ఎన్నారైలూ.. మీ పిల్లలను భారత్‌లో చదివించాలనుకుంటున్నారా?

కొంతమంది ఎన్నారైలు తమ పిల్లలను భారత్‌లోని తమ తల్లిదండ్రుల వద్ద ఉంచి చదివించాలనుకుంటారు. లేదా భారత్‌లోని కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువు చెప్పించాలనుకుంటారు. చాలా సంవత్సరాల క్రితమే భారత్‌ నుంచి వెళ్లిపోయి అక్కడ సెటిలైన ఓసీఐ, పీఐఓ కార్డు హోల్డర్లు తమ పిల్లలను భారత్‌లో చదివించాలనుకుంటే మాత్రం ఇక్కడి ఫీజలు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే విద్యారంగంలోకి కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశించి దానిని వ్యాపారంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లలో స్కూలు ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎల్‌కేజీకే లక్షల్లో ఫీజు కట్టాల్సిన పరిస్థితి. అలాంటిది ఎన్నారైలకు అయితే ఈ ఫీజు మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పేరేంట్స్‌ కనుక విదేశాల్లో ఉండి వారి పిల్లలను భారత్‌లో చదివించాలనుకుంటే వారు ఎక్స్‌ట్రా ఫీజు కట్టాల్సిందే. దీనిని ఎన్నారై ఫీజు అంటారు. 

కొంతమంది పేరెంట్స్‌ తమ పిల్లలకు ఇండియన్‌ సిటిజన్‌షిప్‌ కోసం అప్లయ్‌ చేసి.. ఇక తాము ఎక్స్‌ట్రా ఫీజు కట్టనవసరం లేదని భావిస్తారు. అయితే ఈ విషయంలో పూర్తిగా క్లారిటీ లేదు. ఎందుకంటే కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఫీజలు తీసుకుంటాయి. మరికొన్ని మాత్రం ఎన్నారై ఫీజుకు మినహాయింపు ఇస్తాయి. అలాగే భారత్‌లో సెటిలైన ఓసీఐ కార్డు హోల్డర్ల వద్ద కూడా కొన్ని విద్యా సంస్థలు ఎన్నారై ఫీజు వసూలు చేస్తాయి. నిజానికి భారత్‌లో సెటిలైనా.. వారికి ఇండియన్‌ సిటిజన్‌షిప్‌ లేకపోతే వారు విదేశీయుల కిందే లెక్క. అయితే ప్రభుత్వం ఇటీవలె ఎన్నారైలకు భారత విద్యాసంస్థల్లో పదిహేను శాతం రిజర్వేషన్‌ ప్రకటించింది. ఆ కోటాలో సీట్లు సంపాదించిన వారు మాత్రం ఎన్నారై ఫీజు కట్టనవసరం లేదు.