సింగపూర్‌లో మన పేమెంట్‌ యాప్‌లు

మూడింటిని ప్రారంభించిన మోదీ

ఇరుదేశాలది సహజ బంధమని వ్యాఖ్య
మలేసియా ప్రధానికి అభినందనలు

కౌలాలంపూర్‌/సింగపూర్‌, మే 31: మలేసియా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ప్రధాని పదవి చేపట్టిన మహతీర్‌ మొహమ్మద్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మూడు దేశాల సుడిగాలి పర్యటనలో భాగంగా మోదీ గురువారం మలేసియా చేరుకున్నారు. పుత్రజయలోని మహతీర్‌(92) కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. ‘‘మహతీర్‌ను కలవడం సంతోషంగా ఉంది. భారత్‌-మలేసియాల బంధా న్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత చర్చలు జరిపాం’’ అని మోదీ మలయ్‌, ఇంగ్లిష్‌ భాషల్లో ట్వీట్‌ చేశారు. మహతీర్‌ ప్రధాని అయిన తర్వాత ఆయన్ను కలిసిన తొలి విదేశీ నేత మోదీనే కావడం గమనార్హం. భారత్‌, మలేసియాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలూ చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీ్‌షకుమార్‌ తెలిపారు. ఈ స్వల్పకాలిక పర్యటనలో మోదీ మలేసియా ఉప ప్రధాని వాన్‌ అజీజా వాన్‌ ఇస్మాయిల్‌ను కూడా కలిశారు. అనంతరం ఆయన సింగపూర్‌ చేరుకున్నారు. భారత్‌, సింగపూర్‌ల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ముఖ్యం గా రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య కీలక సంబంధా లు ఉన్నాయని, రాజకీయంగానూ సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ఇరుదేశాలది సహజ బంధమని మెరీనా బే శాండ్స్‌ కన్వెన్షన్‌లో భారతీయులు, వ్యాపార వర్గాలతో జరిగిన సమావేశంలో చెప్పారు. ఆసియాన్‌ దేశాలకు, భారత్‌కు మధ్య సింగపూర్‌ వారధిగా మారిందన్నారు. ‘రెండు సింహాలు(భారత్‌, సింగపూర్‌) భవిష్యత్తులోనూ కలిసి అడుగు వేస్తాయి’ అని స్పష్టం చేశారు. ఇరుదేశాలకు సంబంధించి 30 స్టార్ట్‌పలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మోదీ.. సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌, కమ్యూనికేషన్స్‌ మంత్రితో కలిసి తిలకించారు. అనంతరం మోదీ 3 భారతీయ మొబైల్‌ పేమెంట్‌ యాప్‌లను ప్రారంభించారు. భీమ్‌, రూపే, ఎస్‌బీఐ యాప్‌లను ఆవిష్కరించారు. రూపేను సింగపూర్‌కు చెందిన ఎన్‌ఈటీఎ్‌సతో అనుసంధానం చేశారు.దీంతో సింగపూర్‌లో ఎన్‌ఈటీఎస్‌ ద్వారా చెల్లింపులను ఆమోదించే అన్ని ప్రాంతాల్లో భారతీయులు పేమెంట్లు చేయొచ్చు. భారత డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాంను అంతర్జాతీయీకరణ చేయడంలో ఇది భారీ ముందడుగు. శుక్రవారం మోదీ సింగపూర్‌ ప్రధాని లీతో చర్చల అనంతరం ఆ దేశ అధ్యక్షురాలు హలీమా యాకబ్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు.