వయ్యారి భామలు.. విదేశీ భర్తలు

ఫారినర్స్‌పై మన కథానాయికల మోజు

వెండితెరపై వెలుగుజిలుగుల భామలు.. కెరీర్‌ కాస్త డౌన్‌ అయ్యాక జీవితంలో స్థిరపడడం సహజం. గతంలో అయితే ఇక్కడే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకునేవారు. కానీ ఇటీవలికాలంలో విదేశీయులను పెళ్లి చేసుకునే వారి.. డేటింగ్‌ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తాజా ఉదాహరణ.. ప్రియాంక చోప్రా. ఆమెకు అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌కు మధ్య ‘ఏదో’ ఉందని మీడియా కోడై కూస్తోంది. నిక్‌ జోనాస్‌ కూడా ప్రియాంక పట్ల తన ప్రేమను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని ఫంక్షన్లకు, డిన్నర్లకు వెళ్తున్నారు. ఆమె జోనాస్‌ను పెళ్లి చేసుకుంటుందో లేదో తెలియదుగానీ మనదేశంలో ఇలా చాలామంది సెలబ్రిటీలు విదేశీయులను వివాహం చేసుకున్నారు. మరికొందరు డేటింగ్‌లో ఉంటే.. ఇంకొందరు లివిన్‌ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. ఆ లిస్టు చూస్తే..
 
శ్రుతిహాసన్‌ మైకేల్‌ కోర్సలే
ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న ఒక ప్రఖ్యాత కేఫ్‌లో.. చెన్నైలో తమిళనటుడి పెళ్లిలో.. ఇలా చాలా చోట్ల తన బోయ్‌ఫ్రెండ్‌ మేకేల్‌ కోర్సలేతో కలిసి కనపడుతోంది శ్రుతి హాసన్‌. లండన్‌కు చెందిన మైకేల్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారో లేదో.. పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదుగానీ, ప్రస్తుతానికైతే ఈ జంట వ్యవహారం తమిళనాట హాట్‌ టాపిక్‌.
 
ప్రీతీజింటా జీన్‌ గుడ్‌ఇనఫ్‌
‘నాలో ఉన్న ప్రేమ.. నీతో చెప్పనా’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా అమెరికాకు చెందిన జీన్‌ గుడ్‌ఇనఫ్‌ను 2016లో పెళ్లి చేసుకుంది. అమెరికాలో ఉన్న తన బంధువులను కలవడానికి వెళ్లినప్పుడు ప్రీతీకి జీన్‌తో పరిచయమైంది. కొన్నాళ్ల ప్రేమ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
 
శ్రియ అంద్రేయ్‌ కొశ్చేవ్‌
‘ఇష్టం’గా తెలుగు తెరపై అడుగుపెట్టి ‘నేనున్నాను’ అంటూ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న శ్రియ సరణ్‌ కాస్తా.. ఇటీవలే తన రష్యన్‌ ప్రియుడు అంద్రేయ్‌ కొశ్చేవ్‌ను పెళ్లాడి శ్రియ కొశ్చేవ్‌ అయిపోయింది. ఈ ఏడాదే మార్చి 19న వీరి వివాహం ఉదయ్‌ఫూర్‌లో జరిగింది.
 
ఇలియానా ఆండ్రూ నీబోన్‌
సన్నాయిలాంటి సన్నని నున్నని నడుముతో యువకుల గుండెలు కొల్లగొట్టిన ఇలియానా 2014 నుంచి ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో లివిన్‌ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని ప్రపంచమంతా చక్కర్లు కొడుతున్నారు. గత ఏడాదే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పెట్టి.. ‘మై హబ్బీ’ అని రాసింది ఇలియానా.
 
రాధికా ఆప్టే బెనెడిక్ట్‌ టేలర్‌
లెజెండ్‌ సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన రాధికా ఆప్టే భర్త కూడా విదేశీయుడే. చాలా మందికి తెలియని విషయమేంటంటే.. 2012లోనే ఆమెకు వివాహమైంది. ప్రముఖ సంగీత కళాకారుడు బెనెడిక్ట్‌ టేలర్‌ ఆమె భర్త. లండన్‌లో సరికొత్త నృత్య రీతులను నేర్చుకోవడానికి వెళ్లినప్పుడు బెనెడిక్ట్‌ టేలర్‌తో ఆమెకు పరిచయమైంది. 2012 సెప్టెంబరులో వాళ్లు వివాహం చేసుకున్నారు. 2017లో వచ్చిన హిందీ సినిమా ‘న్యూటన్‌’కు సంగీతం అందించింది రాధిక భర్తే.
 
 క్రీడల్లోనూ...

సినిమా తారలే కాదు.. మన క్రీడాకారులూ ఇలా విదేశీయులతో జోడీ కట్టిన సందర్భాలున్నాయి. ఇందుకు ఉదాహరణ.. హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పాకిస్థానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ల వివాహం. అలాగే.. చదరంగం క్రీడాకారుడు పెంటేల హరికృష్ణకు సెర్బియా క్రీడాకారిణి నద్జాతో ఈ ఏడాదే మార్చిలో వివాహమైంది.