ప్రయాణ ఖర్చులు తగ్గించుకోండిలా..

రూపాయి క్షీణతతో విదేశీ పర్యటన భారం
ఈ పండగ సీజన్‌లో విదేశీ విహార యాత్రకు వెళ్దామనుకుంటున్నారా? వ్యాపార నిమిత్తం వేరే దేశానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందా? అయితే మీ బడ్జెట్‌ను ఒక్కసారి చెక్‌ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటన భారం గణనీయంగా పెరిగింది. రూపాయి విలువ భారీగా పడిపోవడమే ఇందుకు కారణం. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రేటు ఈ ఏడాది 13 శాతం మేర క్షీణించింది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణ ఖర్చులను వీలైనంతగా తగ్గించుకునేందుకు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ రిలేషన్‌షిప్స్‌ విభాగ
హెడ్‌ కరణ్‌ ఆనంద్‌ అందిస్తున్న టిప్స్‌ మీ కోసం..
 
1. విదేశీ విహార యాత్రలకు వెళ్లేవారు గ్రూప్‌ టూర్‌ ప్యాకేజీలను ఎంచుకోవడం ద్వారా ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకునే వీలుంటుంది. ఈ తరహా ప్యాకేజీల్లో ప్రయాణం, హోటల్‌ బస, అల్పాహారం, టూర్‌ మేనేజర్‌ ఖర్చులు మిళితమై ఉంటాయి. తద్వారా మీరు పర్యటన సందర్భంగా ఆహారం, షాపింగ్‌, వినోదం, ఇతర అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేయగలిగే వెసులుబాటు లభిస్తుంది.
 
2. విదేశీ పర్యటనలకు ముందస్తు ప్రణాళిక ఉత్తమం. చాలా ముందుగా ప్లాన్‌ చేసుకోవడంతో పాటు ముందే చెల్లింపులు జరిపేయడం మేలు. ఎందుకంటే, మీరు వెళ్లే దేశం లో బస, ఆహారం, ప్రముఖ ప్రాంతాల సందర్శన, టికెట్‌ బుకింగ్‌ కోసం మీరు ఆ దేశ కరెన్సీ లేదా డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా వీటి కోసం సేవలందుకున్న తర్వాతే చెల్లింపులు జరుపుతుంటారు. అయితే టూర్‌ ప్యాకేజీ రుసుము మొత్తాన్ని ముందుగానే చెల్లిస్తే.. మన కరెన్సీ విలువ క్షీణించిన పక్షంలో వ్యయం పెరగకుండా ఉంటుంది.
 
3. విదేశాలకు వెళ్లేటప్పుడు డైరెక్ట్‌ కంటే ఇన్‌డైరెక్ట్‌ ఫ్లైట్‌ బుక్‌ చేసుకోవడం ద్వారా టికెట్‌ చార్జీలను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. హైదరాబాద్‌ నుంచి నేరుగా లండన్‌కు వెళ్లే విమాన చార్జీ కంటే హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌, అక్కడి నుంచి లండన్‌కు వెళ్లే విమాన టిక్కెట్‌ ధర 10-15 శాతం మేర తక్కువగా ఉంటుంది.
 
4. మీరెళ్లిన విదేశీ నగరం మధ్యలో చౌక హోటళ్లు లేనట్లయితే శివార్లలోని హోటల్స్‌ను ఎంచుకోవడం ద్వారా ఖర్చు బాగా తగ్గుతుంది. అయితే, అక్కడి నుంచి రవాణా సదుపాయా లు మెరుగ్గా ఉన్నాయా లేదా అని చూడాలి. లేదంటే ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి.
 
5. విదేశాలకు వెళ్లినప్పుడు 5 నక్షత్రాల హోటల్‌ కంటే 3-4 స్టార్‌ హోటళ్లను ఎంచుకుంటే బాగా ఆదా చేసుకోవచ్చు. యూరప్‌, ఆస్ట్రేలియాలోనైతే 3 నక్షత్రాల హోటళ్లు కూడా విలాసవంతంగా, చాలా సౌకర్యంగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలంటే ఈ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల కంటే ఇవే మంచి ప్రత్యామ్నాయం.
 
6. ఏ దేశానికి వెళ్లాలని ఇప్పటికింకా ఓ నిర్ణయానికి రాకపోయి ఉంటే.. దక్షిణాఫ్రికా, టర్కీ, రష్యా, సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, దుబాయ్‌, హాంకాంగ్‌ వంటి దేశాలను, అక్కడి విశేషాలు, ప్రముఖ ప్రాంతాలను పరిశీలించండి. ఎందుకంటే, ఈ దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి విలువ స్థిరంగా ఉంది. ఇక ఇండోనేషియా, కంబోడియా, శ్రీలంక, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాల కరెన్సీ విలువ అయితే రూపాయి కంటే తక్కువ. కాబట్టి ఈ దేశాలను చౌకగా చుట్టేసి రావచ్చు.