ప్రస్తుతం ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళితే జేబులో డబ్బులున్నా లేకపోయినా క్రెడిట్ కార్డు ఉందా? అని అడుగుతున్నారు. చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే చాలు. అత్యవసర నగదు ఖర్చుల నుంచి బయటపడొచ్చనేంతగా రోజులు మారిపోయాయి. దీనికి తోడు కొద్దిగా ఆర్థిక స్థిరత్వం కనిపిస్తే చాలు.. బ్యాంకులు వెంటపడి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. అలా అని చేతిలో క్రెడిట్ కార్డు ఉందని ఎడాపెడా ఖర్చు పెట్టేస్తే జేబు గుల్లవటం ఖాయం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తొలిసారిగా క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో బ్యాంక్‌బజార్ డాట్‌కామ్ సిఇఒ అదిల్ షెట్టి ‘ఆంధ్రజ్యోతి బిజినెస్ ప్లస్’ పాఠకులకు వివరిస్తున్నారు.
చెల్లింపులు..
క్రెడిట్ కార్డు బకాయిలను నిర్ణీత సమయంలోగా ఒకేసారి చెల్లించవచ్చు. లేదా ప్రతి నెల క్రెడిట్ కార్డు కంపెనీ నిర్ణయించే కనీసం మొత్తం చొప్పున చెల్లించవచ్చు. సాధారణంగా ఈ కనీస మొత్తం చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో ఐదు శాతం ఉంటుంది. స్టేట్‌మెంట్ సిద్ధం చేసే రోజుకు ఉన్న మొత్తం బకాయిని ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటారు. దీనిపై వడ్డీని రోజువారీ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. మొత్తం బకాయిలో కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించే ఖాతాదారులకు ఎలాంటి వడ్డీ రహిత పరపతి సమయం (ఇంటరెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్) ఉండదు. పూర్తి మొత్తం చెల్లించే లోపే క్రెడిట్ కార్డుపై ఇంకా ఏవైనా కొంటే, మొత్తం బాకీ చెల్లించే వరకు వడ్డీ భారం ఏ నెలకు ఆ నెల పెరిగిపోతుంటుంది.
జరిమానాలు..
క్రెడిట్ కార్డు బకాయిలను నిర్ణీత తేదీలోగా చెల్లించి వేయాలి. లేకపోతే పెనాల్టీల భారం పడుతుంది. ఈ భారం కార్డులు జారీ చేసిన బ్యాంకును బట్టి మారుతుంటుంది. మళ్లీ ఇందులో బకాయి మొత్తం, కార్డు రకం కూడా కీలక పాత్ర వహిస్తాయి. ఒక ప్రముఖ బ్యాంకైతే చెల్లింపుల్లో ఆలస్యమైతే రూ.5,000 వరకు ఉంటే బకాయిలపై రూ.400, రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఉండే బకాయిలపై రూ.500 చొప్పున, రూ.20,000 మించిన బకాయిలపై రూ.700 చొప్పున పెనాల్టీ వసూలు చేస్తోంది. ఈ పెనాల్టీకి తోడు వడ్డీ రేటూ పెరిగిపోతుంది.
వార్షిక చార్జీలు..
బ్యాంకులు క్రెడిట్ కార్డు వినియోగదారుల నుంచి వార్షిక చార్జీలు లేదా వార్షిక నిర్వహణ చార్జీలు కూడా వసూలు చేస్తుంటాయి. కార్డు జారీ చేసే బ్యాంక్, క్రెడిట్ కార్డు రకాన్ని బట్టి ఈ చార్జీలు మారుతుంటాయి. పెద్ద మొత్తంలో క్రెడిట్‌కు అవకాశం ఉండే కార్డులపై ఈ చార్జీలు వేలల్లో ఉంటాయి. ఖాతాదారులను ఆకర్షించేందుకు సాధారణంగా బ్యాంకులు ప్రారంభంలో ఈ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుంటాయి. ఒక నిర్ణీత మొత్తానికి మించి ఖర్చు చేసే ఖాతాదారులకూ ఈ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. క్రెడిట్ కార్డు తీసుకునే ముందే ఈ చార్జీల గురించి తెలుసుకోవడం మంచిది.
వడ్డీ రేటు..
బ్యాంకులు నిర్ణీత సమయం దాటిన తర్వాత చెల్లించే బకాయిలపై నెలకు 1.7 శాతం నుంచి 3.5 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంటాయి. చూసేందుకు ఇది కొద్దిగానే కనిపించినా వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ వడ్డింపు 20 నుంచి 40 శాతం వరకు ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డు బకాయిలపై చెల్లించేంత వడ్డీ మరే రుణాలపైనా ఉండదు.
క్రెడిట్ స్కోర్..
క్రెడిట్ కార్డు బకాయిలో విఫలమైనా లేదా సకాలంలో చెల్లించకపోయినా అధిక వడ్డీ, పెనాల్టీలతో పాటు ఆయా వ్యక్తుల వ్యక్తిగత పరపతి స్కోరింగ్‌పైనా ఆ ప్రభావం పడుతుంది. ఎవరైనా క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపుల్లో మూడు రోజులకు మించి ఆలస్యం చేస్తే అలాంటి వ్యక్తులపై పెనాల్టీ విధించడంతో పాటు వారి వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇవ్వాలని ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ).. బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. 90 రోజుల నిర్ణీత వ్యవధిలోగా క్రెడిట్ కార్డు కనీస బకాయిలు చెల్లించని వ్యక్తుల రుణాలను మొండి బకాయిలుగా పరిగణిస్తారు. దాంతా అలాంటి వ్యక్తుల వ్యక్తిగత పరపతి స్కోరింగ్ పడిపోతుంది. అలాంటి వ్యక్తులు కొత్తగా రుణాలు తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా కష్టమవుతుంది.
పరపతి వినియోగ నిష్పత్తి..
అవకాశం ఉంది కదా అనీ క్రెడిట్ కార్డు రుణ పరపతి మొత్తాన్ని వినియోగించుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు పరపతి పరిమితిలో 20-30 శాతం మించికుండా ఉపయోగించుకోవాలి. ఉన్న పరిమితిలో ప్రతి నెలా యాభై శాతం వరకు వాడేసుకుంటే పరపతి రేటింగ్ కంపెనీలు వీడెవడో అప్పుల అప్పారావులా ఉన్నాడని మీ పరపతి స్కోరింగ్ తగ్గించే అవకాశం ఉంది. తరచూ ఉన్న పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ పరపపతి ఉపయోగించుకోవాలనుకుంటే వ్యూహం మార్చడం ఒక్కటే మార్గం. ఇందుకోసం పరపతి పరిమితి పెంచుకోవడం లేదా అనేక క్రెడిట్ కార్డులతో చెల్లింపుల ద్వారా ఖర్చులు విభజించడం ఒక మార్గం. ఇవన్నీ ఎందుకనుకుంటే ఖర్చులను వీలైనంత కనీస స్థాయికి తగ్గించుకోవడం అన్నిటి కంటే ఉత్తమ మార్గం.
ఈ విషయాలు అర్థం చేసుకుని క్రెడిట్ కార్డును పరిమిత స్థాయిలోనే ఉపయోగించుకోవాలి. లేకపోతే ఖర్చులు అదుపు తప్పి క్రెడిట్ కార్డు కంపెనీలు బకాయిల వసూలు కోసం ఇంటికొచ్చి మరీ పరువు తీసే ప్రమాదమూ ఉంటుంది.
బిల్లింగ్ సైకిల్..
క్రెడిట్ కార్డు కంపెనీలు కార్డుపై ఏదైనా చెల్లింపులు చేశాక 45 లేదా 50 రోజుల వరకు వడ్డీ లేకుండా చెల్లించేందుకు గడువు ఇస్తుంటాయి. చాలా మంది ఈ గడువు క్రెడిట్ కార్డు ద్వారా కొన్న వస్తువులపై చెల్లింపు చేసిన తేదీ నుంచి అనుకుంటారు. ఇది నిజం కాదు. ఉదాహారణకు మన క్రెడిట్ కార్డు బిల్లింగ్ గడువు ప్రతి నెలా 10న ప్రారంభమవుతుందనుకుందాం. ఏదైనా ఒక నెల 7న మనం క్రెడిట్ కార్డు చెల్లింపు ద్వారా ఏదైనా వస్తువు కొంటే మరో మూడు రోజుల్లోగా ఆ బకాయి చెల్లించేయాలి. లేకపోతే నాలుగో రోజు నుంచి వడ్డీ వడ్డింపు ప్రారంభమవుతుంది. క్రెడిట్ కార్డు తీసుకునే ముందే ఈ బిల్లింగ్ సైకిల్‌ను అర్థం చేసుకోవాలి.