భారత్‌‌కు వచ్చేస్తున్నారా..? వీటిని మర్చిపోవద్దు

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లి, అక్కడే స్థిరపడిన ఎన్నారైలు కొన్నాళ్ల తర్వాత సొంతదేశానికి రావాలనుకోవడం సహజమే. భారత్‌లోనే స్థిరపడటానికి ప్లాన్ చేసుకుని అన్నీ సర్దుకుని వచ్చేసినా కొన్ని రకాల సమస్యలు వారిని వెంటాడుతుంటాయి. లగేజీని తెచ్చేసి, ఇంటిని వేరొకరికి అమ్మితే సరిపోతుందనుకుంటే పొరపాటే. ఫోన్ బిల్లు నుంచి పేపర్ బిల్లు వరకూ, బ్యాంకు ఖాతా నుంచి చేస్తున్న ఉద్యోగం వరకూ ప్రతీ దాంట్లోనూ సమస్యలు వస్తుంటాయి. అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగానే వాటిని క్లియర్ చేసుకోవాలి. 
 
మీరు ఉపయోగించే సదుపాయాలను ముందుగానే రద్దు చేసుకోవాలి. విద్యుత్తు, గ్యాస్, ఆయిల్, మంచినీరు, టెలిఫోన్ (మొబైల్ సహా) కనెక్షన్లను ముందుగానే రద్దు చేసుకోవాలి. 
- క్లబ్బులు, సంఘాలు, కోర్సులు, వార్తా పత్రికలు మొదలైనవాటిలో సభ్యత్వం ఉంటే వాటిని కూడా ముందుగానే రద్దు చేసుకోవాలి.
- బ్యాంకు ఖాతాలను మీరు ఉపయోగించాలని అనుకోకపోతే వాటిని కూడా ముగించాలి.
- మీరు విదేశాలకు వెళ్తున్నట్లు పన్ను అధికారులకు కూడా సమాచారం అందజేయాలి. 
- మీ కొత్త చిరునామాను మీ స్నేహితులకు, కుటుంబీకులకు, వ్యాపార సహచరులకు తెలియజేయాలి.
- పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ మెయిల్‌ను రీడైరెక్ట్ చేయాలి.
- బిల్లులు, రుణాలు చెల్లించవలసి ఉంటే దేశం విడిచి వెళ్ళే ముందే చెల్లించాలి. మిత్రుల నుంచి అప్పులు తీసుకుని ఉంటే తీర్చేయాలి.