70 దిశగా రూపాయి...

ఒక్క రోజులోనే 38 పైసలు పతనం.. 
అందరి గుండెల్లో దడ
ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజురోజుకి పడిపోతోంది. బుధవారం ఒక్కరోజే 38 పైసలు నష్టపోయి రూ.68.42 దగ్గర ముగిసింది. గత 18 నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. డాలర్‌తో రూపాయి మారకం ఎందుకు బక్కచిక్కుతోందంటే...
 
చమురు సెగ
చమురు ధర పెరుగుదలతో భారత స్థూల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దీనికి బ్రేక్‌ పడకపోతే కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌), ద్రవ్య లోటు అదుపు తప్పి రూపాయి మారకం రేటు మరింత క్షీణించే ప్రమాదం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ సంవత్సరం డాలర్‌తో రూపాయి మారకం రేటు ఇప్పటి వరకు 6 శాతం పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణం బ్యారల్‌ చమురు ధర 80 డాలర్లకు చేరడమే.
 
మార్కెట్‌ అంచనాలు
దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేక పోవటం కూడా డాలర్‌తో రూపాయి మారకం రేటును దెబ్బతీస్తోంది. చమురు సెగ తగ్గకపోతే ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించి డాలర్‌తో రూపాయి మారకం రేటు త్వరలోనే రూ.70 కి చేరే అవకాశం ఉందని ఐఎ్‌ఫఎ గ్లోబల్‌ అనే అడ్వైజరీ సంస్థ పేర్కొంది. ఈ అంచనాలు మార్కెట్లో రూపాయిని దెబ్బ తీస్తున్నాయి.
 
వాణిజ్య యుద్ధ భయాలు
అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న వార్తలు కూడా రూపాయిని భయపెడతున్నాయి. ఇటీవల జరిగిన చర్చలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగినట్టు అందరు భావించారు. అధ్యక్షుడు ట్రంప్‌ ఈ చర్చల ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం తప్పదని భావిస్తున్నారు.
 
వడ్డీ రేట్ల భయం
అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందోన్న అంచనాలూ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయిని దెబ్బతీశాయి.
 
స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు
స్టాక్‌ మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు డాలర్‌తో రూపాయి మారకం రేటును దెబ్బ తీశాయి. దీనికి తోడు ఎఫ్‌పిఐల అమ్మకాలు కూడా ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
 పెట్రో మంట
భారత చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులే. రూపాయు పతనంతో చమురు దిగుమతులకు అవసరమైన డాలర్ల కోసం మరిన్ని రూపాయిలు ఖర్చు చేయాలి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వాటి ఆధారంగా తయారయ్యే ఉత్పత్తుల ధర మరింత పోటెత్తనుంది.
 
దిగుమతులు మరింత ప్రియం
రూపాయి పతనంతో దేశీయ మార్కెట్లో మొబైల్స్‌తో సహా అనేక దిగుమతి వస్తువుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. రూపాయి సెగతో గృహోపకరణా లు, కొన్ని ఎలకా్ట్రనిక్‌ వస్తువుల ధరలు పెంచుతున్నట్టు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. దిగుమతి వస్తువులు ఎక్కువగా ఉండే మిగతా రంగాల కంపెనీలూ ఇదే బాట పట్టే అవకాశం ఉంది.
 
స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం
స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికే తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయనే అంచనాతో ఎఫ్‌పిఐలు రోజు రోజుకీ అమ్మకాలు పెంచుతున్నాయి. రూపాయి పతనంతో ఎఫ్‌పిఐలు అమ్మకాల హోరు మరింత పెంచితే స్టాక్‌ మార్కెట్లు మరింత పతనమయ్యే ప్రమాదం ఉంది.