విమాన సంస్థల విదేశీ బాట!

అంతర్జాతీయ మార్గాల్లో సేవలపై చౌక విమానయాన సంస్థల దృష్టి
ఆంధ్రజ్యోతి, బిజినెస్‌ డెస్క్‌: దేశంలో దాదాపు అన్ని ప్రముఖ నగరాలకు సేవలందిస్తోన్న చౌక విమానయాన సంస్థలు.. అంతర్జాతీయ మార్గాల్లో సేవల విసౖరణపై దృష్టిసారిస్తున్నాయి. స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌, ఇండిగో ఎయిర్‌లైన్స్‌.. విదేశాల్లోని మరిన్ని నగరాలకు సర్వీసులు ప్రారంభించాలనుకుంటున్నాయి. టాటా గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ విస్తారా ఎయిర్‌లైన్స్‌ కూడా విదేశీ బాట పట్టేందుకు ఆసక్తిగా ఉంది. ఇందుకోసం సంస్థకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. అంతలోగా అంతర్జాతీయ మార్గాల్లో పట్టున్న జెట్‌ ఎయిర్‌వేస్ లో విస్తారా ద్వారా వాటా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం కూడా ఉడాన్‌ పథకం ద్వారా చౌకగా విదేశీ విమానయాన సేవలందించేందుకు సమాయత్తమవుతోంది. ఈ పథకంలో భాగంగా విదేశీ మార్గాల్లో విమాన సేవలందించేందుకు ఆసక్తిగా ఉన్న ఎయిర్‌లైన్స్‌ నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఉడాన్‌ ద్వారా చౌక విమానయాన సంస్థలు మరిన్ని విదేశీ నగరాలకు సేవలందించే అవకాశం లభించనుంది.
 
ఇండిగో
రెండు నెలల్లో హాంకాంగ్‌కు విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు ఈమధ్యనే ఇండిగో ప్రకటించింది. దీంతో కలిపి ఇండిగో సేవలందిస్తున్న విదేశీ నగరాల సంఖ్య 15కు చేరుకోనుంది. డిసెంబరు 11 నుంచి బెంగళూరు-హాంకాంగ్‌ మధ్య డైరెక్ట్‌ విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. బెంగళూరు- హాంకాంగ్‌ విమాన టికెట్‌ ధరను రూ.11,499గా, హాంకాంగ్‌ నుంచి బెంగళూరుకు టికెట్‌ రేటును రూ.22,999గా నిర్ణయించింది. నవంబరు 15 నుంచి మలేషియాలోని కౌలాలంపూర్‌ నుంచి ఢిల్లీ, బెంగళూరుకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. సంస్థ అంతర్జాతీయ సేవల సామర్థ్యాన్ని 31 శాతం మేర పెంచుకోవాలని భావిస్తోంది.
 
గో ఎయిర్‌
మరో చౌక విమానయాన సంస్థ గోఎయిర్‌.. థాయ్‌లాండ్‌లోని ఫుకెత్‌, మాల్దీవుల్లోని మాలే నగరాలకు ముంబై, ఢిల్లీ నుంచి గతవారం సర్వీసులను ప్రారంభించింది. సంస్థ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఢిల్లీ-ఫుకెత్‌ సర్వీసు చార్జీ రూ.18,999, ముంబై-మాలే టికెట్‌ రేటు రూ.25,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఢిల్లీ నుంచి మాలే మధ్య విమాన చార్జీ రూ.27,999 నుంచి మొదలవుతుంది.
 
స్పైస్‌జెట్‌
అంతర్జాతీయ సేవలందించేందుకు అనువైన ‘బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8’ ఎయిర్‌క్రా్‌ఫ్టను ఈమధ్యనే తన విమానాల జాబితాలోకి జోడించింది స్పైస్‌జెట్‌. ఈ విమానంతో నవంబర్‌ 22 నుంచి ఢిల్లీ-హాంకాంగ్‌ రూట్లో సేవలను ప్రారంభించనుంది. ఈ రూట్లో విమాన చార్జీని రూ.20,799గా నిర్ణయించింది సంస్థ. హాంకాంగ్‌కు సేవల ప్రారంభం ద్వారా స్పైస్‌జెట్‌ సేవలందించే విదేశీ నగరాల సంఖ్య 8కి పెరగనుంది. మున్ముందు మరిన్ని విదేశీ నగరాలకు సేవలను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో అంతర్జాతీయ సేవల సామర్థ్యాన్ని మరో 17 శాతం పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది.
 
అంతర్జాతీయ రూట్లలో ఆ రెండింటిదే హవా
విదేశీ నగరాలకు సేవలందిస్తున్న దేశీయ ఎయిర్‌లైన్స్‌లలో ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వే్‌సదే మెజారిటీ వాటా. ప్రపంచంలోని పలు ప్రముఖ నగరాలకు విమాన సర్వీసులను నడుపుతోన్న ఈ రెండు సంస్థలు ఈమధ్యకాలంలో విదేశీ సేవలను అంతగా విస్తరించలేదు. ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌ రెండూ ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ సేవలను పెద్దగా విస్తరించే అవకాశాలు కన్పించడం లేదు. ఈ పరిణామం చౌక విమానసేవల సంస్థల విదేశీ విస్తరణ ప్రణాళికలకు బాగా కలిసిరానుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.