ఫేస్‌‘బుక్‌’ అవుతోంది

బగ్స్‌ను గుర్తించలేకపోయిన యంత్రాంగం
తాజాగా ఐదు కోట్ల ఖాతాలు హ్యాక్‌
మరో 4 కోట్ల ఖాతాలపైనా ప్రభావం
ఖాతాదారుల వ్యక్తిగత వివరాల తస్కరణ, హ్యాకర్ల దాడులు వంటి ఘటనలతో ఫేస్‌బుక్‌ క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. గతంలో కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ 5 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల ఖాతాలను కొల్లగొట్టగా.. తాజాగా గుర్తుతెలియని హ్యాకర్లు ఓ థర్డ్‌పార్టీ యాప్‌, ఫేస్‌బుక్‌లోని ‘వ్యూ యాజ్‌’ అనే ఫీచర్‌లో ఉన్న బగ్‌ను ఆధారంగా చేసుకుని.. మరో 5 కోట్ల ఖాతాలను హ్యాక్‌ చేశారు. మరో 4 కోట్ల మంది యూజర్లకు ముప్పు పొంచి ఉందని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. ఫేస్‌బుక్‌ మొబైల్‌ యాప్‌లలో యూజర్లు నిత్యం లాగిన్‌ అయ్యి ఉండేందుకు దోహదపడే ‘డిజిటల్‌ కీ’, ‘యాక్సెస్‌ టోకెన్‌’ల సహకారంతో హ్యాకర్లు పలు ఖాతాలను కొల్లగొట్టారని స్పష్టం చేశారు.
 
కింకర్తవ్యం?
ఫేస్‌బుక్‌లోని వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవ్వకుండా ఉండాలంటే రెండే మార్గాలున్నాయని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఖాతాను వదులుకోవద్దనుకుంటే.. ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌ బ్లాగ్‌ని అనుసరిస్తూ.. సెక్యూరిటీ సూచనలు పాటించాలంటున్నారు. లేదంటే.. ఫేస్‌బుక్‌ ఖాతాకు గుడ్‌బై చెప్పడమే మార్గమని చెబుతున్నారు. తాజా హ్యాకింగ్‌కు సంబంధించి.. సదరు బగ్‌ను సరిచేశామని.. ఖాతాలు హ్యాక్‌ అయిన 5 కోట్ల మంది, హ్యాకింగ్‌ముప్పు పొంచి ఉన్న మరో 4 కోట్ల మందిని మొబైల్‌ యాప్‌లలో ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్‌ చేశామని ఫేస్‌బుక్‌ సంస్థ చెబుతోంది. కాగా, ‘వ్యూయాజ్‌’ అనే ఫీచర్‌లో ఏడాది కాలంగా బగ్స్‌ ఉన్నా గుర్తించకపోవడం హ్యాకర్ల పాలిట వరంగా మారినట్లు సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది ఫేస్‌బుక్‌ మొబైల్‌ యాప్‌ వాడుతున్నారని, వారంతా లాగ్‌అవుట్‌ అయ్యి.. తిరిగి లాగిన్‌ అవ్వడం మంచిదని భారత సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.