ఎన్నారై ఫ్యాకల్టీకి భలే గిరాకీ

 వారితోనే సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ

విదేశీయులకూ ఇక్కడి నుంచే పాఠాలు

అన్‌లైన్‌లో బోధనలు

 

బంజారాహిల్స్‌: ఆన్‌లైన్ పాఠాలు చెప్పే పంతుళ్లకు భలే గిరాకీ వచ్చింది. అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్‌ఆర్‌ఐల చేత శిక్షణ తీసుకునేందుకు విద్యార్థులు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే తరుణంలో విదేశీయులు ఈ పంతుళ్లే కావాలంటున్నారు. మన పంతుళ్లకు పగలు రుపాయలు.. రాత్రి డాలర్లు.. పౌండ్ల బరువులు అన్ని ఇప్పుడు మన నగర గురువుల ఒళ్లో వచ్చి పడుతున్నాయి. వీటి కోసం విదేశీయులు సైతం ఇప్పుడు మన నగరంలోని సాఫ్ట్‌వేర్‌ బోధకుల వద్ద శిష్యులుగా చేరిపోతున్నారు. అందుకే విదేశీయులకు ఆన్‌లైన్‌ పాఠ్యాంశాల బోధనలో ‘హైదరాబాద్‌’ కీలకంగా మారింది. ఎందుకు అందరిచూపు ఇక్కడ పడుతుందో మీరు కూడా చదవండి.
 
సాఫ్ట్‌వేర్‌ రంగానికి శిక్షణకు నగరం పెట్టింది పేరు. అందులో అమీర్‌పేట అంటే ప్రత్యేకం. ఇప్పుడు శ్రీనగర్‌కాలనీ, బంజారాహిల్స్‌ ఆ స్థానాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐ గురువులతో విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నారు. అనేక ప్రత్యేకలతో ఇక్కడ ఇబ్బడిముబ్బడిగా ఇన్‌స్టిట్యూట్‌లు వెలుస్తున్నాయి. ఇక్కడ నేర్చుకునే పాఠాలే తర్వాత ఎంఎన్‌సీ కంపెనీల్లో ప్రవేశించాలన్నా, విమానాల్లో చక్కర్లు కొట్టాలన్నా, కాసుల రాసులు సంపాదించాలన్నా పనికొస్తాయి. అందుకే రెండు రాష్ట్రాలలోని దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధులు ముందుగా ఈ ప్రాంతాలపైనే తమ దృష్టిసారిస్తారు.
 
భిన్న కోర్సులపై మక్కువతో.. 
నగరం నుంచే విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు విద్యార్థులకు బోధన కోసం ప్రత్యేకం సాఫ్ట్‌వేర్లు రూపొందించుకున్నారు. వీటి ద్వారా విద్యార్ధులకు చదువు చెబితే ఇట్టే అబ్బుతుందని శిక్షకులు అంటున్నారు. ఇదే బిటెక్‌ పూర్తిచేసిన విద్యార్థుల దృష్టి శ్రీనగర్‌కాలనీ, బంజారాహిల్స్‌పై పడటానికి అసలు కారణం. వీరు చెప్పే విధానం నచ్చిన విదేశీయులు ఎన్‌ఆర్‌ఐ బోధకుల వైపు మొగ్గుచూపిస్తున్నారు.
 
ఎలా చెబుతారంటే..
ఐబీఎం మేయిన్‌ ఫ్రేం, సీ ప్లస్‌ప్లస్‌, టెస్టింగ్‌ టూల్స్‌ కోర్సులకు ఎన్‌ఆర్‌ఐ శిక్షకులు ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేసుకుంటారు. దీన్ని పెన్‌డ్రైవ్‌లో లోడ్‌ చేసి విద్యార్థులు దాని ద్వారా శిక్షకులకు చెబుతుంటారు. ఇలా చెప్పడం వల్ల విద్యార్థులు థియరీ, టెక్నికల్‌ ఇలా అన్నిరంగాల్లో సబ్లెక్ట్‌పై పట్టు సాధించగలుగుతారు. శిక్షణ పూర్తయ్యాక పెన్‌డ్రైవ్‌ సాఫ్ట్‌వేర్‌ను విద్యార్థులకే అందిస్తున్నారు. దీనివల్ల నిరంతరం ప్రాక్టీస్‌ చేసే అవకాశం ఉంటుంది.
 
విదేశీ విద్యార్థుల ఆసక్తి
వాస్తవానికి విదేశాలకు వెళ్లే స్వదేశీయులకన్నా విదేశీయులు ఈ ఆన్‌లైన్‌ కోర్సులపట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనికి రెండు కారాణాలున్నాయి. తాము నేర్చుకోవాలనుకొనే పాఠాలను ఇంట్లోనే కంప్యూటర్‌ ముందు కూర్చొని నేర్చుకునే సౌలభ్యం ఒకటయితే, తక్కువ ఖర్చుతో ఆయా కోర్సులను పూర్తిచేసే వెసులుబాటు ఉండటం మరొకటి. ఈ కారణంగా విదేశీ విద్యార్ధులుసైతం తమకు కావల్సిన కోర్సులన్నింటిని నగర నుంచే నేర్చుకుంటున్నారు. సాధారణంగా విదేశాల్లో టెస్టింగ్‌ టూల్స్‌ కోర్సు నేర్చుకోవాలంటే మన లెక్కల ప్రకారం ఇక్కడి వారు ఆన్‌లైన్‌ శిక్షణనిస్తే 16 వేల రూపాయల నుంచి 20వేల వరకు ఖర్చవుతుంది. అదే అక్కడ ప్రత్యక్షంగా నేర్చుకుంటే దాదాపు రెట్టింపు వ్యయం అవుతుంది.
 
నేర్పుతున్న కోర్పులివే..
నగరంలోని చాలామంది ఈ ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతుండగా, కొన్నిసంస్థలు కూడా శిక్షణ అందిస్తున్నాయి. ప్రధానంగా టెస్టింగ్‌టూల్స్‌ నుంచి మొదలుకొని కాగ్నోస్‌, పీహెచ్‌పీ, ఓబిఈఈఈ, జూమ్లా, జావా,జే2ఈఈ,లైనెక్స్‌ అడ్మినిస్టేషన్‌, డాట్‌ నెల్‌, పైధాన్‌, టిబ్కో, షేల్‌ రైటింగ్‌, వెబ్‌షైర్‌, వెబ్‌లాజిక్‌, మేయిన్‌ ఫ్రేమ్స్‌, డాటావేర్‌ హౌసింగ్‌, హైబర్‌ నేట్‌ ఇలా దాదాపు 35నుంచి 40 కోర్సులను బోధిస్తున్నారు. వీటన్నింటికి గంటల లెక్కలు చొప్పున ఆయా దేశాల మాదక ద్రవ్యం ఆధారంగా డబ్బులు తీసుకుంటున్నారు. దీనికితోడు ఆన్‌లైన్‌ ప్రాజెక్టులను అందిస్తున్నారు. డెస్క్‌టాప్‌ను పంచుకొని ఆయా ప్రాజెక్టులను వివరిస్తున్నారు. విదేశాల్లో అప్పటికప్పుడ వచ్చే అడ్వాన్స్‌డ్‌ కోర్సులను సైతం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసి అందిస్తున్నారు.
 
కంపెనీలు కూడా ఇవే కోరుకుంటున్నాయి
ప్రణాళికబద్ధంగా సాఫ్ట్‌వేర్‌ కోర్సులు శిక్షణ తీసుకున్న వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కంపెనీలు అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారినే ఎంపిక చేస్తున్నాయి. థియరీ, టెక్నికల్‌, ఇంటర్వూ ఇలా అనేక దశల్లో విద్యార్థులకు ఓ ప్రక్రియ ప్రకారం శిక్షణ అందిస్తున్నాం. ఇది విద్యార్థులకు మేలు చేస్తుంది. విదేశీయులు కూడా ఇలాంటి కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు. 
మధు పాదాల,ఆక్స్‌నెస్‌ టెక్నాలజీ శిక్షకులు