పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌లో.. తప్పులతో తిప్పలే!

విలువైన అవకాశాలకు దూరమయ్యే ప్రమాదం

ప్రభుత్వ రికార్డుల్లో తప్పులు సవరించుకోవడం శ్రేయస్కరం
ముందస్తు పరిశీలన తప్పనిసరి

పేదలు చౌకడిపోల నుంచి నిత్యావసర వస్తువులు పొందాలంటే రేషన్‌ కార్డు కావాలి. దానికి అనుసంధానంగా ఆధార్‌ కార్డు ఉండాలి. కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా పొందాలంటే వైద్య సేవ కార్డు ఉండాలి. బైక్‌ ఉంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. డ్రైవర్‌ వృత్తి చేపట్టాలంటే లైట్‌ వెహికల్‌, హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. ఎక్కువ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబరు) కావాలి. విద్యార్థులకు విద్యార్హతలను నిర్ధారించే ధ్రువీకరణ పత్రాలు ఎంతో అవసరం. వీటన్నింటిలోనూ తప్పులు లేకుండా చూసుకోవాలి. ఆయా కార్డులు, ధ్రువీకరణ పత్రాలు పొందే సమయంలోనే ఒకసారి సరిచూసుకోవాలి. వాటిలో తప్పులు దొర్లితే వెంటనే సరిచేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే ఆ తరువాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆయా కార్డులు, ధ్రువీకరణ పత్రాల్లో తప్పులు నమోదయితే సవరణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కథనం..
 
రేషన్‌ కార్డు
ప్రస్తుతం ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్‌ కార్డు లింక్‌ అవుతోంది. చౌక దుకాణాలకు, పింఛన్‌కు,  వైద్యం తదితర సేవలు పొందడానికి రేషన్‌ కార్డు అవసరం. ఇందులో తప్పులుంటే ప్రభుత్వ పథకాలు వర్తించవు. జిల్లాలో చాలా రేషన్‌ కార్డుల్లో తప్పులు ఉంటున్నాయి. వీటి సవరణకు సమీపంలోని పౌర సరఫరాల అధికారులకు మండల తహసీల్దార్‌, ఆర్డీవోలకు దరఖాస్తు చేయాలి. తప్పులను సూచిస్తూ కార్డు నకలును దరఖాస్తుకు జతచేయాలి. నివాస, ఆదాయ, ఓటరు గుర్తుంపు కార్డులను వీటికి జత చేయాలి. దగ్గరలోని మీ-సేవ కేంద్రం ద్వారా కానీ, నేరుగా గానీ అధికారులకు దరఖాస్తు చేయాలి. వీటితో పాటు రూ.25 చలానా జత చేయాలి. వీటిని అధికారులు పరిశీలించి తనిఖీ చేసి సంబంధిత అధికారికి సిఫారసు చేస్తారు. ఏపీ ఆన్‌లైన్‌, మీ-సేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకుని తప్పులను సవరించుకోవచ్చు.

పాన్‌ కార్డు
ఆదాయపు పన్ను శాఖ అందించే శాశ్వత ఖాతా నంబరు (పాన్‌ కార్డు)తో ఆదాయపు పన్ను చెల్లింపులు, బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో ఏ చిన్న తప్పు దొర్లినా అది ఉపయోగపడదు. పాన్‌ నెంబరు బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఇందులో తప్పులుంటే బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కార్డులోని తప్పులకు సంబంధించిన వివరాలతో కూడిన దరఖాస్తుతో పాటు రూ.50 చలానా జత చేయాలి. ఈ దరఖాస్తును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు నేరుగా గానీ ఆన్‌లైన్‌లో కానీ అందజేయాలి. వీటిని పరిశీలించిన తర్వాత కొత్త పాన్‌కార్డు జారీ చేస్తారు. 
డ్రైవింగ్‌ లైసెన్స్‌
డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా బండి నడుపుతూ పోలీసులకు పట్టుబడితే జరినామా చెల్లించక తప్పదు. లైసెన్స్‌లో చిన్న తప్పు దొర్లినా ప్రమాద సమయంలో రావాల్సిన బీమా పరిహారం చేజారిపోతుంది. ఇందులోని తప్పులను సవరించుకునే అవకాశం ఉంది. ఎల్‌ఎల్‌ఆర్‌లో అందులోని పేరు, పుట్టిన తేదీ తప్పు ఉంటే ఆర్డీవో కార్యాలయానికి తెలిపితే వారు సవరిస్తారు. శాశ్వత లైసెన్స్‌లో తప్పులుంటే రూ.475 చలానా కట్టి దరఖాస్తు సమర్పిస్తే తప్పులను సవరించి కొత్త లైసెన్స్‌ జారీ చేస్తారు.

పాస్‌పోర్ట్‌
భారత పౌరసత్వాన్ని ధ్రువీకరించే పాస్‌పోర్ట్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇందులో చిన్న తప్పు ఉన్నా అది చెల్లుబాటు కాదు. విదేశాలకు వెళ్లాల్సి వస్తే వీసా పొందడం దుర్లభం అవుతుంది. ప్రతీ అంశం కచ్చితంగా ఉండాలి. పాస్‌పోర్టులో తప్పులు దొర్లితే వాటి సవరణకు ఆన్‌లైన్‌లో పాస్‌పోర్టు కార్యాలయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో సవరించాల్సిన వివరాలను నమోదు చేసి, పాస్‌పోర్టు కార్యాలయానికి రూ.1500 చలానా కట్టాలి. తప్పులున్న పత్రాలు మార్పు చేసేందుకు అవసరమైన అన్ని ఆధారాలు దరఖాస్తుకు జతచేయాలి. వాటిని పాస్‌ పోర్టు కార్యాలయ అధికారులు తనిఖీ చేసి, అవన్నీ నిజమేనని నమ్మితే కొత్త పాస్‌పోర్టు జారీ చేస్తారు.

ఆధార్‌ కార్డు
ప్రభుత్వం అన్నింటికీ ఆధార్‌ను తప్పనిసరి చేసింది. బ్యాంకు ఖాతా, వంటగ్యాస్‌ వినియోగం, రేషన్‌ కార్డు, ఇంటి పన్ను, బండి సీ బుక్‌, విద్యుత్‌ బిల్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇలా అన్నింటికీ ఇదే ఆధారమయింది. అంత ప్రాధాన్యం ఉన్న ఆధార్‌ కార్డులో తప్పులుంటే అన్ని పనులూ ఆగిపోతాయి. తప్పులు సవరించుకోవడానికి ఆధార్‌ కార్డులోని తప్పులను సూచిస్తూ మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు రూ.15 చలానా తీయాలి. సరైన ఆధారాలు జత చేస్తూ, రేషన్‌ కార్డు, ఓటరు కార్డుల నకళ్లు జతచేయాలి. ఆ తరువాత 15 రోజుల్లో ఆన్‌లైన్‌లో తప్పుల సవరణతో కొత్త ఆధార్‌ కార్డు వస్తుంది.

విద్యా సంబంధ ధ్రువీకరణ పత్రాలు
విద్యా సంబంధ ధ్రువీకరణ పత్రాల్లో పుట్టిన తేదీ, కులం, ఇంటి పేరు, తండ్రి పేరులో తప్పులు ఉంటే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రాథమిక స్థాయిలో దీన్ని సవరించడం సులభం. తప్పుల సవరణకు ప్రధానోపాధ్యాయుడికి దరఖాస్తు చేయాలి. దరఖాస్తుపై హెచ్‌ఎం సంతకంతో పాటు పాఠశాల స్టాంప్‌ వేయించి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెళ్లి రూ.80 చలానా కట్టి దరఖాస్తుతో పాటు సవరణలు అందజేయాలి. తొమ్మిదో తరగతి వరకూ డీఈవో కార్యాలయంలో, పదో తరగతి అయితే ఎస్‌ఎస్‌సీ బోర్డు ద్వారా తప్పులు సవరించుకోవచ్చు. డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లలో తప్పులు చోటు చేసుకుంటే యూనివర్సిటీ రిజిస్ర్టార్‌కు దరఖాస్తు చేసి సవరించుకోవాల్సి ఉంటుంది.