ఒకప్పుడు పూట గడిచేందుకు పాట్లు... నేడు కెనడాలో అతని పేరిట రోడ్డు

చెన్నై: తన అద్భుతమైన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ పుట్టినరోజు నేడు (జనవరి 6). రెహమాన్ తన జీవితంలో ఎన్నో కష్టాలను చవిచూశారు. ఒకప్పుడు ఆయన ఇంటి ఖర్చుల కోసం మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్లను అద్దెకు ఇస్తూ కాలం వెళ్లదీశారు. తండ్రి మరణించే నాటికి రెహమాన్ వయసు 9 ఏళ్లు. దీంతో ఇల్లు గడిచేందుకు ఇంట్లోని మ్యూజిక్ పరికరాలను అద్దెకు ఇవ్వడం తప్ప వారి కుటుంబానికి మారో మార్గం లేకుండా పోయింది. రెహమాన్ తండ్రి ఆర్ కే శేఖర్ మ్యూజిక్ కంపోజర్. బాలీవుడ్ ప్రముఖుడు దిలీప్ కుమార్‌ను అమితంగా ఇష్టపడే ఆయన తన కుమారునికి ఎఎస్ దిలీప్ కుమార్ అనే పేరు పెట్టారు. 23 ఏళ్ల వయసులో రెహమాన్ అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపధ్యంలో వారి కుటుంబం మతం మార్చుకుంది. ఫలితంగా ఎ ఎస్ దిలీప్ కుమార్ పేరు ఎ ఆర్ రెహమాన్‌గా మారింది. రెహమాన్ పూర్తిపేరు అల్లా రఖా రెహమాన్. 2000లో రెహమాన్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి గాను రెహమాన్ గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్, గ్రామీ తదితర ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. రెహమాన్ ఘనతను గుర్తించిన కెనడా ప్రభుత్వం ఆ ప్రాంతంలోని ఒక రోడ్డుకు ‘అల్లా రఖా రెహమాన్’ అనే పేరు పెట్టింది.