నిరసనల నడుమ డేవిస్‌లో మహాత్మా గాంధీ

కాలిఫోర్నియా: మహాత్మా గాంధీ  విగ్రహంను కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో శివారు నగరం డేవిస్‌లో గాంధీ 147 పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2, 2016 న ఉదయం పది గంటలకు ఆవిష్కరించారు. డేవిస్ నగరంలో ఉన్న సెంట్రల్ పార్క్‌లో మహాత్మా గాంధీ  విగ్రహం ప్రతిష్టాపనకు ఆమోదం గతంలో ఉన్నప్పటికీ జరిగింది కొద్ది నెలల క్రితం శాక్రమెంటో శివారు నగరం ఎల్క్ గ్రోవ్ కు చెందిన భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అమర్ షెర్గిల్ నాయకత్వంలో ఒక బృందం విగ్రహం ప్రతిష్టాపనకు వ్యతిరేకించింది. గాంధీకి లైంగిక దుష్ప్రవర్తన  చరిత్ర ఉందని, ఆయన సొంత కుటుంబం సభ్యుల పట్ల ఆయన శత్రువుగా వ్యవహరించారని, కుల వ్యవస్థ ను ఆయన ప్రోత్సహించారని, సిక్కు ముస్లిం దళితులకు ఆయన చేసింది ఏమీ లేదని, పైగా  ఆయన ఒక  జాత్యహంకారి అని  షెర్గిల్ ఆరోపించారు. షెర్గిల్ నాయకత్వం లో నిరసనకారులు అక్టోబర్ 2 న డేవిస్ సెంట్రల్ పార్క్ వద్ద గాంధీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంకు పదేపదే అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారు. 

 అయితే షెర్గిల్ ఆరోపణలను మహాత్మా గాంధీ విగ్రహం ప్రతిష్ఠాపన కమిటీ సభ్యులు తిప్పికొట్టారు. "గాంధీ  ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ప్రేరణ, ఆయన ఒక అగ్ని,  స్వేచ్ఛ కోసం అహింస మార్గాలను ప్రపంచానికి పరిచయం చేశారు" అని విగ్రహం కమిటీ సభ్యురాలు, మరియు కాలిఫోర్నియా రాష్ట్ర విశ్వవిద్యాలయం లా విభాగం ప్రొఫెసర్ మాధవి  సుందర్ చెప్పారు. డేవిస్  నగరానికి ఎటువంటి ఆర్ధిక భారం లేకుండా ప్రవేటు నిధులతో ఈ విగ్రహం భారత్ నుండి తెప్పించామని వారు చెప్పారు. "శాంతి, అహింస పట్ల మహాత్మా గాంధీ  చేసిన బోధనలు అమెరికాకు ఆదర్శనీయమని" గాంధీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంకు హాజరయిన సెనేటర్ లోయిస్ వల్క్ (డెమొక్రాట్-డేవిస్) చెప్పారు. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రజలు బ్రిటన్ నుంచి భారత్ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. స్థానిక డాక్టర్ భావిన్ పరేఖ్  "గాంధీ  ఒక తత్వవేత్త, మానవతావాది, ఒక గొప్ప నాయకుడు, మొత్తం ప్రపంచానికే శాంతి రాయబారి" అని వ్యాఖ్యానించారు

 భారతదేశం వెళ్లి 401 కిలోల, 6 అడుగుల 3 అంగుళాల  గాంధీ విగ్రహంను తీసుకువచ్చిన  డేవిస్ నివాసి శ్యామ్ గోయల్, విగ్రహం ప్రతిష్టాపన వ్యతిరేకించే గ్రూపు వాదనలను "కల్పితం" గా కొట్టిపారేశారు. స్వేచ్ఛ కోసం అహింసాత్మక పోరాటాన్ని చేసిన మహాత్మా గాంధీ ఘనతను స్వయానా నెల్సన్ మండేలా కొనియాడారని గోయల్ చెప్పారు. మేయర్ డేవిస్ మాట్లాడుతూ హిందూ మత సూత్రాల ను అనుసరించి గాంధీ బోధనలు ఉండి ఉండవచ్చునని, అయితే నల్ల జాతి నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ కూడా మత సూత్రాల ను అనుసరించి ఉన్నాయని ఆయన విగ్రహాలు దేశవ్యాప్తం గా ఉన్నాయని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన  భారత కాన్సుల్ జనరల్ వెంకటేశన్ అశోక్,  మహాత్మా గాంధీపై వ్యతిరేకంగా ఆరోపణలుపై  స్పందించడానికి నిరాకరించారు. "మహాత్మా గాంధీ ఆధునిక భారతదేశంకి తండ్రి వంటి వారు అని, ఆయన శాంతి బోధకుడు" అని కొనియాడారు. "శాపంగా పరిణమించిన తీవ్రవాదంను  ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సమయంలో గాంధీ శాంతి, అహింస సందేశాలు కీలకం కానున్నాయని" ఆయన చెప్పారు.

 ఇంతకు మునుపు డేవిస్‌లో మహాత్మా గాంధీ  విగ్రహం ప్రతిష్టాపన పై షెర్గిల్ బృందం అభ్యంతరాలపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఆగష్టు 30 డేవిస్ సిటీ కౌన్సిల్ సమావేశం కాస్తా మూడు గంటల ట్రిబ్యునల్ గా మారిపోయింది. మహాత్మా గాంధీ  విగ్రహం ప్రతిష్టాపనకు అనుకూల, ప్రతికూల వాదనలతో ఆనాటి డేవిస్ సిటీ కౌన్సిల్ సమావేశం వేడిక్కిపోయింది. డేవిస్‌లో గాంధీ  విగ్రహం ప్రతిష్టాపన వ్యతిరేకించే గ్రూపులో ఉన్న పలువురికి అసలు డేవిస్ నగరంతో సంబంధం లేదన్న వాదనతో అనుకూల గ్రూపు చెలరేగిపోయింది. పిదప, ప్రతికూల గ్రూపును శాంతిపరచి ఏకాభిప్రాయం వచ్చే వరకు గాంధీ  విగ్రహం ప్రతిష్టాపన వాయిదా వేయాలన్న మేయర్ డేవిస్, మరియు వైస్ మేయర్ బ్రెట్ లీ ప్రతిపాదనను 3-2 ఓటు తో త్రోసిపుచ్చి డేవిస్ సిటీ కౌన్సిల్ అక్టోబర్ 2, 2016 న డేవిస్‌లో మహాత్మా గాంధీ  విగ్రహం ప్రతిష్టాపన కు అదేరోజు ఆగస్టు 30 న పచ్చజెండా ఊపింది.  మహాత్మా గాంధీ  విగ్రహం ప్రతిష్టాపన పై గత రెండు నెలలకు పైగా అనుకూల వ్యతిరేక గ్రూపుల మధ్య సాగుతున్న పోరాటాన్ని పలు స్థానిక దిన పత్రికలు, టీవీ చానళ్ళు ప్రాచుర్యం కల్పించాయి. గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, సీజర్ చావెజ్ గురించి పలువురు గ్రేటర్ శాక్రమెంటో వాసులు చర్చించుకోవడం కనిపించింది.  గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తి తో కాలిఫోర్నియాలో వ్యవసాయ కూలీలకు కనీస వసతులు కల్పించాలనే డిమాండ్‌తో 1968 లో ఏకంగా 25 రోజులు నిరాహార దీక్ష చేసి కాలిఫోర్నియా అసెంబ్లీ మెడలు వంచిన సీజర్ చావెజ్ విగ్రహాలు డేవిస్ నగర పాఠశాలలో ఉన్నప్పుడు అదే డేవిస్ నగరంలో ఉన్న సెంట్రల్ పార్క్‌లో గాంధీ విగ్రహం ఉంటే తప్పు ఏమిటని పలువురు అమెరికా పౌరులు వ్యాఖ్యానించడం కొసమెరుపు.
 
వ్యాసకర్త: నాగం వెంకటేశ్వరరావు (కాలిఫోర్నియా నుంచి)