విదేశ టూర్లకు వెళ్తే ఇవి తప్పనిసరి

ప్యారిస్‌ చూడటానికి ప్లాన్‌ చేసుకున్నా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వెళుతున్నా ట్రావె లింగ్‌లో కొన్ని వస్తువులను తప్పకుండా వెంట ఉంచుకోవాలి. వెళుతున్న ప్రదేశంతో సంబంధం లేకుండా వీటిని తీసుకెళ్లడం మరువద్దు. 

కంఫర్టబుల్‌ షూస్‌ : టూర్‌కు వెళుతున్నప్పుడు మైళ్ల దూరం నడవాల్సి రావచ్చు. కాబట్టి తప్పకుండా ఒక జత కంఫర్టబుల్‌ షూస్‌ ఉండేలా చూసుకోవాలి. 

మ్యాప్‌: స్మార్ట్‌ఫోన్‌ ఉంది. ఆన్‌లైన్‌ సోషల్‌ మీడియా అప్లికేషన్లున్నాయి. జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌ ఉంది. ఇంకా భయమేంటి? అనుకోకండి. మీరు వెళుతున్న ప్రదేశంలో నెట్‌వర్క్‌ ఉండకపోవచ్చు. కాబట్టి మ్యాప్‌ను వెంట ఉంచుకోండి. విజిట్‌ చేస్తున్న ప్రదేశానికి సంబంధించిన మ్యాప్‌ లేదా గైడ్‌బుక్‌ ఉంటే మంచిది. 

పోర్టబుల్‌ చార్జర్‌: సెల్‌ఫోన్‌, ఐపాడ్‌ లేకుండా కాలు బయటపెట్టని రోజులివి. టూర్‌కి వెళుతున్నప్పుడు సెల్‌ఫోన్‌, ఐపాడ్‌ వినియోగం కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే పోర్టబుల్‌ చార్జర్‌ పెట్టుకోవడం మరిచిపోవద్దు. టూర్‌లో మొబైల్‌ ఫోన్‌తో ఫొటోలు తీయడం అందరూ చేసేదే. దీనివల్ల బ్యాటరీ త్వరగా తగ్గిపోతుంది. కాబట్టి పోర్టబుల్‌ చార్జర్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి. 

డూప్లికేట్‌ డాక్యుమెంట్లు: ఒకవేళ విదేశాలకు టూర్‌ వెళుతున్నట్లయితే ముఖ్యమైన డాక్యుమెంట్లను ఒక సెట్‌ డూప్లికేట్‌ తీసి పెట్టుకోండి. పాస్‌పోర్ట్‌, వీసా, ఐడీప్రూఫ్స్‌ వంటి వాటి జిరాక్స్‌ తీసి పెట్టుకోవడం మరువద్దు.