ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అతి ప్రాచీన ప్రజాస్వామ్యం కూడా మనదే. మేను రక్తపుటేరులతో తడిసినా, వలస పాలకుల కవాతు కింద నలిగినా, వివక్షకు కుంగినా... భరతమాత తన కొంగులో భద్రంగా దాచిపెట్టిన ఆస్తి ఓటుహక్కు. కాలానుగుణంగా ఆ ఓటు పోకడలో వస్తున్న మార్పుల కూర్పు ఇది...
మన ప్రజాస్వామ్యం 3,500 ఏళ్లకు పూర్వమే మొదలైంది. గ్రీక్, రోమన్ సామ్రాజ్యాలు తప్పటడుగులు వేసే సమయానికే ఆర్యావర్తంలో జనపదాలు వెలిశాయి. అప్పటికి ఇంకా పట్టణాలు రూపొందలేదు. పశుపోషణ మీదే ఆధారపడి బతికేది సమాజం. ఒకే ప్రాంతంలో నివసించే వాళ్లంతా కలిసికట్టుగా నిర్మించుకున్న సమాజమే... జనపదం. దానికి నాయకుడిని జనమే ఎన్నుకునేవారు. ఒక రకంగా ఇది ఓటు హక్కులాంటిదే. అలా జనపదాలలో ఎన్నికలు మొదలయ్యాయి. జనపదంలోని పెద్దలతో కూడిన ‘సమితి’ రాజును ఎన్నుకుంటుంది. నచ్చకపోతే ఆ రాజును గద్దె దించనూగలదా సమితి. ఇక, ఆ రాజు సలహా సంప్రదింపులకు సిద్ధంగా ఉండేది ‘సభ’. కాకపోతే జనపదంలో క్షత్రియులకు మాత్రమే రాజుగా ఎన్నికయ్యే అవకాశం ఉండేదనీ, వారిని ఎన్నుకునే అర్హత కూడా ధనవంతులకు మాత్రమే ఉండేదనీ చరిత్రకారుల వాదన.
సీక్రెట్ బ్యాలెట్
రోజులు గడిచేకొద్దీ పశు సంపద మెరుగుపడింది. జనం స్థిరపడేందుకు వెసులుబాటు చిక్కింది. జనపదాలు కాస్తా రాజ్యాలుగా మారాయి. ఇక్కడ బలవంతుడే రాజు. అయినా కొందరు చక్రవర్తులు గ్రామీణస్థాయిలో ప్రజాస్వామ్యానికి అవకాశం ఇచ్చేవారు. ఇందుకు తమిళనాడులోని ఉత్తరమేరూర్ ఓ గొప్ప సాక్ష్యం. 10వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని ఏలిన పరాంతక చోళుడు.. గ్రామసభను ఏర్పాటు చేసుకుని ఎన్నికలను నిర్వహించుకోడానికి స్థానికులకు ఆస్కారం ఇచ్చాడు. అప్పుడు ఓట్ల కోసం ఎంచుకున్న పద్ధతే ‘కుడవోలై’. తాటాకు మీద నచ్చిన అభ్యర్థి పేరు రాసి, దాన్ని మడిచి... కుండలోకి జారవిడవడమే కుడవోలై. బహుశా తొలి సీక్రెట్ బ్యాలెట్ ఇదేనేమో! ఇందుకు రూపొందించుకున్న నియమ నిబంధనలు, ఆ ఊరి ‘వైకుంఠ పెరుమాళ్’ ఆలయ గోడల మీద ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నాయకులను ఎన్నుకోవడమే కాదు.. పదవికి అనర్హులనిపిస్తే.. గద్దె దింపడానికీ ఓటర్లకు అధికారం ఉండేది. కాకపోతే ఎంతోకొంత భూమి, చిన్నదో పెద్దదో ఓ ఇల్లు ఉన్నవారే పోటీకి అర్హులు. అదీ ఓ కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం లభించేది. ఇదీ పరిస్థితి.
ఉన్నవాడిదే ఓటు
1857- మొదటి స్వాతంత్య్ర సంగ్రామ సమయం. కాస్త జాగ్రత్తగా ఉండకపోతే, దేశం చేజారిపోతుందని తెలిసొచ్చింది బ్రిటిషర్లకి. భారతీయులకు ఎంతో కొంత అధికారాన్ని ఎర వేసి శాంతపరచాలి. అదే ముసుగులో వాళ్లని ఇట్టనిలువునా చీల్చిపారేయాలి. ఈ ద్వంద్వనీతితో వండిన మింటో-మార్లే సంస్కరణలతో ఎన్నికలను రూపొందించారు. జాతీయ స్థాయిలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌నూ, ప్రాంతీయ స్థాయిలో అసెంబ్లీలనూ స్థాపించారు. 1920లో తొలిసారిగా ఎన్నికలు మొదలయ్యాయి. ఇందులో నెగ్గడం కంటే, ఓటు వేయడమే కష్టంగా మారింది. ఎందుకంటే... భూస్వాములు, వ్యాపారవేత్తలు, ఆస్తిపరులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఓ నివేదిక ప్రకారం - అప్పట్లో కేవలం రెండు శాతం ప్రజలకే ఓటు వేయడానికి అర్హత దక్కేది. ఇంతాచేసి ఎన్నికైన సభ్యులకంటే.. గవర్నరు దొరవారి మాటే ఎక్కువ చెల్లుబాటు అయ్యేది. 1920 నుంచి 1946 వరకు ఎనిమిది ఎన్నికలు జరిగాయి. ప్రతిదీ తోలుబొమ్మలాటే! ఆ ఆట బ్రిటిష్ వాళ్లకు కాలక్షేపం. కాకపోతే జాతీయవాదుల పోరు తట్టుకోలేక.. అప్పు డప్పుడు నిబంధనలను సడలించేవారు.
ఆ మార్పులో భాగంగా - ధనవంతులతో పాటు విద్యావంతులు కూడా ఓటు వేయొచ్చని సెలవిచ్చారు. ఇలాంటి అర్హతలున్నవారి భార్యలకు కూడా ఓటు హక్కు లభించింది. పేదలకు మాత్రం ఆ భాగ్యం దక్కలేదు.
రంగు ఓట్లు..
ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన స్వాతంత్య్రం వచ్చేసింది. దేశం మొత్తం మువ్వన్నెల జెండాలతో రెపరెప లాడింది. విభజన గాయాల నుంచి కోలుకుని, రాజ్యాంగాన్ని నిర్మించుకుని... 1951 నాటికి తొలి ఎన్నికలను జరిపింది భారత్. 21 ఏళ్లు దాటిన వారందరికీ ఓటు లభించింది. కానీ, అప్పటికి మన దేశంలో 85 శాతం ప్రజలు నిరక్షరాస్యులే. వాళ్లు తమ ఓటును సులువుగా వేయడం ఎలా?.. అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకు ఓ పరిష్కారాన్ని గుర్తించారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతి అభ్యర్థికీ ఓ రంగు డబ్బాను కేటాయించారు. దాని మీద అభ్యర్థి పేరు, అతని పార్టీ గుర్తు అతికించారు. గుర్తును చూసి ఓటేసే పద్ధతికి ఇదే ఆరంభం.
మరక మంచిదే!
ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికలు జరిగాయి. నిష్పాక్షికంగా సాగాల్సిన ఎన్నికలను దొంగ ఓట్లు అభాసుపాలు చేశాయి. దీనికి విరుగుడుగా ఎన్పీఎల్ అనే ప్రభుత్వ సంస్థ, సిల్వర్ నైట్రేట్‌తో చెరిగిపోని సిరాను కనుక్కుంది. ఓటు వేయగానే వేలికి సిరా అంటిస్తారు. ఇది వారమైనా చెరిగి పోదు. 1962 ఎన్నికలలో తొలిసారి సిరాను వాడారు. దీంతో దొంగ ఓట్లకు కళ్లెం పడింది. సిరా ప్రయోగం సఫలం కావడంతో, దాదాపు 30 దేశాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయిప్పుడు. ఆ దేశాలన్నిటికీ ఎన్పీఎల్ సంస్థే ఎలక్షన్ ఇంకును సరఫరా చేస్తోంది. అంతా బాగానే సాగుతోంది కాబట్టి... ప్రజాస్వామ్య యజ్ఞంలో మరింత మందిని చేర్చాలన్న ఆలోచన మొదలైంది. సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడాలన్నా, యువతలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెరగాలన్నా... ఎన్నికలు వారికి మరింత చేరువ కావాలనే అభిప్రాయం బలపడింది. ఫలితంగా 1989లో రాజ్యాంగ సవరణ చేశారు. ఓటింగ్ వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ఇదో చారిత్రకమైన పరిణామం.
యంత్రుడి సాయం..
కోట్ల మంది ఓటర్లు, వందల నియోజకవర్గాలు, టన్నుల కొద్దీ బ్యాలెట్ పేపర్లు. ఎన్నికలు నిర్వహించాక... ఓట్లని లెక్క పెట్టేందుకు ఎంతో శ్రమ, సమయం అవసరం. ఇక చెల్లని ఓట్లు, చిరిగిన ఓట్ల సంగతి సరే సరి. దీనికి విరుగుడు మంత్రం- ఓటింగ్ యంత్రం. ఈవీఎమ్ ద్వారా ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఇండియానే. 1982లో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ పద్ధతి.. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ‘నాకు ఎవరూ నచ్చలేదు. ఏ పార్టీ అయినా ఒక్కటే’ అనేవాళ్లున్నారు. కానీ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు తప్పనిసరి. అందుకే ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే సంస్థ సుప్రీంకోర్టులో పోరాడి నోటాను సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికలతో నోటా మొదలైంది. ఏ అభ్యర్థీ నచ్చకపోతే.. నోటా మీట నొక్కొచ్చు. ఎన్నికల ప్రక్రియలో ఇన్ని మార్పులు వచ్చినా.. ఇక్కడితో ఆ ప్రస్థానం ఆగిపోదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందరి చేతుల్లోకి రావడంతో... మరిన్ని సానుకూల పరిణామాలు తప్పకపోవచ్చు. ఎన్ఆర్ఐ ఓటర్లకు అవకాశాన్ని కల్పించే ప్రాక్సీ ఓటింగ్, పాస్‌వర్డ్‌తో సాధ్యమయ్యే ఆన్లైన్ ఓటింగ్‌ల గురించి కూడా ప్రభుత్వాలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే.. అన్ని వర్గాల ప్రజలు ఓటుకు జైకొట్టక తప్పదు.
ఎలక్షన్ దేవుడు
ఉత్తరమేరూర్లో ప్రజాస్వామ్యపు పునాదులు ఉండటం వల్ల, అక్కడి దేవుడిని ‘ఎలక్షన్ పెరుమాల్’ అని పిలుస్తారు. ఆయన దర్శనం చేసుకున్నవారు తప్పక విజయం సాధిస్తారనీ, ఏ పార్టీ అయితే అక్కడ విజయం సాధిస్తుందో... అదే పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుందనీ నమ్ముతారు. రాజీవ్‌గాంధీ సైతం ఈ ఆలయాన్ని, దాని చుట్టూ ఉన్న గ్రామసభల చరిత్రనీ చూసి ముచ్చటపడిపోయి ‘పంచాయత్ రాజ్’ చట్టాన్ని ముందుకు ఉరికించారట.
మూజువాణి
జనపదాల నాటికి అక్షరం ఇంకా పూర్తిగా రూపొందలేదు. కాబట్టి నాయకుడిని నిర్ణయించేందుకు, అతని నిర్ణయాలను బలపరిచేందుకు చేతులెత్తడమో, అరిచి చెప్పడమో చేసేవారు. కొన్ని బిల్లులను ఆమోదించేందుకు మన పార్లమెంటులో ఇప్పటికీ ఈ పద్ధతిని పాటిస్తూనే ఉన్నారు. మూలాల మీద మమకారమేమో!
భర్త పేరు
మన దేశంలో ఎన్నికలు జరిగిన తొలినాళ్లలో స్త్రీ స్వేచ్ఛ ఉండేది కాదు. చాలామంది ఆడవాళ్లు ‘ఫలానా అతని భార్య’ లేదా ‘ఫలానా వ్యక్తి కూతురు’ అనే గుర్తింపులోనే ఉండేవారు. ఓట్ల కోసం కూడా అలాగే దరఖాస్తు చేసుకునేవారు. అలా కొన్ని లక్షల దరఖాస్తులు చెట్టబుట్టకి దాఖలయ్యేవి.
పార్లమెంటు గుడి
మన పార్లమెంట్ భవనాన్ని 1927లో సర్ ఎడ్విన్ లుట్యెన్స్ అనే బ్రిటిషర్ నిర్మించాడన్నది చరిత్ర. ఇందుకు లుట్యెన్స్ను మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయం ప్రభావితం చేసిందన్న వాదన ఉంది. గ్వాలియర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని మితవోలీ గ్రామంలో ఈ శివాలయం ఉంది. స్థానికులు ‘చతుసత్ యోగిని ఆలయం’ అని దీన్ని పిలుచుకుంటారు. అప్పట్లో ఇక్కడ 64 మంది యోగినులను పూజించేవారట. వంద అడుగుల ఎత్తయిన ఓ కొండ మీదున్న ఈ గుడి... చూడ్డానికి పార్లమెంటు భవనాన్ని తలపిస్తుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని గ్రామసభలు నిర్వహించేందుకు వినియోగించేవారట. ఆ భవనాన్నీ, దానితో ముడిపడి ఉన్న ప్రజాస్వామ్య చరిత్రనూ చూసిన లుట్యెన్స్... అదే రూపులో పార్లమెంటును నిర్మించాడని ఓ ప్రచారం.