హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన మిషెల్ ఒబామా జ్ఞాపకాల పుస్తకం

పంజరం వీడిన ఆమె కథ

మిషెల్‌ ఒబామా... 2009 నుంచి 2017 దాకా అమెరికా ఫస్ట్‌ లేడీ. ఓ చిన్న ఇంటి నుంచి వచ్చి... అగ్రరాజ్యంలో శ్వేతసౌధపు రాణిగా ఎదిగారు. ఈ ప్రయాణంలో... ఎన్నో అనుభవాలు... అనుభూతులు.  నల్ల పిల్లగా వివక్ష... భార్యగా బాధ్యత... ఇద్దరు పిల్లల తల్లిగా ఆవేదన... వెరసి సమకాలీన స్త్రీ రూపం ఆమె. ఇటీవలే విడుదలైన ఆమె జ్ఞాపకాల పుస్తకం ‘బికమింగ్‌’ కాసేపటికే హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయింది. భర్త బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్నా, లేకపోయినా... ఆమె పట్ల జనంలో ఆసక్తి తగ్గలేదనడానికి అదో నిదర్శనం. ఆమె జీవితంలోని అనేక ఘట్టాలు... సగటు కుటుంబ జీవితాలకు ప్రతిబింబం!

మిషెల్‌ ఒబామా జ్ఞాపకాలు ‘బికమింగ్‌’ నుంచి కొన్ని భాగాలు... 

పెళ్ళయిన కొత్తలో...

ఒంటరితనాన్ని కోరుకొనే ఓ వ్యక్తి, అసలు ఒంటరితనాన్ని ఏ మాత్రం ఇష్టపడకుండా, ఎప్పుడూ నలుగురి మధ్యా ఉండడాన్ని ఇష్టపడే కుటుంబ స్త్రీని పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది? పెళ్ళి అయినప్పుడు నాకు ఎదురైన సమస్య అదే. అయితే, వివాహబంధంలో ఉండడం మినహా మరో మార్గం లేనప్పుడు ఎవరైనా, ఎలాంటి సమస్యకైనా పరిస్థితులకు అనుగుణంగా సర్దుకొంటారు. 1993 మొదట్లో... మా పెళ్ళయిన కొత్తల్లో... బరాక్‌ ఒబామా తన పుస్తకం ‘డ్రీమ్స్‌ ఫ్రమ్‌ మై ఫాదర్‌’ రాయడం కోసం ఇండొనేసియాలోని బాలి ప్రాంతానికి వెళ్ళి, అక్కడే దాదాపు అయిదు వారాలు గడిపారు.

నేను మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయా. స్నేహితుల్ని కలుస్తూ, సాయంత్రాలు వ్యాయామ తరగతులకు హాజరవుతూ నన్ను నేను బిజీగా ఉంచుకోసాగాను. పని ప్రదేశంలో కానీ, ఇతర చోట్ల కానీ తరచుగా ‘మై హజ్బెండ్‌’ (మా ఆయన) అనే కొత్త పదం తరచూ వాడసాగాను. ...బరాక్‌ను నేను బాగా మిస్సయ్యాను. కానీ, పరిస్థితిని అర్థం చేసుకున్నాను. మేము కొత్తగా పెళ్ళయిన వాళ్ళం అయినప్పటికీ, ఈ ఎడబాటు కూడా మంచికే అనిపించింది. క్రమంగా సర్దుబాటును అలవాటు చేసుకున్నాను.

సంతానం కోసం...

బరాక్‌ అప్పట్లో ఇల్లినాయిస్‌ సెనేటర్‌గా ఉన్నారు. మాదైన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాం. పిల్లల్ని కనాలనేది ఓ కర్తవ్యంగా భావించా. కానీ, మేము ఎంతగా ప్రయత్నించినా మాకు పిల్లలు పుట్టలేదు. గర్భస్రావం అయింది. చివరకు అనేక ప్రయత్నాల తరువాత ఐ.వి.ఎఫ్‌. చికిత్సల ద్వారా మాకు ఇద్దరమ్మాయిలు (మలియా, సాషా) కలిగారు.

ప్రచారంలో... పిల్లలే రిలీఫ్‌

2008... బరాక్‌ జీవితంలో జరుగుతున్న అంశాల తీవ్రత, ప్రచారం అవసరాలు, మా కుటుంబంపై జనం దృష్టి... ఇలా అన్నీ ఒక్కసారిగా పెరగసాగాయి. హాస్పటల్‌లో పని చేస్తున్న నేను ఒక పక్క ఈ పనులతో, నా ఉద్యోగానికి న్యాయం చేయలేనని అనిపిం చింది. అంతే... వదిలేశా. కనీసం ఆఫీసుకు వెళ్ళి, నా సామాన్లు సర్దుకొని, అందరికీ సరిగ్గా గుడ్‌బై చెప్పే తీరిక కూడా లేకపోయింది. అప్పటి దాకా పూర్తిస్థాయి అమ్మగా, భార్యగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ఓ లక్ష్యం కోసం పని చేసే భార్యగా, ఆ లక్ష్యం నన్ను మింగేయకుండా నా పిల్లల్ని కాపాడాల్సిన తల్లిగా పని చేయడం మొదలుపెట్టా. నిజానికి, ఉద్యోగానికి దూరం కావడం బాధాకరమే. కానీ, అంతకు మించి నాకు మరో మార్గం లేదు... నా కుటుంబానికి నేను కావాల్సి వచ్చింది. ఉద్యోగం సహా మిగతా అన్నిటి కన్నా నాకు అది ముఖ్యం.

 అధ్యక్షపదవికి ఎన్నికల ప్రచారంలో నాకూ, బరాక్‌కూ మా పిల్లలిద్దరూ మా పక్కనే ఉంటే పెద్ద రిలీఫ్‌. ఫలితం గురించి వాళ్ళు పెద్దగా ఆశించలేదు. వాళ్ళిద్దరూ పక్కనే ఉండడంతో.. ‘ఎన్నికల్లో మనకు ఎంత మద్దతు పెరుగుతోంది’ లాంటి లెక్కల కన్నా చివరకు వచ్చేసరికి కుటుంబం చాలా ముఖ్యమనే సంగతిని మేము మరిచిపోకుండా చేసింది. మా అమ్మాయిలెవరూ వాళ్ళ నాన్న చుట్టూ ఉన్న హంగామా గురించి పెద్దగా పట్టించుకోనేలేదు. వైట్‌హౌస్‌లో పీఠంపై కూర్చోవడం లాంటివేవీ వాళ్ళకు పట్టలేదు. వాళ్ళకు కావాల్సిందల్లా వాళ్ళ నాన్న ఆప్యాయంగా ఇచ్చే చిన్న ముద్దు.

ప్రైవసీ పోయింది

ప్రచారంలో ముందుకు సాగుతుండగా రోజంతా ముందే నిర్ణయించిన కార్యక్రమాలతో గడిచిపోయేది. మా టైమ్‌ మా చేతిలో ఉండేది కాదన్నమాట. క్రమంగా మా ప్రైవసీ... మా స్వేచ్ఛ మా చేతుల్లో నుంచి జారిపోసాగాయి. మా దంపతులిద్దరి జీవితాల్లోని ప్రతి అంశం... మా చుట్టూ ఎప్పుడూ వేయికళ్ళతో జాగ్రత్తగా ఉండే ఓ 20 మంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎంతో తెలివైనవాళ్ళు, సమర్థులైనప్పటికీ నా జీవితం మీద నాకు నియంత్రణ లేకపోవడం ఎంత బాధాకరం. 

దుకాణం నుంచి నాకు ఏదైనా కావాలంటే, అది తెచ్చిపెట్టమని ఎవరినైనా అడగాలి. నా భర్త బరాక్‌తో నేను మాట్లాడాలనుకున్నా సరే... ఆయన దగ్గరుండే యువ అధికారుల్లో ఒకరి ద్వారా అభ్యర్థన పంపాల్సి ఉండేది. కొన్నిసార్లు నాకే తెలియని ఎన్నో కార్యక్రమాలు, సభలు నా క్యాలెండర్‌లో వచ్చి చేరేవి. చివరకు వాస్తవాన్ని అంగీకరించి, జనం కళ్ళ మధ్యలో బతకడం ఎలాగో నిదానంగా నేర్చుకోక తప్పలేదు. నా అనుమానాలను పటాపంచలు చేస్తూ, బరాక్‌ ప్రెసిడెంట్‌ అయ్యాక శ్వేతసౌధంలో మేము గడిపిన 8 ఏళ్ల కాలం మరో పెద్ద కథ.

వైట్‌ హౌస్‌లో ఆఖరి రోజు

అది 2017 జనవరి 20. బరాక్‌, నేను వైట్‌ హౌస్‌లో నుంచి ఆఖరుసారిగా బయటకు వచ్చాం. డొనాల్డ్‌ ట్రంప్‌, మెలనియా ట్రంప్‌లను తోడ్కొని, అధ్యక్ష పదవీప్రమాణ స్వీకారానికి బయలుదేరాం. ఆ రోజున నా మనసులో ఎన్నో భావాలు. అలసట... కించిత్‌ గర్వం... పరధ్యానం... ఏదో తెలియని ఆతురత... ఇలా ఎన్నెన్నో. మా ప్రతి కదలికనూ టీవీ కెమేరాలు ఒడిసిపడుతున్నాయని తెలుసు. కాబట్టి సాధ్యమైనంత వరకు నన్ను నేను సంబాళించుకోవడానికి ప్రయత్నించా. 

స్థిమితత్వం చెదిరిపోని రీతిలో మా 8 ఏళ్ల వైట్‌హౌస్‌ జీవితానికి ముగింపు పలకాలనీ, హుందాగా మామూలు జీవితానికి మారాలనీ బరాక్‌, నేను నిశ్చయించుకున్నాం. ఇన్నేళ్ళుగా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్న వంటవాళ్ళు, పనివాళ్ళు, తోటమాలుల లాంటి వైట్‌హౌస్‌ శాశ్వత సిబ్బందికి స్నేహపూర్వక వీడ్కోలు పలికాం. ఇకపై వాళ్ళు వైట్‌హౌస్‌కు తరలివచ్చే కొత్త కుటుంబానికి సేవలు అందించాలి. మా పిల్లలకు ఈ వీడ్కోలు భరించరానిదే. ఎందుకంటే, వాళ్ళ జీవితాల్లో సగం ప్రతిరోజూ ఈ మనుషులనే చూస్తూ, వాళ్ళతోనే గడిపారు. ప్రతి ఒక్కరినీ కౌగిలించుకొని, వీడ్కోలు చెప్పా. కన్నీళ్ళు రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డా.

ఇప్పుడో సరికొత్త ప్రయాణం...

 మార్పు అంటేనే మరో కొత్త విషయానికి ప్రయాణం. ఓ చేయి బైబిల్‌ మీదకు వెళుతుంది. ప్రమాణం పునరుచ్చారణ అవుతుంది.ఒక అధ్యక్షుడి సామాన్లు బయటకు వెళతాయి. మరో అధ్యక్షుడివి లోపలకు వస్తాయి. గదిలో అరలు ఖాళీ చేస్తారు. కొత్త సామాన్లతో నింపుతారు. వైట్‌హౌస్‌లో కొత్త దిండ్ల మీద సరికొత్త తలలు వాలుతాయి. కొత్త కలలు... కొత్త భావోద్వేగాలు... చోటుచేసుకుంటాయి. పదవీకాలం ముగిసిపోయి, వైట్‌హౌస్‌ను వదిలి బయటకు వచ్చిన రోజున మనల్ని మనం మళ్ళీ కొత్తగా కనుక్కొనేందుకు ఎన్నో దోవలుంటాయి. నేనిప్పుడు నూతన శుభారంభ దశలో ఉన్నా. 

జీవితంలో కొత్త అధ్యాయంలోకి ప్రవేశించా. చాలా ఏళ్ళ తరువాత తొలిసారిగా అధ్యక్షుడి భార్య లాంటి రాజకీయ నిర్బంధాల నుంచి, ఇతరుల ఆశలు, అంచనాల బంధనాల నుంచి బయటకొచ్చా. నా కూతుళ్ళు ఇద్దరూ పెద్దవాళ్ళవడంతో మునుపటిలా నేను వాళ్ళకు అంత అవసరం లేదు. నా భర్త భుజస్కంధాలపై ఇప్పుడు దేశం తాలూకు భారం లేదు. ఇప్పటి దాకా నా కూతుళ్ళు, నా భర్త, నా కెరీర్‌, నా దేశం పట్ల నేను భావించిన బాధ్యతలు కొత్త మార్గం పట్టాయి. దాంతో, భవిష్యత్తుపై భిన్నంగా ఆలోచించే అవకాశం దక్కింది. నేను నా లాగా ఉండడానికీ, ఆత్మపరిశీలన చేసుకోవడానికీ తీరిక చిక్కింది. 54 ఏళ్ల వయసులో ఇప్పటికీ నేను పురోగమిస్తున్నా. నిరంతరం ఈ పురోగమనం సాగుతుందని ఆశిస్తున్నా.

నాన్న మాట... అమ్మ బాట...

‘‘అమెరికా గురించి... జీవితం గురించి... భవిష్యత్తులో నాకు ఎదురయ్యే అంశాల గురించి... ఇప్పటికీ నాకు చాలా తెలియదు. కానీ, నా గురించి నాకు తెలుసు. ‘‘కష్టపడి పని చెయ్యి... ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండు... ఇచ్చిన మాట నిలబెట్టుకో...’’ ఇదీ మా నాన్న గారు ఫ్రేజర్‌ నాకు నేర్పినవి. నా గురించి నేను ఎలా ఆలోచించాలో, నా గొంతు నేను ఎలా వినిపించాలో మా అమ్మ మరియన్‌ నాకు చూపెట్టింది. చికాగో దక్షిణ ప్రాంతంలోని మా ఇరుకు ఇంట్లోని వాళ్ళిద్దరూ మా దేశం తాలూకు పెద్ద కథలో... మా జీవితం, అందులోనూ నా జీవితం... విలువ ఏమిటో నేను చూసేలా చేశారు. ఆ జీవితం అందంగా ఉండకపోవచ్చు. తప్పులూ ఉండవచ్చు. కోరుకున్నదాని కన్నా మరీ పచ్చి వాస్తవంగా ఉండవచ్చు. ఏమైతేనేం... నీ జీవితం నీది! ఇప్పటికీ, ఎప్పటికీ అది నీదే!!’’ 

మిషెల్‌... అచ్చం మన లాంటిదే!

ఎనిమిదేళ్ళ పాటు వైట్‌ హౌస్‌లో అధికార లాంఛనాలతో జీవితం గడిపాక... మళ్ళీ సాధారణ వ్యక్తిగా జీవనం సాగించడం ఎవరికైనా కష్టమే. కానీ, మిషెల్‌ అందుకు భిన్నం.  
అది 1964. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌కు నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది. వర్ణ విచక్షణ లేకుండా, అందరినీ ఒకేలా చూసే సమాజాన్ని స్థాపించడానికి ఆయన శ్రమిస్తున్న రోజులవి. సరిగ్గా అదే ఏడాది మిషెల్‌ లావాన్‌ రాబిన్‌సన్‌ జన్మించారు. పెరిగి పెద్దయ్యాక ఆమె ఫస్ట్‌ ఆఫ్రికన్‌- అమెరికన్‌ ‘ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ ది యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా’ (ఫ్లోటస్‌) అయ్యారు. ఇవాళ లక్షలమందికి స్ఫూర్తిగా మారిన మిషెల్‌ ఒబామా పుస్తకం ‘బికమింగ్‌’ ఆమె జీవిత ప్రస్థానాన్ని కళ్ళకు కడుతుంది. చికాగోలోని ఆమె బాల్యం, ఇల్లినాయి్‌సలో ఉద్యోగం చేస్తూ అటు తల్లిగా... ఇటు ఉద్యోగినిగా రెండు బాధ్యతలనూ సమన్వయం చేసుకున్న రోజులు, అమెరికా అధ్యక్షుడి భార్యగా వైట్‌ హౌస్‌లో గడిపిన రోజులు... ఇలా అన్నీ ఆమె తన జ్ఞాపకాలలో పంచుకున్నారు.
 
చికాగోకు వలసవచ్చిన ఓ నల్లజాతి కుటుంబంలో పుట్టిన మిషెల్‌ పెరిగిన వాతావరణం వైవిధ్యమైనది. ఆమెకు పొరుగునే ఓ నల్లజాతి జాజ్‌ సంగీత కళాకారుడు ఉండేవారు. ఇంటిపక్కనే ఓ మెక్సికన్‌ కుటుంబం ఉండేది. దగ్గరలోనే బోలెడంత మంది శ్వేతజాతీయుల కుటుంబాలుండేవి. శ్రామికవర్గానికి చెందిన కుటుంబంలో పుట్టిన ఆమె తండ్రి చికాగోలోని జలశుద్ధి కర్మాగారంలో పనిచేసేవారు. మిషెల్‌ హైస్కూలు చదువుకు వెళ్ళే దాకా తల్లి ఓ గృహిణిగా ఇంట్లోనే ఉండిపోయారు. చిన్నప్పటి నుంచి సొంత ఆలోచనలు, భావాలుండేలా తల్లితండ్రులు స్వేచ్ఛనిచ్చి, పెంచడంతో మిషెల్‌ ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తిగా ఎదిగారు. పిల్లల కోసం తల్లి నిస్వార్థంగా చేసిన త్యాగం వల్లే తాను ఇంతగా ఎదిగానంటారామె. కలలు నిజం చేసుకోవడానికి ఆమె ఎంతో శ్రమించారు. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ, హార్వర్డ్‌ లా స్కూల్‌లలో చదువుకొన్న ఆమె చికాగోలోని ఒక న్యాయవాద సంస్థలో అటార్నీగా కెరీర్‌ ప్రారంభించారు.

  ఒబామా ఆమెకు అక్కడే పరిచయమయ్యారు. ఒబామాతో ఆమె ప్రేమ, పెళ్ళి ఓ చందమామ కథ లాంటిది అనుకుంటే పొరపాటే. జీవితంలో ఆనందంగా ఉండాలంటే, సర్దుబాటు తప్పదని గ్రహించిన ఆమె తరువాత మాతృత్వం కోసం తపించారు. పిల్లల పెంపకంలో... ఒబామా అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారంలో... తరువాత వైట్‌హైస్‌లో గడిపిన జీవితం అంతా ఓ అనూహ్య అనుభవం. భర్త అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగిసి, వైట్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక అక్కడకు రెండు, మూడు మైళ్ళ దూరంలోనే కొత్త ఇంట్లో, తన భర్త, ఇద్దరు కూతుళ్ళతో సాధారణ జీవితం గడపడాన్ని ఆమె ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు. చుట్టూ సెక్యూరిటీ గార్డులు లేకుండా నచ్చినట్టు బతికే స్వేచ్ఛను అనుభవిస్తున్నారు: నవ్య డెస్క్‌