మోదికి వచ్చిన బహుమతుల విలువెంతో తెలుసా?

న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోది 168 బహుమతులు తీసుకున్నారు. అయితే వాటి విలువ 12.57 లక్షల రూపాయలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఈ బహుతమతులన్నీ 2017 జూలై నుంచి 2018 జూన్ మధ్య చేసిన పర్యటనల్లో వచ్చినవేనని పేర్కొంది.

వీటిల్లో మోంట్ బ్లాంక్ రిస్ట్ చేతి గడియారం (1.10 లక్షల రూపాయలు), వెండి పలకం (2.15 లక్షల రూపాయలు), మోంట్ బ్లాంక్ పెన్ను (1.25 లక్షలు రూపాయలు) అందులో అత్యంత ఖరీదైనవి. బొమ్మలు, పేయింటింగులు, పుస్తకాలు, చిత్ర పటాలు, బుల్లెట్ ట్రైన్ నమూనాలు ఉన్నాయి.
 
ఇజ్రాయెల్, జర్మనీ, చైనా, జోర్దాన్, పాలస్తీనా, యూఏఈ, రష్యా, ఓమన్, స్వీడన్, బ్రిటన్, ఇండోనేషియా, మలేషియాలతో పాటు మరో 8 దేశాల్లో ప్రధాని మోది పర్యటనలు చేశారు. మోది పర్యటన నిమిత్తం ఈ దేశాలకు చెందిన ప్రముఖులు కొన్ని రకాల బహుమానాలు ఇచ్చారు.
 
నేపాల్‌లోని పశుపతినాథ్, ముక్తానాథ్ దేవాలయాల నమూనాలు.. దేవతల బొమ్మలు, కార్పెట్ లు, కార్డిగాన్లు, మఫ్లర్లు మరియు ఫౌంటెన్ పెన్నులు వంటివి కూడా ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా 50,000 రూపాయల విలువైన ఒక మసీదు ప్రతిరూపాన్ని, 20,000 రూపాయల విలువైన ఒక బాణాన్ని కూడా అందుకున్నారు.
 
విదేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ అధికారులు అందుకున్న 5,000 రూపాయల విలువైన బహుమతులు సదరు మంత్రిత్వ శాఖ ఖజానాలో జమ చేయబడతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.