ఈ టిప్స్‌‌తో మీ యూనివర్శిటీని ఎంపిక చేసుకోండి

 యూఎస్‌లో వేల కొలది యూనివర్శిటీలు ఉన్నాయి. వేలాది యూనివర్శిటీల్లో సరియైన దాన్ని ఎంచుకోవడం చాలా కష్టం. అలా అని ఏదో ఒక యూనివర్శిటీలే అని నిర్ణయించుకుని చేరలేం.  అందుకని ఏ యూనివర్శిటీలో చేరుతున్నారో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. యూఎస్‌లో 4500కుపైగా యూనివర్శిటీలు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తున్నాయి. హార్వార్డ్, స్టాన్‌ఫోర్డ్, ఎమ్ఐటీ, కాల్‌టెక్ వంటి టాప్ యూనివర్శిటీల్లో చదువుకోవాలని చాలా మందికి ఉంటుంది. చాలా అవకాశాలు మీ ముందు ఉన్నప్పుడు అందులో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమే. కొన్ని సూచనలను పాటించడం వల్ల మీకు సరిపడే యూనివర్శిటీని సులభంగా మీరే ఎంచుకోవచ్చు..

1. ముందు మీ ఛాయిస్ ఏంటో గుర్తించండి
యూఎస్‌లో చదువుకోవడానికి వెళ్తున్నారంటే అక్కడి యూనివర్శిటీలపై కొంచమైనా అవగాహన ఉండి ఉంటుంది. ముందుగా మీరు ఏ యూనివర్శిటీలో చదువుకోవాలనుకుంటున్నారో, మీ ఇష్టాఇష్టాలేమిటో గుర్తించండి. ఫ్రెండ్స్ ఉన్నారనో, బంధువులన్నారనో ఏదో ఒక యూనివర్శిటీలో చేరితే అంతిమంగా నష్టపోయేది మీరే. మీ కోర్సును బట్టి మూడు నుంచి ఆరు సంవత్సరాల పాటు చదవబోయే యూనివర్శిటీ ఎంపికలో జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు ఎంచుకోబోయే యూనివర్శిటీపైనే మీ కెరీర్ ఆధారపడి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముందుగా మీకు ఇష్టమైన వాటిపైనే దృష్టి పెట్టండి. ఆ తర్వాతే మిగిలిన వాటిపై వర్కౌట్ చేయండి. మీరు ఎంచుకున్న యూనివర్శిటీతో మీ కెరీర్ బాగుంటుందని మీరు నమ్మితే నిర్భయంగా ముందుకెళ్లండి. 
 
2. యూనివర్శిటీ విద్యార్థుల సలహాలతో మేలే
 
ముందు మీరు ఎంచుకున్న కోర్సు ఉన్న యూనివర్శిటీలను గుర్తించండి. ఆ యూనివర్శిటీల ర్యాంకింగ్‌ను పరిశీలించండి. వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిని వేరు చేయండి. ఆయా యూనివర్శిటీల వెబ్‌సైట్‌ ద్వారా కోర్సు, ఫీజు తదితర విషయాలను తెలుసుకోండి. మీకు వీలుంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్‌ను కాంటాక్ట్ అవండి. వారి సలహాలను విని, మీకున్న ఆలోచనలను సరిచూసుకోండి. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఆయా యూనివర్శిటీల్లో చదువుతున్న విద్యార్థులను కాంటాక్ట్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రతీ యూనివర్శిటీ ఫేస్‌బుక్ పేజీ, ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి. వీటి ద్వారా యూనివర్శిటీల్లో ప్రస్తుత, పూర్వ విద్యార్థులను కాంటాక్ట్ అయితే చాలా విషయాలను తెలుసుకోవచ్చు. వారు మీకు సహాయం చేయవచ్చు. 
 
3. కోర్స్ వివరాలను ముందుగానే సరిచూసుకోండి
 
కోరుకున్న యూనివర్శిటీలో సీటు లభించి, నచ్చిన కోర్సులో చేరి, సబ్జెక్టు పూర్తి చేసినా కొందరికి సంతృప్తి ఉండదు. కారణం కోర్సులో ఉన్న కంటెంట్‌ను చూడకుండా చేరడమే. చాలా యూనివర్శిటీలు ఒకే కోర్సును అందిస్తున్నా, దానిలో ఉండే కంటెంట్ వేరుగా ఉంటుంది. కోర్సును ఎంచుకుని యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో, కోర్స్ కరిక్యులమ్‌ను సరిచూసుకోవడం కూడా అంతే ముఖ్యం.

4. మీ కెపాసిటీ ఎంతో గుర్తుంచుకోండి
యూఎస్‌లో చదువు అంటే డబ్బుతో కూడుకున్న పని. స్టూడెంట్ సపోర్ట్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం యూఎస్‌లో విదేశీయులు చదువుకోవడానికి స్టేట్ కాలేజ్ ట్యూషన్ ఫీజు 22,958 డాలర్లు, నాన్ ప్రోఫిట్ ప్రైవేటు కాలేజీల్లో 31,231 డాలర్ల ఖర్చవుతుంది. దీనికి ప్రయాణం, నివాసం, ఆహార వ్యవహారాల ఖర్చు అదనం, ఈ ఖర్చులను బట్టి మీరు ఎంత వరకూ ఖర్చు పెట్టగలరో నిర్ణయించుకోండి.  ఆర్థిక స్థోమతను బట్టి టాప్ యూనివర్శిటీల్లో చదువుకోలేకపోతున్నామని చాలా మంది బాధపడుతుంటారు. కానీ అలాంటి వారికి చాలా అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్, యూనివర్శిటీలు విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తుంటాయి. సరియైన ప్రాసెస్ ఫాలో అయితే స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ మీ కలను నిజం చేస్తాయి. 
 
5. వసతి సదుపాయంపై దృష్టి పెట్టండి
 
విద్యార్థులు బయట ఉండి చదువుకునే బదులు యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉండటానికే ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తారు. యూనివర్శిటీలో ఉంటే తోటి విద్యార్థులతో సబ్జెక్ట్ గురించి చర్చించవచ్చు. దీనితో పాటు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.  మీరు చేరబోయే యూనివర్శిటీలో వసతి సదుపాయం ఉందో లేదో చూసుకోవడం మంచిది. 
 
6. ఏ రాష్ట్రంలో చదవబోతున్నారో కూడా ముఖ్యమే
 
యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ యూనివర్శిటీ ఏ రాష్ట్రంలో ఉందో కూడా ముఖ్యమే. యూఎస్‌లో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విశిష్టత ఉంది. కొన్ని యూఎస్ సిటీలు విద్యార్థుల నగరాలుగా గుర్తింపు పొందాయి కూడా. ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకమైన సంస్కృతి, వాతావరణం ఉంటుంది. రాష్ట్రాల గురించి తెలుసుకుని యూనివర్శిటీనలు ఎంపిక చేసుకుంటే మంచిది.