Expats-must-follow-these-tips-who-are-in-Gulf

ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారా..?

అవగాహన లేకుంటే కష్టాలే
అక్కడి చట్టాలు, సౌకర్యాలు తెలుసుకున్నాక వెళ్లడం మేలు 

ఉన్న ఊరిని, కన్నవారిని, భార్యబిడ్డలను వదిలి చాలా మంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో  ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి మోసపోతుంటారు. లక్షరూపాయలను వారి చేతుల్లో పెట్టి అక్కడికి వెళ్తే అక్కడి చట్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియక ఇబ్బందులు పడుతుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే కార్మికులు ప్రొటెక్టర్‌ అఫ్‌ ఇమిగ్రెంట్స్‌ (వలసదారుల సంరక్షకులు) వారి కార్యాలయం ద్వారా ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ తీసుకోవాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక కథనం...
 
విదేశాలకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
 • పాస్‌పోర్ట్‌ దరఖాస్తులో ఇంటిపేరు, పేరు, తల్లి,తండ్రి పేర్లను, జీవిత భాగస్వామి పేర్లను స్పష్టంగా రాయాలి. జన్మస్థలం పుట్టిన తేదీ, చిరునామా, విద్యార్హతలను సక్రమంగా పేర్కొనాలి.
 • ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఉచిత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి.
 • విదేశాలకు వెళ్లేముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. విదేశాల్లో మెడికల్‌ చెకప్‌లో ఫెయిల్‌ అయితే ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపిస్తారు. 
 • ఏ దేశానికి వెళ్లాలనుకుంటున్నారో స్పష్టత కలిగి ఉండాలి.
 • విజిటింగ్‌ విసా, అజాద్‌ విసా, ఫ్రీ విసా, ఖఫాలత్‌ విసా, ప్రైవేట్‌ విసాలపై విదేశాలకు వెళ్లవద్దు. లేనిపోని చిక్కులు కొనితెచ్చుకోవద్దు. చట్టబద్దమైన కంపెనీల వీసాలపై మాత్రమే వెళ్లాలి.
 • ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ, ప్రొటెక్టర్‌ జనరల్‌ అఫ్‌ ఇమ్మిగ్రెంట్‌ జారీ చేసిన లైసెన్స్‌, అనుమతి కలిగిన రిక్రూటింగ్‌ ఏజెన్సీల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలి. 
 • విదేశీ యాజమాన్యం నుంచి పొందిన డిమాండ్‌ లెటర్‌, పవర్‌ అఫ్‌ అటార్నీ పత్రాలు ఉన్న ఏజెంట్‌ ద్వారా మాత్రమే వెళ్లాలి.
 • ఇండియన్‌ ఎంబసీతో ధ్రువీకరించిన భాషతో పాటు ఇంగ్లీషు, తెలుగు భాషల్లోని ఉద్యోగ ఒప్పంద పత్రం కలిగి ఉండాలి. ఉద్యోగ ఒప్పంద పత్రం ఒక శ్రామికుడి హక్కులను పరిరక్షిస్తుంది.
 • ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ 1983 ప్రకారం సబ్‌ ఏజెంట్లకు అనుమతి ఉండదు. కనీసం అర్నెల్లపాటు చెల్లే విసా ఉండేలా చూడాలి. చెల్లుబాటులో ఉన్న వీసా తప్పకుండా పాస్‌పోర్ట్‌పై స్టాంపింగ్‌ అయి ఉండాలి. విడిగా వీసా అయినా ఉండాలి.
 • విదేశాలకు ఉద్యోగాలకు వెళ్లడానికి సర్వీస్‌ చార్జీగా 45 రోజుల వేతనం (రూ.20వేలకు మించకుండా) మాత్రమే ఏజెంట్‌కు చెల్లించా లి. డిమాండ్‌ డ్రాప్ట్‌ లేదా చెక్‌ద్వారా చెల్లించి రశీదు తీసుకోవాలి.
వెళ్లాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
 • గల్ఫ్‌ దేశాలకు వెళ్తే వీలైనంత త్వరగా రెసిడెంట్‌ పర్మిట్‌, ఐడెంటీటీ కార్డ్‌, లేబర్‌ కార్డ్‌, అఖామా, బతకా పొందాలి.
 • విదేశాల్లోని చట్టాలు, సంప్రదాయాలను పాటించడంతోపాటు వాటిని విధిగా గౌరవించాలి.
 • విదేశాల్లో ఉద్యోగాలు శాశ్వతం కాదు. ప్రపంచంలోని పరిస్థితులు, ఉద్యోగం చేస్తున్న దేశంలో పరిణామాలవల్లఏ క్షణంలోనైనా ఉద్యోగానికి ముప్పు వాటిల్లవచ్చనే ఆలోచనతో వ్యవహరించాలి.
 • అరబ్‌, గల్ఫ్‌ దేశాల్లో యజమాని నుంచి పారిపోయి వేరేచోట పనిచేయడం వల్ల అక్రమవాసులు (ఖల్లివెల్లి)గామారితే తమ హక్కులను కోల్పోతారు.
 • ఓవర్‌ టైం పని చేయాలనే ఒత్తిడి యాజమానికి లేదు. ఇష్టమైతే అదనపు పనికి అదనపు వేతనం ఇస్తేనే ఓవర్‌టైమ్‌ చేయాలి. వారానికి ఒకరోజు సెలవు పొందే హక్కు ఉంటుంది.
 • గల్ఫ్‌ దేశాల చట్టాల ప్రకారం సమ్మె, ఆందోళనలు చేయడం నిషేదం.
 • మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్ష (ఎంజీపీఎస్‌వై), సాంఘిక భద్రత పొదుపు పథకంలో చేరాలి. పొదుపునకు ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొంత ప్రోత్సాహక చందా జమ చేస్తుంది.
 • విదేశాల నుంచిడబ్బును పంపడానికి సొంత ఊళ్లో ఎన్నారై ఖాతా తెరవాలి.
 • సెల్‌ఫోన్‌లు వాడుతున్నకనీసం రెండు, మూడు నెలలకోసారైనా కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాస్తూ ఉండాలి. వాటిని పోస్ట్‌ ద్వారా పంపాలి. అలాపంపడం ద్వారా ఈ ఉత్తరాలపై ఉన్న ముద్రలు ఆపదకాలంలో ఉపయోగడపడవచ్చు.
 • విదేశాల్లో ఇబ్బందులు ఉంటే సమీపంలోని భారతీయ రాయభార కార్యాలయంలో సంప్రదించాలి.
కార్మికులకు ప్రత్యేక చట్టాలు...
ప్రవాస కార్మికులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.వీరికి స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉంది. అలాగే బానిసత్వానికి, బలవంత చాకిరీకి వ్యతిరేకంగా రక్షణ పొందవచ్చు. ఇలాంటి చట్టాల గురించి గల్ఫ్‌ వెళ్లే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవడం మంచిది. ఆపద సమయంలో ఇలాంటివి ఎంతో ఉపయోగపడతాయి.