ఇంటి నుంచే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుతో 15 రోజుల్లో సర్టిఫికెట్‌ జారీ

ఒక్క క్లిక్‌తో ఇంటివద్దకే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు
తొలగనున్న ప్రజల ఇబ్బందులు 
సివిల్‌ రిజిస్ట్రేషన్‌ పాలసీని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
 
ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్‌ గుర్తింపు కార్డు ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు పొందాలన్నా.. ప్రతి ఒక్కరికీ జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది. అంతేకాకుండా ప్రైవేట్‌ రంగంలోనూ బర్త్‌ సర్టిఫికెట్‌ లేకుండా ఎలాంటి పని ముందుకు సాగదు. ఇలాంటి జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాలంటే అవస్థలు తప్పడం లేదు. ఓ వ్యక్తి మరణించిన తరువాత అతడికి సంబంధించిన ఆస్తులు, వారసత్వంపై లీగల్‌ ఆథారిటీ పొందాలంటే.. ఆ వ్యక్తి చనిపోయినట్లు ప్రభుత్వం జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకోసం ప్రజలు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదునుగా దళారులు జేబులు నింపుకుంటున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రం పొందలంటే రూ.3 వేల నుంచి రూ.6వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తూ.. కేంద్రం ప్రభుత్వం ‘సీఆర్‌ఎస్‌’ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా జనన, మరణ ధ్రువీకరణపత్రాలు ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు.. 15రోజుల్లో పత్రాలు అందజేస్తారు.
 
ఉచితంగా 
ప్రభుత్వం నుంచి అందించే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం సివిల్‌ రిజిస్ట్రేషన్‌ పాలసీని ప్రవేశపెట్టి పైసా ఖర్చు లేకుండా ఇంటివద్ద నుంచే జనన, మరణ ధ్రువీ కరణ పత్రాలను అందజేస్తుంది.

బర్త్‌ సర్టిఫికెట్‌ అవసరం ఏమిటి ?
జీవిత కాలంలో జనన ధ్రువీకరణ పత్రం చాలా అవసరం. సామాజిక భద్రత గుర్తింపుకోసం వయస్సు నిర్ధారణ, విద్య, ఉద్యోగం, ఉన్నత చదువు, మెజారిటీ నిరూపణ కోసం, వివాహ రిజిస్ట్రేషన్‌, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఓటర్‌గుర్తింపు కార్డు, ఇన్సూరెన్స్‌ పాలసీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌లకు అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. 
 
రిజిస్ట్రేషన్‌ ఇలా...
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సీఆర్‌ఎస్‌ విధానంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందవచ్చు. దీనికోసం ముం దుగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. http://crsorgi.gov.in  వైబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. అందులో జనన లేదా మరణ ధ్రువీకరణకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 15రోజుల వ్యవధిలో విచారణ ప్రక్రియ పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాన్ని రిజిస్ట్రేషన్‌ వివరాల్లో పొందుపరిచిన అడ్రస్‌, ఈ మెయిల్‌కు పంపిస్తారు. 15రోజుల్లో పత్రాలు అందక పోతే ఇదే వైబ్‌సైట్‌ ద్వారా ‘సర్టిఫికేషన్‌ డిలే’కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అప్రూవల్‌ అయితే సీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారానే సర్టిఫికెట్‌ను పొందే అవకాశం ఉంది.