అమెరికా చదువుపై మరింత మోజు

పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య

ఓపెన్‌ డోర్స్‌ నివేదికలో వెల్లడి

చదువు, ఉద్యోగం, మంచి జీతం.. వీటన్నింటికీ కేరాఫ్‌ అడ్రస్‌ అమెరికా. లక్షలాది భారతీయ విద్యార్థులకు అమెరికా చదువు ఒక కల. అయితే.. వీసాలపై ట్రంప్‌ సర్కారు ఆంక్షలు, అక్కడి అనిశ్చితి పరిస్థితులు మన విద్యార్థుల నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తాయని భావించారు. కానీ.. ఆ ప్రభావం ఏ మాత్రం లేదని రుజువైంది. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 12 శాతం పెరిగింది. అమెరికాకు చెందిన స్టేట్‌ బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చరల్‌ ఎఫైర్స్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) సంయుక్తంగా సోమవారం విడుదల చేసిన ఓపెన్‌ డోర్స్‌ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.

 గత విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య 1.65 లక్షలుంటే ఈ ఏడాది ఆ సంఖ్య 1.86 లక్షలకు చేరుకుంది. అంటే.. గత ఏడాది కంటే 12 శాతం ఎక్కువ. ఇక వృద్ధి రేటులో రెండో స్థానంలో నిలిచిన చైనా విద్యార్థులు గత ఏడాది 3.28 లక్షల మంది ఉంటే.. ఈ ఏడాది వారి సంఖ్య 3.5 లక్షలకు చేరుకుంది. ఇది గత ఏడాది కన్నా 6.8 శాతం ఎక్కువ. గత ఏడాది దక్షిణ కొరియా విద్యార్థుల సంఖ్య 61 వేల ఉంటే ఈ ఏడాది వారి సంఖ్య 58 వేలకు తగ్గింది. మొత్తం మీద చూస్తే అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థుల్లో 50 శాతం భారత్‌, చైనా దేశాలకు చెందినవారే! అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తొలిసారి 10 లక్షలు దాటింది. వీరిలో 17.3 శాతం భారతీయులుండటం విశేషం. అంతేకాకుండా అమెరికాలో చదువుకుంటున్న భారతీయుల సంఖ్య గత పదేళ్లలో రెట్టింపైంది. వీరిలో 56 శాతం గ్రాడ్యుయేషన్‌ చదువుకోవడానికి అమెరికాకు వచ్చినవారే. కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, మసాచుసెట్స్‌, ఇలినాయిస్‌, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఓహియో, మిషిగన్‌, ఇండియానా రాష్ట్రాల్లో వీరి సంఖ్య ఎక్కువ. ‘‘అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే అంతర్జాతీయ విద్యార్థులకు వివిధ నెట్‌వర్క్‌లతో అనుసంధానం కావడానికి అవకాశం లభిస్తుంది. వీటిని భారత విద్యార్థులు ఎంతో ఉపయోగించుకుంటున్నారు’’ అని భారత్‌లో అమెరికా ఎంబసీ డిప్యూటీ కల్చరల్‌ ఎఫైర్స్‌ ఆఫీసర్‌ కార్ల్‌ ఎం ఆడమ్‌ అభిప్రాయపడ్డారు. 

ఏ దేశాల విద్యార్థులు ఎంత శాతం?
చైనా 33%
భారత్‌ 17.3%
దక్షిణ కొరియా 5%
సౌదీ అరేబియా 5%
కెనడా 3%
మెక్సికో 2%
జపాన్‌ 2%
తైవాన్‌ 2%
వియత్నాం 2%
బ్రెజిల్‌ 1%

అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువున్నమొదటి ఐదు విశ్వవిద్యాలయాలు.. 

విశ్వవిద్యాలయం విద్యార్థుల సంఖ్య

న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం-  17,326
యూనివర్సిటీ ఆప్‌ సదరన్‌ కాలిఫోర్నియా-  14,327,
కొలంబియా విశ్వవిద్యాలయం-  14,096
నార్త్‌ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయం-బోస్టన్‌-  13,201,

అరిజోన్‌ స్టేట్‌ యూనివర్సిటీ-  13,164

ఏ సబ్జెక్టు.. ఎంత మంది..
స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ,
ఇంజినీరింగ్‌, మేథమెటిక్స్‌) ఫీల్డ్స్‌ - 25 శాతం
బిజినెస్‌ - 21 శాతం
సోషల్‌ సైన్సెస్‌ - 17 శాతం
ఫారెన్‌ లాంగ్వేజెస్‌ అండ్‌
ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ - 7 శాతం
ఫైన్‌ అండ్‌ అప్లైడ్‌ ఆర్ట్స్‌ - 7 శాతం