ఆన్‌లైన్‌ పాఠాలు వయా అమీర్‌పేట

ఘర్‌వాపసీ ఎన్నారై పంతుళ్లకు భలే గిరాకీ
సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో వారితోనే శిక్షణ
 
ఆంధ్రజ్యోతి, బంజారాహిల్స్‌/హైదరాబాద్‌ సిటీ: మీరు ఘర్‌వాపసీ ప్రవాసీయా? అంటే.. అమెరికా నుంచో న్యూజిలాండ్‌ నుంచో ఇతర దేశాల నుంచో తిరిగి భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారా? సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో పాఠాలు చెప్పగలరా?? అయితే మీకు ఫుల్లు డిమాండ్‌. విదేశాల నుంచి వచ్చిన అనుభవజ్ఞుల దగ్గర ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకునేందుకు విద్యార్థులు క్యూలు కడుతున్నారు. అలాంటివారికి ఇంగ్లిష్‌ బాగా వచ్చి ఉండడంతో.. విదేశీయులు సైతం వారి దగ్గర పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. చెల్లింపులు కూడా మన కరెన్సీలో కాదు.. వారి కరెన్సీల్లోనే, అనగా పౌండ్లు, డాలర్లలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీటన్నింటికీ.. మన అమీర్‌పేటలోని టెక్‌ ఇన్‌స్టిట్యూట్లు కేంద్రంగా మారాయి.
 
నగరం నుంచే విదేశాల్లోని వారికి పాఠాలు చెప్పడం వెనుక పెద్ద కథే ఉంది. గతంలో సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. దీనికితోడు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. అయితే సాఫ్ట్‌వేర్‌బూమ్‌ పడిపోయిన తరువాత, ఇక్కడి సంస్థలు రూటు మార్చి ఆన్‌లైన్‌ శిక్షణపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. దీనికితోడు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లినవారు అక్కడి శిక్షణ సంస్థల ఫీజులు భరించలేక.. ఆన్‌లైన్‌ ద్వారా ఇక్కడి శిక్షణ సంస్థల నుంచే కొత్తకొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు. దీంతో విదేశీయులకు కూడా మన ఇన్‌స్టిట్యూట్ల గురించి తెలిసి డిమాండ్‌ పెరగడం మొదలైంది. స్కైప్‌ లాంటి సాఫ్ట్‌వేర్ల ద్వారా బోధన జరుగుతోంది. టీమ్‌వ్యూయర్‌ లాంటివాటి ద్వారా ప్రాక్టికల్స్‌ను సైతం దగ్గరుండి మరీ చేయిస్తున్నారు. లైవ్‌ ప్రాజెక్టుల తీరుతెన్నులను వివరిస్తున్నారు.
 
గంటల లెక్కలు..
  • నగరం నుంచి ఆన్‌లైన్‌లో దాదాపు 30-40 వరకు సాఫ్ట్‌వేర్‌ కోర్సులను బోధిస్తున్నారు. అమెరికా, లండన్‌, ఆస్ట్రేలియా ఇలా పలు దేశాల విద్యార్థులతో పాటు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన వారు సైతం తమకు కావాల్సిన కోర్సులను ఆన్‌లైన్‌లోనే నేర్చేసుకుంటున్నారు.
  • ఒరాకిల్‌ ఆప్స్‌ అడ్వాన్స్‌డ్‌ కోర్సును అమెరికాలో ఉండే వారు నేర్చుకోవాలంటే దాదాపు 600 డాలర్లు వరకు ఇక్కడి వారు వసూలు చేస్తున్నారు. 40 గంటల్లో ఈ శిక్షణను పూర్తి చేస్తున్నారు. దీనికితోడు మరో పది రోజులు అదనంగా సపోర్టింగ్‌ తరగతులు అందిస్తారు.
  • టెస్టింగ్‌ టూల్స్‌ నలభై గంటల తరగతులకు దాదాపు 300 డాలర్లు చార్జి చేస్తున్నారు.
  • ఎస్‌ఏపీ కోర్సుకు కూడా 400 డాలర్లు వసూలు చేస్తున్నారు.
 
..అదండీ సంగతి! అమీర్‌పేట్‌ సాఫ్ట్‌వేర్‌ గురువులా.. మజాకా!!