ఐటీ కోర్సులకు తగ్గుతున్న డిమాండు

ప్రత్యామ్నాయ కోర్సులపై దృష్టి

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): డాలర్స్‌ డ్రీమ్‌ చెదురుతోంది. అమీర్‌పేటలో ఏదో ఒక ఐటీ కోర్సు చేస్తే చాలు... అమెరికాలో ఐటీ ఉద్యోగం సొంతమవుతుందనే ఆశ దూరమవుతోంది. సుమారు రెండు దశాబ్దాలుగా ఐటీ కోర్సులకు అమీర్‌పేట కేరాఫ్‌ గా నిలిచింది. ఇప్పుడు అలాంటి అమీర్‌పేటలో ఐటీ కోర్సుల్లో  కోచింగ్‌ తీసుకునే వారిపై అమెరికా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
 
ఇంజనీరింగ్‌ అయిపోగానే ఎక్కువమంది వాలిపోయేది అమీర్‌పేటలోనే. కేవలం రెండు తెలుగు రాషా్ట్రలకు చెందిన విద్యార్థులే కాకుండా దేశంలోని ఇతర రాషా్ట్రలకు చెందిన వారు వేలల్లో ఉన్నారు. దీంతో అమీర్‌పేట ప్రాంతం ఐటీ శిక్షణా సంస్థలకు, వారికి నీడనిచ్చే హస్టల్స్‌కు ప్రధాన కేంద్రంగా మారింది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఆచీతూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా నిత్యం ఐటీ కోర్సులు నేర్చుకునేందుకు వచ్చే విద్యార్థులతో కిట కిటలాడే శిక్షణా సంస్థల్లో ఇప్పుడా ఆ సందడి తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాల్లో అత్యున్నత స్థాయి నిపుణులకే ఐటీ ఉద్యోగాలు అన్న మాట ఇక్కడి  కోచింగ్‌ సెంటర్లపై ప్రభావం చూపుతోంది. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు... ఏదో ఒక ఐటీ కోర్సు చేసి ఉద్యోగం సంపాదించొచ్చు అనే ఆలోచనతో ఉన్న వారంతా వెనకడుగు వేస్తున్నారు.  కేవలం ఐటీలో డిగ్రీలు, పీజీలు చేసిన వారు మాత్రమే కోచింగ్‌ తీసుకునేందుకు వస్తున్నారు. దీంతో రద్దీ కొంత వరకు తగ్గిందని అనే అభిప్రాయాన్ని శిక్షణా సంస్థ నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికీ ఇదే పరిస్థితి ఉండదని ఐటీ పరిజ్ఞానం ఉన్న వారికి అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ, మన దేశంలోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఐటీ శిక్షణా సంస్థలు పేర్కొంటున్నాయి.  ఐటీ కోర్సులు నేర్చుకొని ఏళ్ల తరబడి ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూసే కన్నా త్వరగా ఉద్యోగం వచ్చే కోర్సులను ఎంచుకోవడం ఉత్తమమని కొందరు భావిస్తున్నారు.
 
ఇరు వర్గాల్లో పెరుగుతున్న ఆందోళన....

అమెరికాలో ఐటీ ఉద్యోగావకాశాలు తగ్గిపోనుండడంతో అటు విద్యార్థులు ఇటు శిక్షణా సంస్థల్లో ఆందోళన నెలకొంది. అమెరికా లక్ష్యంగా అమీర్‌పేటలో వెలిసిన కోచింగ్‌ సెంటర్లపైనా  ట్రంప్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జావా, డాట్‌ నెట్‌, ఒరాకిల్‌, టెస్టింగ్‌ టూల్స్‌, శాప్‌ వంటి కోర్సుల్లో మంచి  ఫ్యాకల్టీ ఉన్న శిక్షణా సంస్థల్లో  వందలాది మంది కోచింగ్‌ తీసుకునేందుకు వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య పదులకు పడిపోయింది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే  కోచింగ్‌ సెంటర్లను నిర్వహించడం చాలా  భారమవుతుందని ఓ శిక్షణా సంస్థ నిర్వాహకుడు తెలిపారు. ఫ్యాకల్టీ ఫీజు, ఆఫీసుల అద్దెలు చెల్లించి తక్కువ మంది విద్యార్థులతో కోచింగ్‌ సెంటర్‌ నిర్వహించలేని పరిస్థితి ఉందని అభిప్రాయం శిక్షణా సంస్థల నుంచి వ్యక్తమవుతోంది.

అమెరికాకు వెళ్లాల్సిన వారంతా ఇక్కడే ప్రయత్నాలు మొదలు పెడితే... ఇక్కడే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారు తుందనే మాట వినిపిస్తోంది. ఐటీ కోర్సులు నేర్చుకొని సమయాన్ని వృథా చేసుకునే కన్నా ఇతర రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో కేవలం ఐటీ కోర్సులకు మాత్రమే శిక్షణనిచ్చే కన్నా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులను ఎంచుకొని వాటిల్లో శిక్షణనివ్వడం మేలనే ఆలోచనలో  కొన్ని సంస్థలు ఉన్నాయి.
కోచింగ్‌ సెంటర్లపై ప్రభావం ఉంటుంది
కంప్యూటర్‌ డిగ్రీలు చదివిన చాలా మంది ఉద్యోగం కోసం అమెరికానే వెళ్లాలనుకుంటారు. ఆ తర్వాతే ఇతర దేశాలకు ప్రాధాన్యం ఇస్తారు. అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలు పాటిస్తున్న సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా ఆస్ర్టేలియా, యూకే వంటి దేశాలు సైతం ఐటీ ఉద్యోగాల్లో స్థానికులకే మొదటి అవకాశం ఇస్తున్నాయన్న సమాచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ కోర్సులు చేసిన వారు ఇతర దేశాలు వెళ్లాలంటే అంత సులభం కాదు. అత్యున్నత స్థాయిలో నైపుణ్యం ఉంటే తప్ప అక్కడ ఉద్యోగానికి ఎంపికయ్యే పరిస్థితి లేదు.  దీంతో ఐటీ కోర్సుల్లో శిక్షణ తీసుకునే వారి సంఖ్య బాగే తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కంప్యూటర్‌ డిగ్రీలు చేసిన వారే లక్షల్లో ఉన్నారు.  వారంతా ఇండియాలోనే ఉద్యోగావకాశాలను వెతుక్కుంటారు. ఆ సమయంలో ఇక్కడే పోటీ పెరిగి ఐటీ రంగంలో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతోంది ఈ నేపథ్యంలో అమీర్‌పేట ఏదో ఒక కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుందామని వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది.
-టి.ఆర్‌.శ్రీనివాస్‌, ఫ్యాకల్టీ

ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తా
ఐటీ ఉద్యోగం కోసం కాకుండా ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తా. అప్పటి వరకు పరిస్థితులు మారడంతో పాటు  ఉన్నత చదువులు పూర్తవుతాయి. దీంతో అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది.  నా ఆలోచన మాదిరిగానే అమీర్‌పేటలోని ఐటీ కోర్సుల కోచింగ్‌కు వచ్చే వారి ఆలోచన ఉంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఉన్నత చదువులు ఉండి, అత్యుత్తమ నైపుణ్యం ఉన్న వారికే అవకాశాలు అనే మాట చెప్పడంతో చాలా మంది బీ.టెక్‌,బీఈ తర్వాత ఎం.టెక్‌, ఎంఈ, పీహెచ్‌డ్‌లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో  ఐటీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది.  పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు, మంచి నైపుణ్యం కీలకంగా మారాయి.
-రవికిరణ్‌, పీజీ విద్యార్థి