కార్డుల మాదిరిగా ఈ కార్డును ఉపయోగించుకునే అవకాశం ఉంది
 • ఆదాయం పన్నుని చెల్లిస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు వారు ఏడాది కాలంలో చేసిన ఆర్థిక వ్యవహాలకు సంబంధించిన 26 ఏఎస్‌ స్టేట్‌మెంటును ఆదాయ పన్నుల శాఖ అధికారులు ఈ కార్డుదారులకు సంవత్సరానికి ఒకసారి పంపిస్తారు.
 • ఆదాయపన్నుని చెల్లిస్తున్న ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మరుసటి సంవత్సరం మార్చి నెలాఖరు వరకు వారు జరిపిన ఆర్థిక లావాదేవీలకు రికార్డు చేసి జాబితా రూపంలో పంపిస్తారు
 • ఈ జాబితా ఆధారంగా ప్రతి సంవత్సరం ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ ఆదాయానికి సంబంధించి సమర్పించే ఫారం 16ను పంపించడానికి సులభతరం అవుతుంది
 • ఉద్యోగుల ఆస్తులకు చట్టబద్దత ఉంటుంది. ఈ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేస్తుండటం వల్ల మరింత భద్రత కలుగుతుంది.
 • బ్యాంకులకు సంబంధించి అన్ని లావాదేవీలకు ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది.
 • ఈ కార్డుపై ఫొటోను కూడా వేస్తుండటం వల్ల అధికారిక గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.
 • రానున్న కాలంలో పాన్‌కార్డును సిటిజన్‌ కార్డుగా కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది ఇందువల్ల ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
పాన్‌ కార్డు ఆధార్‌తో అనుసంధానం
ఉద్యోగులకు ఉన్న పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అను సంధానం చేసుకునే కార్యరక్రమాన్ని అధికారులు చేపడుతున్నారు. ఉద్యోగులు ఈ కార్డులను అధికారికంగా జారీచేసే సంస్థల వద్దకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని చేయించుకోవాలి. లేదా ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉన్న కంప్యూటర్ల ద్వారా కూడా ఎవరి మట్టుకు వారు అను సంధానం చేసుకునే అవకాశం ఉంది డిసెంబరు నెలాఖరులోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్‌ ఇన్‌కంటాక్సు ఇండియా డాట్‌ జిఓవి.డాట్‌ ఇన్‌ అనే వెబ్‌సైటులోకి వెళ్లి పాన్‌నంబరు ఆధార్‌ నంబరు నమోదు చేసి అనుసంధానం  చేసుకోవవచ్చు లేదా పాన్‌కార్డులను అధికారికంగా జారీ చేసే సంస్థల వద్దకు వెళ్లి అయినా ఈ కార్యక్రమాన్ని చేయించుకోవాలి.
 
వెసులుబాటు కల్పించాలి
ఉద్యోగుల పాన్‌ కార్డుల జారీ విషయంలో వెసులుబాట్లు కల్పించాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ కార్డులను తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఏజెంట్లను సంప్రదించకుండా ఆయా శాఖాధిపతులే కార్యక్రమాలను చేపట్టడానికి ఏర్పాట్లుచేయాలి. పాన్‌ కార్డును అధికారిక గుర్తింపు కార్డుగా ప్రభుత్వం ప్రకటించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
-జి.శ్రీనివాస్‌, సైన్స్‌ టీచర్‌, రైల్వే హైస్కూలు విశాఖపట్నం
 
 
ఆధార్‌ లింక్‌పై అవగాహన కల్పించాలి

పాన్‌కార్డును ఆధార్‌ కార్డుతో లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం గడువు నెలాఖరుతో ముగుస్తోంది. సమయం తక్కువగా ఉన్నందున వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలి. అనుసంధానం గురించి చాలామందికితెలియదు. పాన్‌ కార్డులు జారీచేసే అధికారిక కేంద్రాలు విశాఖలో మాత్రం ఉన్నాయి.  గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్న ఉద్యోగులకు చాలా ఇబ్బంది అవుతుంది వివిధ శాఖాధిపతులు ఈ అనుసంధాన కార్యక్రమం చేసేలా ఆదేశాలు జారీ చేయాలి.      

 -కె.బంగారయ్య, పీఎస్‌ హెచ్‌ఎం, గాదిరాయి, మాడుగుల