ఎన్నారైలు విదేశాల నుంచి డబ్బులు ఎలా పంపుతారో తెలుసా?

విదేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి డబ్బును ఎలా పంపిస్తారు? అక్కడి నుంచి ఇక్కడి బ్యాంకు అకౌంట్‌కు నేరుగా డబ్బును పంపించవచ్చా? ఒకవేళ డాలర్లు లేదా ఇతర దేశ కరెన్సీని పంపిస్తే అవి రూపాయలుగా ఎలా మారతాయి? ఇలాంటి సందేహాలు మనలో చాలా మందికి అనేక సార్లు వచ్చే ఉంటాయి. విదేశాల్లో ఎంతో కాలంగా స్థిరపడిన ఎన్నారైలకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే ఉండచ్చు. కానీ, ఇప్పుడిప్పుడే విదేశాలు వెళ్లిన లేదా వెళ్తున్నా.. భవిష్యత్తులో వెళ్దామని అనుకుంటున్న వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. అసలు విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు భారత్‌కు డబ్బును ఎలా పంపుతారో తెలుసుకుందాం రండి. 

భారత్ నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఆయా దేశాల కరెన్సీనే జీతం రూపంలోనో లేదా ఇతర రూపంలోనో సంపాదిస్తూ ఉంటారు. అలా సంపాదించిన డబ్బును భారత్‌లో ఉన్నవారికి లేదా భారతదేశ బ్యాంకు ఖాతాకు పంపించాలంటే.. ఎన్నారైలు ముందుగా ఇక్కడ ఎన్‌ఆర్‌ఈ(నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్) లేదా ఎన్‌ఆర్‌ఓ(నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఈ అకౌంట్ తీసుకున్న ఎన్నారైలు.. విదేశీ అకౌంట్ నుంచి నేరుగా ఈ అకౌంట్‌లోకి డబ్బును పంపించవచ్చు. పైగా ఏ దేశ కరెన్సీని అయినా ఈ అకౌంట్‌కు పంపించుకునే సౌలభ్యం ఉంటుంది. భారతదేశంలో మాత్రం భారత కరెన్సీని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా భారత్ నుంచి విదేశాలకు ఈ డబ్బును పంపించుకోవచ్చు. ఇద్దరు ఎన్నారైలు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తీసుకునే సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.

ఎన్‌ఆర్ఓ ఖాతా ఏంటి? ఎన్‌ఆర్ఈ ఖాతాకు, ఎన్‌ఆర్ఓ ఖాతాకు తేడా ఏంటి?

భారత చట్టం ప్రకారం భారతదేశానికి చెందిన వారు ఆర్థిక సంవత్సరంలో 182 రోజుల కంటే ఎక్కువ విదేశాల్లో ఉంటే వారిని ఎన్నారైలుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కసారి ఎన్నారై స్టేటస్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న బ్యాంకు ఖాతాలను ఎన్ఆర్ఓ(నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) ఖాతా కింద మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకోకుండా భారతదేశంలో నివసిస్తున్న వారి మాదిరిగా సేవింగ్స్, ఇతర ఖాతాలను వాడితే ప్రభుత్వానికి పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. పైగా ఎన్ఆర్ఓ ఖాతాకు మారకపోవడం భారత చట్టం ప్రకారం నేరం.
 
 విదేశాలలో సంపాదించిన డబ్బును భారతదేశానికి పంపించడానికి ఎన్‌ఆర్ఈ ఖాతా ముఖ్యంగా పనిచేస్తుంది. ఈ ఖాతాలో కేవలం విదేశీ కరెన్సీని మాత్రమే పంపించే అవకాశం ఉంటుంది. మరి ఎన్నారైలకు భారత్‌లో కూడా ఆదాయం వస్తే ఏంటి పరిస్థితి? భారత్‌లో వస్తున్న ఆదాయాన్ని, విదేశాల్లో వస్తున్న ఆదాయాన్ని ఒకే ఖాతాలో వేసుకోవడానికి ఎన్‌ఆర్‌ఓ ఖాతా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ ఖాతాను ఎన్నారైతో పాటు భారత్‌లో ఉన్న వారు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీనికిగాను ఎన్నారై, భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి కలిసి జాయింట్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్ఈ జాయింట్ ఖాతాను మాత్రం కేవలం ఇద్దరు ఎన్నారైలు మాత్రమే తీసుకోగలరు. ఈ ఖాతాను భారత్‌లో ఉన్న వారు వాడుకునే అవకాశం ఉండదు.   
 
ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ ఖాతాలకు పంపించే డబ్బుకు వడ్డీ వస్తుందా? వస్తే ట్యాక్స్ ఏమైనా కట్టాలా?
చాలా మంది ఎన్నారైలకు ఇదే సందేహం కలుగుతుంది. తాము విదేశాల నుంచి డబ్బును పంపిస్తున్నాం కాబట్టి భారత ప్రభుత్వానికి ఏమైనా ట్యాక్స్ కట్టాలా అని సందేహిస్తూ ఉంటారు. ఎన్ఆర్ఈ ఖాతాలో వేస్తున్న డబ్బుకు, దానిపై లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఎన్‌ఆర్‌ఓ ఖాతా కలిగి ఉన్నట్టయితే.. ఆ ఖాతాలో ఉన్న డబ్బుపై వస్తున్న వడ్డీకి భారత ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఈ ఖాతాలో ఉన్న డబ్బును, దానిపై వచ్చే వడ్డీని పరిమితి లేకుండా విదేశాలకు పంపించుకోవచ్చు. అదే ఎన్‌ఆర్ఓ ఖాతాకు వచ్చేసరికి బ్యాంకులు పరిమితులను విధిస్తాయి. ఎన్‌ఆర్‌ఓ ఖాతాలో వస్తున్న వడ్డీని మాత్రమే పరిమితి లేకుండా పంపించుకునే అవకాశం ఉంటుంది.  
 
విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చేస్తే ఎన్ఆర్ఈ ఖాతాను ఏం చేయాలి?
విదేశాల నుంచి పర్మనెంట్‌గా భారత్‌కు తిరిగి వచ్చేసే వారు ఖాతా కలిగి ఉన్న బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్‌గా ఉన్న ఖాతాను రెసిడెంట్ ఖాతాగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఈ ఖాతాను రెసిడెంట్‌ ఖాతాగా మార్చిన తర్వాత.. ఖాతాలో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీకి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 
 
విదేశాల నుంచి ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాలను ఓపెన్ చేయవచ్చా?
భారతీయులకు విదేశాలు వెళ్లిన తర్వాతే ఈ రెండు ఖాతాలను తెరిచే అవసరం వస్తుంది. మరి విదేశాల్లో ఉండగా.. భారతదేశంలో ఈ ఖాతాలను ఎలా ఓపెన్ చేయాలి? బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి ఎన్నారైలు అక్కడి నుంచి భారత్‌కు రావాలా? ఎటువంటి అవసరం లేదు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారానే ఈ ఖాతాలను ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అంటే... విదేశాల్లో ఉంటూనే అక్కడి నుంచి భారత్‌లో ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ ఖాతా తెరవచ్చు అన్నమాట.