షూటింగ్‌ అంటే జార్జియానే!

పాటనగానే ఫారిన్‌ లొకేషన్లు... ఫైట్స్‌ అనగానే ఇండోర్‌ లొకేషన్లు సర్వసాధారణం. కానీ ఇప్పుడు కీలక సన్నివేశాలకూ విదే శీ షూటింగ్‌లే. అటు హాలీవుడ్‌ నుంచి ఇటు టాలీవుడ్‌ వరకూ టాప్‌ డైరెక్టర్ల నంబర్‌ వన్‌ ఛాయిస్‌ జార్జియా. చిరంజీవి ‘సైరా’ బృందం కూడా అక్కడే షూటింగ్‌ జరుపుకుంది. ఇంతలా ఆకర్షిస్తోన్న ఆ దేశంలో ఏముంది? అక్కడే ఎందుకు?

జార్జియా.... తూర్పు యూరోప్‌లోని ఓ అందమైన దేశం. యూరోప్‌, ఆసియా ఖండాల మధ్య గేట్‌వేగా ఈ బుల్లి దేశానికి పేరు. ఐరోపా ఖండంలోని అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు ఇక్కడ కనువిందు చేస్తాయి. వేల ఎకరాల్లో ద్రాక్ష తోటలు ఊరిస్తుంటాయి. ఎంత లేదన్నా ఆరు వేల సంవత్సరాల నాడే ఇక్కడ వైన్‌ తయారయిందని చరిత్ర చెబుతోంది. రష్యాతో సరిహద్దు పంచుకోవడం వల్ల ఆనాటి సోవియట్‌ వాస్తు రీతుల భవనాలు ఆకట్టుకుంటాయి. మరో వైపు నల్లసముద్రం. ఈ సముద్ర అంచుల్లో ఎన్నో ప్రసిద్ధ రిసార్టులు. సినిమా ప్రియుల గడ్డ ఇది. మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఈ దేశం సొంతం. దీంతో పర్యటకుల ఫేవరెట్‌ డెస్టినేషన్‌గా మారింది. అయితే, గత అయిదేళ్లుగా ఈ దేశ ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది మాత్రం... విదేశీ ఫిల్మ్‌ మేకింగే.
 
కేరాఫ్‌ అడ్రస్‌..
అంతర్జాతీయ సినిమా విశ్లేషకుల గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మందిని ఆకర్షిస్తోన్న ఫిల్మింగ్‌ లొకేషన్‌ జార్జియా. హాలీవుడ్‌, ఇండియన్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇరానియన్‌ ఇలా అనేక దేశాల ప్రొడక్షన్‌ హౌజ్‌లు జార్జియా దేశంలో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. సినిమాలే కాదు నెట్‌ఫ్లిక్స్‌లాంటి టీవీ సిరిస్‌లను కూడా ఈ దేశంలోనే చిత్రించడం విశేషం. అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే ఈ సందడికి కారణం. వాటిలో కీలకమైంది ‘ఫిల్మ్‌ ఇన్‌ జార్జియా’. ఈ పథకం ద్వారా ఇంటర్నేషనల్‌ ప్రొడ్యూసర్లు జార్జియాలో ఖర్చుపెట్టిన దాంట్లో 20-25 శాతం రాయితీ పొందే అవకాశం ఇచ్చారు. అలాగే ఏ ప్రదేశంలో అయినా మినిమమ్‌ పేపర్‌ వర్క్‌తో షూటింగ్‌ పర్మిషన్లను సులభంగా పొందొచ్చు. బహిరంగ ప్రదేశాలలో ఉచితంగా షూటింగ్‌ జరుపుకునే అవకాశం ఇవ్వడం అదనపు సౌలభ్యం. అనేక వసతులతో స్టూడియోలనూ నిర్మించి, చక్కటి మౌలిక వసతులను అందిస్తోంది సర్కారు. నామమాత్రపు రుసుములతో వీటిని అద్దెకు ఇస్తున్నారు. దీని వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలూ పెరిగాయి. ఒక్కో సినిమాలో బడ్జెట్‌ను బట్టి ఎంత లేదన్నా సుమారు రెండు వందల మంది స్థానికుల అవసరం ఉంటుంది. వంట నుంచి సెక్యూరిటీ గార్డ్‌ వరకూ, డ్రైవర్‌ నుంచి నిర్మాణ కూలీ వరకూ అనేక ఉద్యోగాలు స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచాయి.
 
అన్నీ చుట్టుపక్కలే...
ఐరోపా దేశాలతో పోలిస్తే చవకైనది జార్జియా. సురక్షితమైనది కూడా. భౌగోళిక వైవిధ్యానికి పెట్టింది పేరు. మంచు దుప్పటి కప్పుకున్న పర్వత శ్రేణులు, సువిశాలమైన మైదానాలు, నల్లటి ఇసుక సముద్ర తీరాలు, సోవియట్‌ కాలం నాటి భవనాలు, ప్రాచీన శిఽథిలాలు... ఇలా వైవిధ్యమైన లొకేషన్స్‌ ఎన్నో. అన్నీ కూడా దగ్గరదగ్గరగా ఉండడం మరో విశేషం. అంటే, నిర్మాణ సంస్థకు రవాణా ఖర్చు, సమయమూ ఆదా అయినట్టే! అందుకే చిత్ర యూనిట్లు ఆ కొంగొత్త సీమలో వారాలకు వారాలు ఉండి ముఖ్యమైన సన్నివేశాల్ని షూట్‌ చేసుకుని వస్తున్నాయి. వరుణ్‌తేజ్‌ ‘కంచె’ అక్కడే చిత్రించారు. రామ్‌ ‘హైపర్‌’, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో యుద్ధ ఘట్టాలను అక్కడే తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణలో సుమారు నాలుగు వందల మంది జార్జియన్లు పాలు పంచుకున్నారట. రాజశేఖర్‌ ‘పిఎస్‌వీ గరుడ వేగ’నూ ఈ దేశంలోనే చిత్రించారు. తాజాగా, చిరంజీవి ‘సైరా’ కోసం ఆ చిత్ర యూనిట్‌ జార్జియాలో కీలకమైన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించుకుంది. శ్రీదేవి చిట్టచివరి చిత్రం ‘మామ్‌’ కూడా అక్కడే షూటింగ్‌ జరుపుకుంది. ఇక హాలీవుడ్‌ సినిమాల లిస్ట్‌ పెద్దదే. మొత్తంగా చెప్పాలంటే... వెండితెర బంగారుకొండ జార్జియా.