స్వేచ్ఛా వాణిజ్యానికి భవిష్యత్తు ఉన్నదా?

స్వేచ్ఛా వాణిజ్యం ఇప్పుడు సంపన్న దేశాలకు హానికరంగా పరిణమించింది. ఈ కారణంగా డబ్ల్యూటివోను ఉద్ధరించేందుకు మన వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభు చేస్తోన్న ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం లేదన్నది ఒక కఠోర వాస్తవం.

గత శతాబ్ది చివరి దశకంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో) ను నెలకొల్పడంలో అమెరికా కీలక పాత్ర వహించింది. దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందడానికి డబ్ల్యుటివో విశేషంగా దోహదం చేసింది. ప్రతి సభ్య దేశమూ, ఇతర దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై కనిష్ఠ స్థాయిలో సుంకాలు విధించడానికి అంగీకరించింది.

 

 
దిగుమతి సుంకాలపై పరిమితులతో, తాము ఉత్పత్తి చేసిన సరుకులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడానికై అన్ని దేశాలకూ వెసులుబాటు లభించింది. ఇప్పుడు అదే డబ్ల్యుటివో నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. అమెరికా వైఖరిలో ఈ మార్పు ఎలా సంభవించింది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే స్వేచ్ఛా వాణిజ్యం ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలి.
 
ప్రతి దేశమూ తాను అతి చౌకగా ఉత్పత్తి చేయగల సరుకులను ఉత్పత్తి చేసి, ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం చెప్పుతుంది. ఆ ఎగుమతుల నుంచి లాభాలను ఆర్జించి, ఆ రాబడితో ఇతర దేశాలు చౌకగా ఉత్పత్తి చేసే వస్తువులను దిగుమతి చేసుకోవాలి. ఉదాహరణకు ఆపిల్‌ పండ్లను అమెరికా, చక్కెరను భారత్‌ చౌకగా ఉత్పత్తి చేస్తాయి. స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం చెప్పేదేమంటే అమెరికా తన ఆపిల్‌ పండ్లను భారత్‌కు ఎగుమతి చేసి, ఆ దేశం నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవాలి. ఈ క్రయ విక్రయాల వల్ల అమెరికా, భారత్‌ రెండూ చౌక ఆపిల్‌ పండ్లతో పాటు చౌక చక్కెరనూ పొందుతాయి. రెండు దేశాలలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
 
సరే, ఇప్పుడు కొంచెం భిన్నమైన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుందాం. అమెరికా కంప్యూటర్లను, భారత్‌ చక్కెరను ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా తన కంప్యూటర్లను భారత్‌కు ఎగుమతి చేసి, మన దేశం నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవాలి. ఈ విధంగా ఆ రెండు దేశాలూ కంప్యూటర్లతో పాటు చౌక చక్కెరను కూడా పొందుతాయి. మనం గుర్తించాల్సిన వాస్తవమేమిటంటే కంప్యూటర్లను ఉత్పత్తి చేసే దేశం అమెరికా మాత్రమే. ఏకైక దేశమైనందున అమెరికాకు పోటీ లేదు. మరి పోటీ లేనందున అమెరికన్‌ కంపెనీలను తమ కంప్యూటర్లను సహజంగానే అధిక ధరకు విక్రయిస్తున్నాయి. కంప్యూటర్ల విషయంలో స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం విఫలమయింది.
 
అమెరికా తన గుత్తాధిపత్య ఉత్పత్తుల (కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌) ఎగుమతుల నుంచి పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తోంది. భారత్‌ లాంటి వర్ధమాన దేశాలేమో చక్కెర ఎగుమతుల నుంచి స్వల్ప లాభాలను మాత్రమే పొందగలుగుతున్నాయి. కారణమేమిటి? చక్కెరను చాలా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో భారత్‌ తన ఇష్టం వచ్చినట్టుగా చక్కెర ధర పెంచలేదు ఈ పరిస్థితి అమెరికాకు ఇతోధిక లబ్ధిని సమకూరుస్తోంది. కంప్యూటర్లను అధిక ధరకు విక్రయించి స్వల్ప ధరకు చక్కెరను దిగుమతి చేసుకుంటున్నది. ఇది భారత్‌ ప్రయోజనాలకు హానికరంగా వున్నది. డబ్ల్యుటివోను నెలకొల్పేందుకు అమెరికా విశేష శ్రద్ధాసక్తులు చూపిన 1990వ దశకంలో సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఉండేది.
కాలం మారిపోయింది. ఇప్పుడు కంప్యూటర్లను ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా, చైనా మొదలైన దేశాలు కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా ఇంకెంతమాత్రం కంప్యూటర్లను తన ఇష్టం వచ్చిన రీతిలో గుత్తాధిపత్య ధరతో విక్రయించ లేకపోతోంది. గతంలో వలే ఆదాయం లేకపోవడంతో అమెరికన్‌ కంప్యూటర్ తయారీదారులు తమ సిబ్బందికి అధికమొత్తంలో వేతన భత్యాలు చెల్లించలేకపోతున్నారు అమెరికన్‌ కంప్యూటర్‌ ఉత్పత్తిదారులు తమ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు చైనీస్ కంప్యూటర్‌ ఉత్పత్తిదారులు తమ సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాల కంటే అధికంగా లేవు. అమెరికన్‌ ఉత్పత్తిదారుడు తన సిబ్బందికి అధిక వేతనం చెల్లిస్తే కంప్యూటర్లను విధిగా అధిక ధరకు విధిగా అమ్ముకోవల్సివస్తోంది.
 
మరి అంతర్జాతీయ మార్కెట్‌లో గట్టిపోటీ ఉన్నందున, అధిక ధరల వల్ల అమెరికన్‌ ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం ప్రపంచవ్యాప్తంగా వేతనాలను సమానీకరణ చేస్తుంది. ఇది అనివార్య పరిణామం. అధ్యక్షుడు ట్రంప్‌కు ఇది ఆమోదయోగ్యంగా లేదు. ఒక భారతీయ కార్మికుడి వేతనం ఎంతో ఒక అమెరికన్‌ కార్మికుడి వేతనమూ అంతే ఉండడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంగానే డబ్ల్యుటివో నుంచి ఉపసంహరణకు ఆయన సంసిద్ధంగా ఉన్నారు.
 
అధునాతన సాంకేతికతల సృష్టిలో అద్భుత పురోగతి, మైక్రోసాఫ్ట్‌ విండోస్ సాఫ్ట్‌వేర్‌, బోయింగ్ విమానాలు, సిస్కో రౌటర్స్‌ మొదలైన హై–టెక్‌ ఉత్పత్తుల మూలంగా స్వేచ్ఛా వాణిజ్యం సంపన్న దేశాలకు లాభదాయకంగా ఉన్నది. ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన ఒక కీలక వాస్తవం. ఇటీవలి కాలంలో నవీన సాంకేతికతల సృష్టి, హై టెక్‌ ఉత్పత్తుల అభివృద్ధి స్తంభించి పోయింది. దీంతో స్వేచ్ఛా వాణిజ్యం అమెరికా, ఇతర సంపన్న దేశాల ప్రయోజనాలకు హానికరంగా పరిణమించింది. అంతర్జాతీయ విపణిలో గట్టి పోటీ ఎదురవుతున్న కారణంగా అమెరికా కార్మికుల వేతనాలు పడిపోతున్నాయి. ఈ కారణంగానే డబ్ల్యు టి వో నుంచి ఉపసంహరించుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా ప్రజలు మద్దతునిస్తున్నారు.
 
డబ్ల్యుటివోను ఉద్ధరించడానికై మన వాణిజ్యమంత్రి సురేశ్‌ ప్రభు ఇటీవల యాభైదేశాల అనధికార సమావేశం నొకదాన్ని ఏర్పాటు చేశారు. సంపన్నదేశాలు తమ గుత్తాధిపత్య ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయించడానికి డబ్ల్యుటి వోను ఇంకెంత మాత్రం ఉపయోగించుకోవడం లేదు. దీంతో స్వేచ్ఛా వాణిజ్యం ప్రస్తుతం వర్థమాన దేశాలకు ప్రయోజనకరంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక సురేశ్‌ ప్రభు నిర్వహించిన సమావేశం సరైన దిశలో సరైన ముందడుగు. అయితే స్వేచ్ఛా వాణిజ్యం సంపన్న దేశాలకు హానికరంగా పరిణమించినందున డబ్యు టి వోను ఉద్ధరించేందుకు సురేశ్‌ ప్రభు చేస్తోన్న ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం లేదన్నది ఒక కఠోర వాస్తవం.