స్టూడెంట్‌ వీసా పొందండిలా....

 యూఎస్‌లో చదువుకోవడం చాలా మంది విద్యార్థుల కల. ఆ కల కలగానే మిగలకుండా ఉండాలంటే యూనివర్శిటీకి చేసే దరఖాస్తు నుంచి వీసా పొందే వరకూ ప్రతీదీ జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా యూఎస్‌లోకి జీవితంలో అడుగుపెట్టలేకపోవచ్చు. యూఎస్‌ గడప తొక్కడానికి వీసా పొందడం చాలా ముఖ్యం. అందుకే వీసా పొందడానికి వేసే ప్రతీ అడుగూ అత్యంత కీలకమైనది..

 
వర్శిటీలో చేరడానికి యూనివర్శిటీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లయితే వెంటనే ఎఫ్‌-1 నాన్‌ ఇమ్మిగ్రేషన్‌ వీసాకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్థానికంగా ఉన్న యూఎస్‌ ఎంబసీలో ఇంటర్వ్యూని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ముందుగా మెషీన్‌ రీడబుల్‌ వీసాకు దరఖాస్తు చేయాలి. ఎంబసీ అధికారులు చెప్పిన విధంగా దరఖాస్తు ఫీజు 160 డాలర్లను చెల్లించాలి. 
 
ఆన్‌లైన్‌లో డీఎస్‌-160 (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌) దరఖాస్తు విధానాన్ని పూర్తి చేయండి. 
 
యూనివర్శిటీ అంగీకార పత్రాన్ని, అన్ని రకాల ఫీజులు చెల్లించిన రసీదులను, మీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ను, యూఎస్‌లో చదువు పూర్తయి ఆరు నెలలయినా చెల్లే విధంగా ఉండే పాస్‌పోర్ట్‌ను, ఎంబసీ అధికారులు సూచించిన ఇతర పత్రాలను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
 
మీకు వీసా ఇవ్వాలా వద్దా అనేది కాన్సులర్‌ అధికారి నిర్ణయిస్తారు. మీకు ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి, మీరు గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాలనుకుంటున్నారా.. లేదా..? మీ విద్యకు సంబంధించిన మార్కులను ఆధారం చేసుకుని కాన్సులర్‌ అధికారి వీసాను అమోదిస్తారు.
 
చివరగా ఆంగ్ల భాషపై మీకున్న ప్రావీణ్యం కూడా వీసా ఆమోదంపై ప్రభావం చూపుతుంది. ఇంగ్లీషుపై ప్రావీణ్యాన్ని ఇంతకుముందే యూనివర్శిటీలో మీ ప్రవేశాన్ని ఆమోదించేటప్పుడు ఓ సారి పరీక్షిస్తారు. రెండోసారి కాన్సులేట్‌ అధికారి పరీక్షించి మీ వీసాపై ఆమోదముద్ర వేస్తారు.
 
మీ కోర్సు ఫీజును ఏ విధంగా చెల్లిస్తారు, ఏ కోర్సును తీసుకున్నారు, దానిపై మీకున్న కనీస అవగాహనేంటి, కోర్సు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు వంటి ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాలే యూఎస్‌ మెట్లు ఎక్కడానికి సోపానాలవుతాయి. అందుకే ముందుగా ప్రిపేర్‌ అవడం మంచిది. 
 
మీకు ఇంతకుముందు ఏమయినా క్రిమినల్‌ రికార్డు ఉందా అని కాన్సులేట్‌ అధికారులు ముందుగానే ఆరా తీస్తారు. 
ఈ ప్రాసెస్‌ అంతా పూర్తయి మీకు వీసా చేతిలోకి రావడానికి యూఎస్‌లో మీ కోర్సు ప్రారంభానికి నాలుగు నెలల ముందు రావచ్చు. అయితే వీసా వచ్చిన వెంటనే యూఎస్‌లో అడుగుపెట్టడానికి అమెరికా ఒప్పుకోదు. కోర్సు ప్రారంభానికి 30 రోజుల ముందుగా మాత్రమే యూఎస్‌ చేరుకోవచ్చు. ఒక వేళ మీకు విజిటర్‌ వీసా కనుక ఉంటే ముందుగానే వెళ్లవచ్చు.