శ్రీవారి చెంతకు విమాన యాత్ర

తెలంగాణ టూరిజం విమాన ప్యాకేజీలు
ప్యాకేజీలో ఇతర ఆలయాల సందర్శన కూడా
స్పైస్‌, ట్రూ జెట్‌ విమానాల్లో రవాణా సౌకర్యం
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వృత్తి, వ్యాపార రంగాల్లో నిత్యం బిజీబిజీగా ఉండే వారు శ్రీవారి దర్శనానికి తక్కువ వ్యవధిలో వెళ్లి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆయా వర్గాలకు అనుగుణంగా పలు రకాల ప్యాకేజీలను అమలు చేస్తూ ఆహ్వానిస్తున్నారు.
హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి
 
ఒక రోజు ప్యాకేజీ..
వీలైనంత త్వరగా స్వామి దర్శనానికి వెళ్లి రావాలనుకునేవారికి ఒక రోజు ప్యాకేజీ ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి నేరుగా తిరుపతికి తీసుకెళ్తారు. తొలుత తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శనం కల్పిస్తారు. తర్వాత తిరుమల కొండ పైనుంచి కిందకు తీసుకొచ్చి తిరుపతిలో కొలువుదీరిన పద్మావతి అమ్మవారి దర్శనం చేయించి హైదరాబాద్‌కు తిరిగి తీసుకొచ్చేస్తారు. ఈ ప్యాకేజీలో విమాన చార్జీలతోపాటు తిరుపతి నుంచి తిరుమలకు ఏసీ వాహనాల్లో తీసుకెళ్లడం, దర్శనం, వసతి, ఆహారం, గైడ్‌ సౌకర్యం ఉంటాయి.
 
రెండు రోజుల ప్యాకేజీ..
తిరుమలేశుడు, పద్మావతి అమ్మవార్లదర్శనంతోపాటు కాణిపాకం, శ్రీకాళహస్తి కూడా వెళ్లాలనుకునేవారికి రెండు రోజుల ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి నేరుగా తిరుపతికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి టూరిజంశాఖ ప్రత్యేక వాహనాల్లో తిరుమల కొండపైకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తర్వాత కాణిపాకం, పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలకు తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీలో కూడా విమాన చార్జీలతోపాటు తిరుపతి నుంచి తిరుమలకు ఏసీ వాహనాల్లో తీసుకెళ్లడం, దర్శనం, వసతి, ఆహారం, గైడ్‌ సౌకర్యం ఉంటాయి.
 
బుకింగ్‌ కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
శ్రీవారిని దర్శించుకునేందుకు ఆసక్తి కలిగిన భక్తుల కోసం టూరిజం శాఖ అధికారులు పలు నంబర్లను అందుబాటులో ఉంచారు.
 
సీఆర్‌వో బషీర్‌బాగ్‌: 9848540371, ఐఆర్‌వో యాత్రి నివాస్‌: 9848126947
ఐఆర్‌వో ట్యాంక్‌బండ్‌: 9848125720, ఐఆర్‌వో పర్యాటకభవన్‌: 9848306435
ఐఆర్‌వో కూకట్‌పల్లి: 9848540374, ఐఆర్‌వో దిల్‌సుఖ్‌నగర్‌: 9848007020
ఐఆర్‌వో మెహిదీపట్నం: 8367285285, ఐఆర్‌వో సాలార్‌జంగ్‌ మ్యూజియం: 9133844665