భారతీయ విద్యార్థులకు విదేశాలు ఎర్రతివాచి

అమెరికాపైనే మోజెక్కువ

మంచి జీవితం, భారీ వేతనాల అవకాశమే ఆకర్షణ
ట్రంప్‌ వ్యాఖ్యలతో కలవరం 
 
 
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యు.కె, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్‌, జర్మనీ తదితర పాశ్చాత్య దేశాల్లోని మేటి విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్య కొనసాగించాలని ఉవ్విళ్లూరే భారతీయ విద్యార్థులకు ఎర్రతివాచీ పరుస్తున్నాయి. మంచి కెరీర్‌, ఆకర్షణీయమైన జీవనశైలి, ఉపాధి అవకాశాలు మన విద్యార్థులను పయనించేలా చేస్తున్నాయనేది నిపుణుల విశ్లేషణ. ఈ క్రమంలోనే భారతదేశంలోని ప్రముఖ నగరాలతో పాటు నవ్యాంధ్రలోని విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి నగరాల్లో ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, కన్సల్టెంట్లు ఏటా అవగాహన సదస్సులు, ముఖాముఖీలు నిర్వహిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. అయితే విదేశీ విద్య మోజును సొమ్ము చేసుకోవడానికి విదేశాల్లో అంతగా పేరులేని, గుర్తింపు లేని మోసపూరిత విద్యాసంస్థల్లో చేరి వెనుదిరిగి వస్తున్న ఉదంతాలు కలవరానికి గురిచేస్తున్నాయి. వివిధ దేశాల్లోని విద్యావకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన అర్హత తదితరాలపై నిపుణుల సూచనల సమాహారమే ఈ కథనం.. 
 
అత్యధిక శాతం అమెరికాపైనే ఆసక్తి 
విదేశీ విద్య అభ్యసించాలనే ఆసక్తి కనబర్చేవారిలో అత్యధికులు అమెరికా సంయుక్త రాష్ట్రాల వైపే చూస్తారనేది నిర్వివాదాంశం. వీసా జారీలో అమెరికన్‌ కాన్సులేట్‌లు నిబంధనలు కఠినతరం చేయడంతో నూటికి 90 శాతం మంది రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నారు. గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌(జీఆర్‌ఈ), టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్షీష్‌ యాజ్‌ ఏ ఫారిన్‌ లాంగ్వేజ్‌(టోఫెల్‌), ఐ.ఇ.ఎల్‌.టి.ఎస్‌(ఐల్స్‌) వంటి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన స్కోరు, ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే అత్యధిక వీసా తిరస్కృతులకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ఆ కోర్సు ఎందుకు చేయాలనుకుంటున్నారో వివరించడంలో వైఫల్యం వీసాల 
తిరస్కృతికి రెండవ కారణంగా నిలుస్తోంది. 
 
వీసా తిరస్కరణకు గురి కాకుండా ఉండాలంటే.... 
వీసాకు వెళ్లే క్రమంలో డాక్యుమెంటేషన్‌ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. కాన్సొలేట్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇవ్వాలి. బ్యాంకులో ఫీజుల చెల్లింపునకు చూపే గ్యారంటీ మూలధనాన్ని కోర్సు పూర్తయ్యేంత వరకు తీయరని నమ్మకం కల్గించేలా ఆర్థిక సావర్ధ్యం ఉందని నిరూపించేలా ఆధారాలు సమర్పించాలి. కోర్సు చదివే సమయంలో కేవలం 20 గంటలు మాత్రమే అధికారికంగా పనిచేసే వెసులుబాటు ఉంటుంది. అనధికారికంగా పనిచేయరని నమ్మకం కలిగించాలి. 
 
ట్రంప్‌ వ్యాఖ్యలతో కలవరం 
మరో వైపు రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వాడుతున్న పదజాలంతో భారతీయ విద్యార్థుల్లో సైతం అమెరికాలో విద్యాభ్యాసంపై అభద్రతాభావం నెలకొంది. దీంతో అదేస్థాయి అవకాశాలు కల్పిస్తున్న ఆస్టేల్రియా, స్వీడన్‌, జర్మనీ, యూకే, కెనడా వంటి దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని యువత ఎక్కువ ఆసక్తి చూపడం తాజా పరిణామం. 
 
అప్రమత్తంగా ఉండాలి 
విదేశీ విశ్వవిద్యాలయాల ఎంపికలో వాటి రేటింగ్‌కు ప్రాఽధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యంత కీలకమైన జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐల్స్‌, పీటీఈ వంటిపరీక్షలకు బీటెక్‌ మొదటి సంవత్సరం నుంచే తర్ఫీదు పొందితే విద్యాలయాల్లో సీట్లు సాధించవచ్చని అంటున్నారు. ఆసే్ట్రలియా, యూకే, కెనడా తదితర దేశాల విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్‌ పొందడానికి ఐల్స్‌, పీటీఈల్లో సాధించే స్కోర్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అమెరికా విద్యాలయాలు జీఆర్‌ఈ, ఐల్స్‌, టోఫెల్‌ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జర్మనీ, స్వీడన్‌ వంటి దేశాలు స్థానిక భాష నేర్చుకుని వచ్చిన వారికే అడ్మిషన్లు ఇస్తున్నాయని నిపుణుల మాట, విదేశీ విద్య కన్సల్టెన్సీలను ఆశ్రయించడంలో అనుభవజ్ఞులకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. 
 
పరిశ్రమల అవసరాలకు ధీటుగా కోర్సుల రూపకల్పన.. నిపుణుల విశ్లేషణ 
విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు ఉపాధి కల్పించే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను ఎప్పటికప్పుడు రీ డిజైన్‌ చేయడం విద్యార్థుల కెరీర్‌ కలల సాకారానికి దోహదం చేస్తుందని నిపుణుల అంచనా. విద్యార్జన సమయంలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు, పరిశ్రమల్లో నేరుగా సంబంధాలు నెలకొల్పుకునే అవకాశం లభిస్తుండటం వారిని ఆ దిశగా నడిపిస్తోంది. 
 
భావ వ్యక్తీకరణ సామర్థ్యాలపై చిన్ననాటి నుంచే శ్రద్ధ 
భావవ్యక్తీకరణ నైపుణ్యాలపై చిన్ననాటి నుంచే శ్రద్ధ పెట్టాలి. ఆంగ్ల భాషలో ప్రావీణ్యంతోనే అత్యధిక విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు ఇస్తున్నాయి. అమెరికా తర్వాత ఆస్ట్రేలియా, కెనడా వెళ్లడానికి అత్యధిక శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. ఐటి, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో కోర్సులు చేయడానికి విజయవాడ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 
- టి.రఘునాధ్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, సౌతిండియా రీజియన్‌ 
 
 
ఇంటర్‌ నుంచే విదేశీ విద్యపై పెరుగుతున్న ఆసక్తి 
గ్రాడ్యుయేషన్‌ చేయడానికి బీటెక్‌, ఎంబీఏలు పూర్తయిన తర్వాత మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. దాంతో పీటీఈ, ఐల్స్‌, టోఫెల్‌ వంటి ఆంగ్ల భాషా నైపుణ్యాలు కొలిచే పరీక్షల్లో మంచి స్కోర్లు చేయలేకపోతున్నారు. దీంతో మంచి విద్యాలయాల్లో చదివే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఏటా వెయ్యికి పైగా అభ్యర్థులు విజయవాడ, గుంటూరులలోని కన్సెల్టెన్సీల నుంచి విదేశీ విద్య అభ్యసనానికి వెళుతున్నట్టు తెలుస్తోంది. పాఠశాల స్థాయి నుంచి ఐఐటీ శిక్షణ తీసుకున్న విద్యార్థులు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉపకారవేతనాలతో బీఎస్‌ కోర్సులు చేస్తున్నారు. 
- వి.శ్రీకాంత్, మేనేజరు, ప్రఖ్యాత కన్సల్టెంట్‌ సంస్థ 
 
అంతర్జాలంలో సమాచారం సేకరించి 
ఐల్స్‌లో 6.5 స్కోరు సాధించా. యూఎస్‌ వీసాల జారీని తగ్గించడంతో ఆ దిశగా ప్రయిత్నించలేదు. విదేశాల్లో ఐటీలో ఎంఎస్‌ చేయాలని ఆసక్తి ఉంది. అంతర్జాలంలో విదేశీ విద్యకు సంబంధించి సమస్త సమాచారం లభిస్తోంది. వాటి ఆసరాగా కన్నెల్టెంట్లను సంప్రదించి ఆసే్ట్రలియాలోని డీకన్‌ విశ్వవిద్యాలయం, రాయల్‌ మెలబోర్న్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలలో అడ్మిషన్‌ పొందాను. 
- పి.రాహుల్‌, బీటెక్‌ సీఎస్‌ఈ కె.ఎల్‌.యూ, అంకమ్మనగర్‌, గుంటూరు 
 
ట్రంప్‌ గెలిస్తే భారతీయులను తరిమేస్తారని.. 
ఎంటెక్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌లో చేయాలని ఉంది. ఈనెల 15న పియర్‌సన్‌ టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌(పీటీఈ)కు స్లాట్‌ బుక్‌ చేసుకున్నా. అమెరికాలో ట్రంప్‌ గెలిస్తే భారతీయులను గెంటివేస్తారని ఆసే్ట్రలియా, కెనడాల్లోని విశ్వవిద్యాలయాల్లో ప్రయత్నిస్తున్నా. ఆసే్ట్రలియాలో మైనింగ్‌కు ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెల్సింది. అక్కడే ఎంఎస్‌ చేయాలని ఉంది. 
- జె.చరణ్‌కుమార్‌, బీటెక్‌, మెకానికల్‌, విజ్ఞాన్‌ వడ్లమూడి, తాడేపల్లి 
 
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎంఎస్‌ చేయాలని.. 
ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్‌ చేయాలని బీటెక్‌ చివరి సంవ త్సరంలో లక్ష్యం విధించుకున్నా. క్యాడ్‌, మెషిన్‌ డిజైన్లలో ఎంఎస్‌ చేస్తా. ఐల్స్‌, జీఆర్‌ఈలు రాస్తా. ఆసే్ట్రలియా, యూకేల్లో విద్యా వకాశాలపై అంతర్జాలంలో సమాచారం సేకరిస్తున్నా. 
- సాధు అనుదీప్‌, విజయవాడ, బీటెక్‌ 
 
మౌలికవసతుల అభివృద్ధిపై ఎంఎస్‌ చేస్తా 
అమెరికాలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో అవకాశాలు తక్కువ. ఇతర పాశ్చాత్య దేశాల్లో నిర్మాణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లో విశేష అవకాశాలు ఉన్నాయి. ఐల్స్‌లో 5.5 స్కోరు వచ్చింది. దాన్ని 6.5కు పెంచాలి. పీటీఈ కూడా రాస్తా. సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలనే ఆసక్తి లేదు. ఐవోటీ వలన అందరికీ జాబ్‌లు పోయినా సివిల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో అలాంటి భయం లేదు. 
- నంబూరు సందీప్‌, బీటెక్‌, 
సివిల్‌, వీఆర్‌ సిద్ధార్థ కళాశాల, విజయవాడ