ఆధునిక జీవితంలో హాలీడే ఒక భాగంగా మారింది. ఎపుడూ రొటీన్‌గా ఉంటే లైఫ్ బోరు కొడుతుంది. తీర్థ యాత్రలు లేదా విహార యాత్రలతో ఈ సమస్య నుంచి కొంతలో కొంత బయట పడొచ్చు. భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్న, దేశంలోని వివిధ టూరిస్టు కేంద్రాలను సందర్శిస్తున్న యాత్రికల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. కుటుంబంతో నాలుగు రోజులు జాలీగా హాలీడే ఎంజాయ్ చేయాలంటే టైమ్ దొరకడంతో పాటు డబ్బు కూడా ఉండాలి. ఖాతాలో డబ్బులు లేకపోయినా జేబులో క్రెడిట్ కార్డు ఉంటే చాలన్న భరోసా చాలా మందిలో ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు మాత్రమే కాదు విహార యాత్రికుల కోసం ట్రావెల్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ రెండింటిలో ఏది బెటరో ముందే తేల్చుకోండి..
పొదుపు చేసిన డబ్బులతో విహార యాత్రకు వెళ్లినా, అక్కడ ఏదైనా అత్యవసర ఖర్చులు లేదా షాపింగ్ చేయాలనుకుంటే చాలా మంది క్రెడిట్ కార్డులనే ఆశ్రయిస్తారు. మన దేశంలో క్రెడిట్ కార్డులు ప్రవేశపెట్టినప్పటితో పోలిస్తే ఇపుడు ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పులు వచ్చాయి. అప్పట్లో క్రెడిట్ కార్డు జేబులో ఉన్నా ఉపయోగించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. అలవాటు లేకపోవడం ఒక కారణమైతే, కళ్లు చెదిరే వడ్డీ రేట్లు కూడా ఇందుకు కారణం. ఇప్పుడు ఆ ఆలోచనా విధానం మారిపోయింది. వెనకా ముందు చూడకుండా క్రెడిట్ కార్డులతో ఎడాపెడా ఖర్చు చేసేస్తు న్నారు. తర్వాత ఆ బకాయిలు చెల్లించలేక అనేక మంది ఆపసోపాలు పడుతున్నారు. విహార యాత్రల్లో క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసినా ఇదే సమస్యలు ఎదురవుతాయి. పైగా క్రెడిట్ కార్డులకు గరిష్ట పరిమితి ఉంటుంది. పరిమితిని దాటి ఖర్చుపెట్టడం సాధ్యం కాదు.
ట్రావెల్ రుణాలు బెస్ట్..
అప్పు చేసైనా సరే ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలనుకుంటే క్రెడిట్ కార్డు కంటే ట్రావెల్ లోన్ తీసుకోవడం మంచిది. ఈ లోన్ కోసం వచ్చిన అప్లికేషన్లను బ్యాంకులు ఆమోదిస్తే 24 గంటల్లోపే డబ్బులు చేతికి అందుతాయి. క్రెడిట్ స్కోరు బాగుంటే బ్యాంకులు త్వరగానే ఈ రుణాలకు ఆమోదం తెలుపుతాయి. తర్వాత ఈ రుణ మొత్తాన్నీ సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు.
ఎక్కువ ఆదాయం..
వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి ఆదాయంతో పోలిస్తే ట్రావెల్ రుణాలు తీసుకునే వారి ఆదాయం సాధారణంగా 30 శాతం ఎక్కువగా ఉన్నట్టు ఒక సర్వేలో తేలింది. దీంతో అధిక ఆదాయ వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకూ పెద్ద ఇబ్బంది ఉండదు. అందుకే ఇటీవల ట్రావెల్ రుణాలకూ డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే గత రెండు నెలల్లో ఈ రుణాల డిమాండ్ 18 శాతం పెరిగినట్టు మార్కెట్ వర్గాల సమాచారం.
రుణ మొత్తం..
ఏటా సెప్టెంబరు, అక్టోబరు నెలలు విహార యాత్రలకు బిజీ టైమ్. దీంతో చాలా మంది ఈ సమయంలోనే ట్రావెల్ లోన్లతో ఏదో ఒక పర్యాటక ప్రదేశానికి బయలు దేరుతుంటారు. ట్రావెల్ లోన్ కింద దేశంలోని పర్యాటక కేంద్రాలు చుట్టి వచ్చేందుకు బ్యాంకులు రూ.50,000 నుంచి రూ.3 లక్షల వరకు రుణంగా ఇస్తాయి. అయితే ఇది ఆ వ్యక్తి ఆదాయాన్ని బట్టి, క్రెడిట్ స్కోరుని బట్టి మారుతుంటుంది. సగటున చూసుకున్నా లక్ష రూపాయల వరకు ట్రావెల్ లోన్ లభిస్తుంది. అదే విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలు చుట్టి రావాలంటే కుటుంబానికి రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు మంజూరు చేస్తాయి. న్యూజిలాండ్ వంటి దేశాల్లోని చూడచక్కని ప్రాంతాలు రెండు మూడు వారాల్లో చూసి వచ్చేందుకు ఈ మొత్తం సరిపోతుంది.
వడ్డీ రేటు..
క్రెడిట్ కార్డులతో పోలిస్తే ట్రావెల్ లోన్లపై వడ్డీ రేటు తక్కువ. గడువు దాటాక క్రెడిట్ కార్డు బకాయిలపై 36 నుంచి 40 శాతం వడ్డీ పడుతుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కూడా చెల్లించాల్సి వస్తుంది. అదే ట్రావెల్ లోన్లపై అయితే వడ్డీ రేటు14 శాతం నుంచి ప్రారంభమవుతుంది. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఏ విధంగా చూసుకున్నా ఇది తక్కువే. దీని ప్రకారం చూసినా మూడేళ్ల కాల పరిమితికి తీసుకునే రూ.లక్ష ట్రావెల్ లోన్‌పై దాదాపు రూ.42,000 ఆదా చేసుకోవచ్చు. ఈంఐల చెల్లింపు భారమూ తక్కువగానే ఉంటుంది. కొన్ని దేశాల్లో కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులను ఆమోదించరు. ఆ విధంగా చూసినా అప్పు చేసైనా విహార యాత్రలు చేయాలనుకునే వ్యక్తులకు క్రెడిట్ కార్డుల కంటే ట్రావెల్ లోన్లు మంచి ఆప్షన్.