విదేశాలకు మీ సామాను తీసుకెళ్తున్నారా..?

విదేశాలకు వెళ్ళేవాళ్ళు సామగ్రిని, ఫర్నిచర్‌ను జాగ్రత్తగా చేరవేసే సంస్థలను ఎన్నుకోవాలి. ఇటువంటి కంపెనీలను ఆంగ్లంలో రిమూవల్ కంపెనీలు అంటారు. ప్యాకేజింగ్, రవాణా కోసం ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా ఛార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని కంపెనీలు భారీ మొత్తం గుంజే ప్రయత్నం చేస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ అవసరం ఏమిటో ముందుగా గుర్తించి, సరైన నిర్ణయం తీసుకోవాలి.
 
మీరు విదేశాలకు పంపించాలనుకుంటున్న వస్తువులు ఎన్ని ఉన్నాయో ముందుగా చూసుకోవాలి. వాటిని మీరే స్వయంగా తీసుకెళ్ళగలరేమో చూడాలి. అది అసాధ్యమనుకుంటే రిమూవల్ కంపెనీలను సంప్రదించాలి. ప్రతి క్యూబిక్ మీటర్‌కు ఛార్జి చెల్లించవలసి ఉంటుంది కనుక చాలా ముఖ్యమైనవాటినే పంపించేందుకు ప్రయత్నించాలి. 
 
ఛార్జీల నిర్ణయానికి రిమూవల్ కంపెనీలు  పరిగణించే అంశాలు :
1. లోడ్ సైజ్.
2. రవాణా చేయవలసిన దూరం.
3. ఫర్నిచర్ రకం.
4. ఎందరు పనివారు కావాలి?
 
జాబితాను సిద్ధం చేసుకోవాలి
 
రిమూవల్ కంపెనీ కచ్చితమైన కొటేషన్ ఇచ్చేందుకు వీలుగా రవాణా చేయవలసిన ఫర్నిచర్, తదితర వస్తువుల జాబితాను తయారు చేసుకోవాలి. ఇంటికి వచ్చి చూస్తామని కంపెనీలు చెప్తూ ఉంటాయి. అయితే ఇది తప్పనిసరి కాదు. అనుభవంగల కంపెనీలు ఇంచుమించుగా కచ్చితంగా మీరు రవాణా చేయవలసిన సామగ్రి గురించి అంచనా వేయగలవు. జాబితా రాసుకుంటే మరింత సజావుగా పని జరిగిపోతుంది. దీనివల్ల మూడు ప్రయోజనాలు ఉన్నాయి.
 
1. ఏం తీసుకెళ్ళాలో రిమూవల్ కంపెనీకి అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు సైజులను కూడా రాసుకుంటే పని ఇంకా తేలికవుతుంది. ఉదాహరణకు పియానో తీసుకెళ్ళాలని అనుకుంటే దానిని మోయడానికి కనీసం ముగ్గురు వ్యక్తులు అవసరమవుతారు. ఈ విధంగా తేలికైనవి, బరువైనవి వంటి వివరాలు స్పష్టంగా తెలిస్తే రిమూవల్ కంపెనీ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. 
2. ఇన్సూరెన్స్ క్లెయిము చేసే సందర్భంలో సంబంధిత సామగ్రిని రిమూవల్ కంపెనీ రవాణా చేసినట్లు ఆధారాలు చూపించవచ్చు. 
3. ప్యాకింగ్‌లను ఇంట్లో సర్దుకునేటపుడు కూడా జాబితా రాసుకోవడం వల్ల ఉపయోగమే. ఏ నంబరుతో ఉన్నదానిని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోవచ్చు. దీనికోసం సింపుల్ స్ప్రెడ్‌‌షీట్‌ను ఉపయోగించవచ్చు.
 
జాబితా రాసుకోవడం వల్ల అనవసరమైన వస్తువులను తీసుకెళ్ళకుండా జాగ్రత్త వహించవచ్చు. ఇల్లు మారడమంటే మన దగ్గర ఉన్న వస్తువులను క్రమబద్ధీకరించుకోవడానికి లభించిన గొప్ప అవకాశం. క్యూబిక్ మీటర్లలో బేరం కుదుర్చుకుంటే, ఒకవేళ  వ్యానులో సరకును పెట్టిన తర్వాత  కొంచెం ఎక్కువ సైజు వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు రిమూవల్ కంపెనీతో బేరాలు ఆడటం సాధ్యం కాదు. ఆ రోజు ఆ కంపెనీ ఎక్కువ డిమాండ్ చేస్తే కొన్నిటిని వదిలేయాల్సి రావచ్చు. అందుకే జాగ్రత్తగా జాబితా రాసుకోవాలి. సరైన కొటేషన్ కోసం క్రింది జాగ్రత్తలు పాటించాలి. 
- మీరు తరలించాలని అనుకుంటున్న అన్ని వస్తువుల జాబితాను రాసుకోవాలి.
- పెద్ద వస్తువులు క్యూబిక్ మీటర్లలో ఎంత పరిమాణంలో ఉన్నాయో తెలుసుకోవాలి. 
- తీసుకెళ్ళవలసిన పెట్టెలఃను, వాటిలో ఒక్కోదాని పరిమాణాన్ని నిర్ధారించుకుని, అన్ని పెట్టెల పరిమాణాలను రాసుకుని, కూడాలి.
 
రవాణా చేయవలసిన దూరం, లోడు మాత్రమే ప్రభావం చూపిస్తాయని అనుకోకూడదు. ఫ్లాట్‌ నుంచి వెళ్తున్నా, ఫ్లాట్‌లోకి వెళ్తున్నా... దానిలో ఎన్ని అంతస్థులు ఉన్నాయి. ఏ అంతస్థులోకి వీటిని చేర్చాలి, ఎలివేటర్ ఉంటే ఉపయోగించవచ్చునా, ఎలివేటర్‌లో ఎంత బరువు పెట్టవలచ్చు వంటి అంశాలను రిమూవల్ కంపెనీకి తెలియజేయడం మర్చిపోకూడదు. ఇరుకైన రోడ్లు, అసలు రోడ్లే లేకపోవడం వంటి విషయాలను కూడా తెలిజేయాలి. 
 
ఎటువంటి కంపెనీని ఎంచుకోవాలి?
 
జాబితా రాసుకున్న తర్వాత వేర్వేరు రిమూవల్ కంపెనీలను సంప్రదించాలి. సాధ్యమైనంత చౌకగా తరలించాలని అనుకుంటే చిన్న కంపెనీలనే ఎంచుకోవాలి. అయితే పెద్ద కంపెనీలు అందించే అదనపు సేవలను చిన్న కంపెనీలు ఇవ్వకపోవచ్చు. రిమూవల్ కంపెనీల సంఘం ద్వారా గుర్తింపు పొందిన కంపెనీని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కొందరికి రిమూవల్ కంపెనీలు పీడకలలు తెప్పిస్తూ ఉంటాయి. ఫర్నిచర్ విరిగిపోవడం, కనిపించకుండా పోవడం వంటి సంఘటనలతో పాటు స్టోరేజ్ నుంచి వస్తువులను ఇచ్చేటపుడు ఎక్కువ సొమ్మును గుంజుతూ ఉంటారు. సక్రమంగా సేవలు అందించరు. చెప్పిన సమయానికి రారు. వాళ్ళకు నచ్చినప్పుడు వస్తారు. 
 
కొన్ని కంపెనీలు గ్రూపేజ్ సర్వీస్‌ను అందిస్తాయి. వాళ్ళకు ఖాళీ ఉన్న వ్యానులో మీ సామాన్లు కొన్ని పెట్టి రవాణా చేస్తారు. ఇలా చేయడం వల్ల చౌకగా పని పూర్తవుతుంది. అయితే కొన్నిసార్లు ఆ సామాన్ల కోసం నెలల తరబడి వేచి చూడక తప్పకపోవచ్చు. ఏ కంపెనీని ఎంచుకున్నా ముందుగా బాగా బేరమాడాలి. బేరమాడేటపుడు ఆ కంపెనీలు ఇచ్చే తగ్గింపులు, అదనపు సర్వీసులు ఆశ్చర్యంగా ఉంటాయి. ధరతో పాటు రిమూవల్ కంపెనీలు అందజేసే సేవల గురించి కూడా చూడాలి. కొన్ని కంపెనీలు కేవలం లోడింగ్, అన్‌లోడింగ్ మాత్రమే చేస్తాయి. మరికొన్ని కంపెనీలు మీ సామగ్రిని సర్దుకోవడానికి బాక్సులను ఇస్తాయి, ఆ బాక్సులను లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తాయి. ఇంకొన్ని కంపెనీలు ఈ సేవలతో పాటు ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ కూడా చేస్తాయి. మరికొన్ని కంపెనీలైతే సామగ్రిని శుభ్రపరుస్తాయి కూడా. పెంపుడు జంతువులను, భారీ వస్తువులను, సున్నితమైన వస్తువులను రవాణా చేస్తాయో, లేదో కూడా చూసుకోవడం ముఖ్యం. సామగ్రిని, వస్తువులను రవాణా, బట్వాడా చేసేందుకు గరిష్ఠ సమయాన్ని నిర్ణయించుకోవాలి. సామగ్రిని సకాలంలో రవాణా చేయలేకపోతే సొమ్ము వాపసు చేస్తామనే హామీని రాతపూర్వకంగా పొందాలి. 
 
సున్నితమైన, విలువైన వస్తువులు ఉంటే తప్పనిసరిగా లోడ్‌కు బీమా చేయించాలి. అత్యధిక బీమా కంపెనీలు పెట్టే షరతు ఏమిటంటే వస్తువులను రిమూవల్ కంపెనీ సిబ్బంది ప్యాకింగ్ చేస్తేనే బీమా సదుపాయం కల్పిస్తామని చెబుతాయి. రిమూవల్ కంపెనీ సేవలను పూర్తిగా పొందకపోతే మీకు బీమా సదుపాయం లభించకపోవచ్చు. బీమా కోసం లోడ్ మొత్తం విలువలో దాదాపు 2 శాతం చెల్లించవలసి ఉంటుంది. బీమా సొమ్ము ఆధారంగా దీనిని లెక్కిస్తారు. మీ వస్తువులను రవాణా చేసే కంపెనీ చేత బీమా చేయించడంలో కాస్త ప్రతికూలత ఉంటుంది. వాళ్ళు మీ ప్రతి క్లెయిముకు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వేరొక కంపెనీ చేత బీమా చేయించడం మంచిది. ప్యాకింగ్‌కు ముందు మీ వస్తువులను ఫొటో తీయడం చాలా శ్రేయస్కరం. ఏదైనా నష్టం జరిగితే ఈ ఫొటోలను ఆధారాలుగా చూపించవచ్చు.