వెబ్‌సైట్ ఓపెన్ చెయ్.. డూప్లికేట్ పట్టెయ్

కార్డు పోయిందా.. కంగారు లేదింక

డూప్లికేట్‌ పొందేందుకు మార్గముంది
హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదిస్తే మార్గం సుగమం 

నిర్ణీత దరఖాస్తు చేస్తే కొద్ది రోజుల్లోనే మరో కార్డు 

‘కార్డు’ ఇప్పుడు జీవితంలో భాగంగా మారిపోయింది. గుర్తింపు కార్డు నుంచి ఆధార్‌ కార్డు వరకు ప్రతి దాని అవసరం ఏదో ఒక సందర్భంలో వస్తుంది. ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో అన్నీ ఒకే చోట పెట్టుకుంటాం. అనుకోని పరిస్థితి ఎదురైతే (పర్స్‌, బ్యాగ్‌ పోవటం) మొత్తం కార్డులన్నింటిని ఒకేసారి పోగొట్టుకుంటాం. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి. మళ్లీ వాటిని పొందటం ఎలా అన్న సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందుకు టెన్షన్‌ పడాల్సి పనిలేదని, కాస్త సమయం తీసుకున్నా ప్రతి కార్డుకు డూప్లికేట్‌ పొందే సదుపాయం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 
 
 
ఓటరు గుర్తింపు కార్డు.. 
ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్‌బూత్‌, కార్డు నెంబర్‌తో రూ. 10 రుసుం చెల్లించిమీ సేవా కేంద్రంలో మళ్లీ పొందవచ్చు. కార్డు నెంబరు ఆధారంగా తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www.ceoandhra.nic.in, http://ceotelangana.nic.in/  వెబ్‌సైట్లను సందర్శించి వివరాలను పొందవచ్చు. 
 
 
పాన్‌ కార్డు 
పాన్‌ కార్డు పొగొట్టుకుంటే సంబంఽధిత ఏజన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు పాత పాన్‌ కార్డు జిరాక్స్‌, రెండు కలర్‌ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం అదనంగా మరో రూ.90 చెల్లించాలి. కొత్త కార్డు వచ్చేసరికి మూడు వారాల సమయం పట్టవచ్చు www.nsdl.pan వెబ్‌సైట్‌లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
 
రేషన్‌ కార్డు.. 
రేషన్‌ కార్డు పోగొట్టుకున్న వారు www. icfs2. ap.gov.in,  వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. అక్కడ ఉన్నusername; guest,password;guest123 సాయంతో విచారణను ఉపయోగించి రేషన్‌కార్డు నెంబర్‌ సాయం తో జిరాక్స్‌ ప్రతిని పొందవచ్చు. దాని ద్వారా ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే తహశీల్దార్‌ దానిని పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నెంబరుపై కార్డు జారీ చేస్తారు.
 
ఆధార్‌ కార్డు .. 
ఆధార్‌ కార్డుపోతే టోల్‌ ఫ్రీ నెంబరు 1800 1801947 పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం, చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డు మళ్లీ పోస్టులో పంపిస్తారు. [email protected] వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. 
 
 
పాస్‌పోర్టు.. 
పాస్‌పోర్టు పో గొట్టుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చే యాలి. వారు విచారణ జరిపి నాన్‌ ట్రేస్డ్‌ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌పోర్టు అధికారి. హైదరాబాద్‌ పేరిట రూ.వెయ్యి డీడీ తీయాలి. రెండింటిని జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. మూడు నెలల తరువాత డూప్లికేట్‌ పాస్‌ పోర్టు జారీ చేస్తారు. తత్కాల్‌ పాస్‌ పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov.in ను సంప్రదించటం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
 
ఏటీఎం కార్డు.. 
ఏటిఎం కార్డు ను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్‌ చేయించాలి. తరువాత బ్యాంకులో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. మేనేజర్‌ ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డును జారీ చేస్తారు. ఇందుకోసం నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి.
 
 
డ్రైవింగ్‌ లైసెన్స్‌ .. 
డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోగొట్టుకున్న వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్‌ ట్రేస్డ్‌ పత్రంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రతిని ఎల్‌ఎల్‌డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీవో కార్యాలయంలో అందించాలి. రూ. పది బాండ్‌ పేపర్‌పై కార్డు పోవటానికి కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. నెల రోజుల్లో తిరిగి కార్డు పొందేందుకు అవకాశం ఉంది. ఏపీకి చెందిన వాళ్లు aptransport.org, తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు http://www.transport.telangana.gov.in/ అనే వెబ్‌సైట్‌ నుంచి ఎల్‌ ఎల్‌డీ పారం డౌన్‌లోడ్‌ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు.
 
కార్డు హోల్డర్లకు సూచనలు 
కార్డు ఏదైనా స్కాన్‌ చేయించి ఈ మెయిల్‌ అడ్ర్‌సకు అప్‌లోడ్‌ చేసి స్టోర్‌ చేసుకోవడం చాలా మంచిది.ప్రధాన కార్డులను డూప్లికేట్‌ చేయించుకుని వాటినే జేబులో పెట్టుకు తిరగాలి. ముఖ్యమైన కార్డులు ప్రత్యేక వాలెట్‌ పెట్టుకుంటే మంచిది.