Bank-accounts-for-NRIs

ఎన్నారైలకు ఏ ఖాతాలు..

ఆంధ్రజ్యోతి, 14-04-2018:ప్రవాస భారతీయుడు కాగానే వారి బ్యాంక్‌ లావాదేవీలూ మారిపోతుంటాయి. అయితే వీరి కోసం ఎన్ని రకాల బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయో చాలా మంది ఎన్నారైలకు తెలియదు. ఈ ఖాతాల గురించి బ్యాంక్‌బజార్‌ సిఇఒ ఆదిల్‌ షెట్టి వివరిస్తున్నారు...

ప్రవాస భారతీయుడు కాగానే వారి బ్యాంక్‌ లావాదేవీలూ మారిపోతుంటాయి. అయితే వీరి కోసం ఎన్ని రకాల బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయో చాలా మంది ఎన్‌ఆర్‌ఐలకు తెలియదు. ఈ ఖాతాల గురించి బ్యాంక్‌బజార్‌ సిఇఒ ఆదిల్‌ షెట్టి వివరిస్తున్నారు... ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ) కోసం దేశీయ బ్యాంకులు పలు ఖాతాలు నిర్వహిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకుంటే ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో తమ నగదు వ్యవహారాలను తేలిగ్గా నిర్వహించుకోవచ్చు. ప్రతి ఎన్‌ఆర్‌ఐ తన అవసరాలు, పన్నుల చెల్లింపు బాధ్యత, నిధులను మళ్లీ వెనక్కి తీసుకెళ్లాల్సిన (రిపాట్రియేషన్‌) అవసరాలు, వడ్డీ రేటు ఆధారంగా తమకు ఏ ఖాతా అవసరం ఉంటుందో నిర్ణయించుకుని ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం దేశంలో బ్యాంకులు ఎన్‌ఆర్‌ఐలకు నాలుగు రకాల ఖాతాలు ఆఫర్‌ చేస్తున్నాయి. అవేంటంటే..
 
ఎన్‌ఆర్‌ఒ అకౌంట్‌
దీన్నే నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ అకౌంట్‌ (ఎన్‌ఆర్‌ఒ) ఖాతా అంటారు. ఖాతాదారుడు ఎన్‌ఆర్‌ఐగా మారుతుంటే వారు బ్యాంక్‌లోని తమ పొదుపు ఖాతాను తప్పనిసరిగా ఎన్‌ఆర్‌ఒ ఖాతాగా మార్చుకోవాలి.
కరెంట్‌ అకౌంట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలకూ ఇది వర్తిస్తుంది.
ఇది రుపీ ఆధారిత నాన్‌ రిపాట్రియబుల్‌ బ్యాంక్‌ ఖాతా. అంటే ఈ ఖాతాలో ఉండే నగదు బ్యాలెన్స్‌ను విదేశాలకు తరలించేందుకు అవకాశం ఉండదు.
దేశంలోని వివిధ ఆస్తుల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం, కమీషన్‌, అద్దె ఆదాయం, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లపై వచ్చే డివిడెండ్‌ ఆదాయం వంటివి ఎన్‌ఆర్‌ఒ ఖాతాలో డిపాజిట్‌ అవుతాయి.
ఈ ఖాతా నిల్వపై 3.5-4 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు.
ఎన్‌ఆర్‌ఒ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అయితే సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ  లభిస్తుంది.
ఈ ఖాతా ద్వారా ఆర్జించే వడ్డీ ఆదాయంపై 30 శాతం చొప్పున ఆదాయ పన్ను, సెస్సు, సర్‌చార్జీ చెల్లించాలి.
ఒకవేళ భారత్‌తో ద్వంద్వ పన్నుల చెల్లింపు నిరోధక ఒప్పందం (డిటిఎఎ) ఉన్న దేశంలో ఉంటున్నట్టయితే టాక్స్‌ రెసిడెన్సీ సర్టిఫికెట్‌ (టిఆర్‌సి), ఫారం 10ఎఫ్‌, పాన్‌ నంబర్‌ సమర్పించి ఈ పన్ను చెల్లింపు నుంచి తప్పించుకోవచ్చు.
 
ఎన్‌ఆర్‌ఇ ఖాతా
నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ అకౌంట్‌నే ఎన్‌ఆర్‌ఇ ఖాతా అంటారు. ఈ ఖాతాలోని నగదును అవసరమైనపుడు విదేశాలకూ తరలించుకుపోవచ్చు. చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ఈ ఖాతాను ఎంపిక చేసుకుంటుంటారు.
ఈ ఖాతా కూడా రుపీ డినామినేటెడ్‌ ఖాతా.
ఇతర దేశాల నుంచి ఎన్‌ఆర్‌ఐలకు అందే చెల్లింపులు, భారత్‌లోని రుణాలపై లభించే వడ్డీ, ఆస్తులపై అందే అద్దె, షేర్లు, మ్యూచవల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై అందే డివిడెండ్‌ ఆదాయాన్ని ఈ ఖాతాలో వేసుకోవచ్చు.
సేవింగ్స్‌ అకౌంట్‌, కరెంట్‌ అకౌంట్‌/ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో ఎన్‌ఆర్‌ఇ ఖాతా ఓపెన్‌ చేయవచ్చు.
ఎన్‌ఆర్‌ఇ ఖాతాల్లోని నగదుపై లభించే వడ్డీ ఆదాయానికి భారత్‌లో పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఎన్‌ఆర్‌ఐ ఉంటున్న దేశంలో మాత్రం పన్ను చెల్లించాల్సిరావచ్చు.
ఈ ఖాతాలోని అసలు, వడ్డీ ఆదాయాన్ని అవసరమైతే తేలిగ్గా ఉంటున్న దేశానికి బదిలీ చేసుకోవచ్చు.
 
ఎఫ్‌సిఎన్‌ఆర్‌ అకౌంట్‌
ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ (ఎఫ్‌సిఎన్‌ఆర్‌) ఖాతా ద్వారా ఎన్‌ఆర్‌ఐలు విదేశీ మారక ద్రవ్యం రూపంలో పెట్టుబడి పెట్టి, వడ్డీ ఆదాయం అందుకోవచ్చు.
ఇది విదేశీ మారక ద్రవ్యం రూపంలో ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌. దీని కాల పరిమితి ఏడాది నుంచి ఐదేళ్లు.
ఫారెక్స్‌ మార్కెట్లోని ఆటుపోట్లను తట్టుకోవాలనుకునే ఎన్‌ఆర్‌ఐలు ఎఫ్‌సిఎన్‌ఆర్‌ ఖాతాను ఎంచుకోవచ్చు.
డాలర్‌, యెన్‌, యూరో, స్టెర్లింగ్‌ పౌండ్‌ వంటి విదేశీ కరెన్సీలను ఈ ఖాతాలో డిపాజిట్‌ చేయవచ్చు.
ఖాతాదారుడు ఎన్‌ఆర్‌ఐగా ఉన్నంత వరకు ఈ డిపాజిట్లపై లభించే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి రాదు.
 
ఆర్‌ఎఫ్‌సి ఖాతా
స్వదేశానికి వచ్చినా విదేశాల్లో ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని డిపాజిట్‌ చేసేందుకు ఆర్‌ఎ్‌ఫసి ఖాతా ఉపయోగపడుతుంది.
భవిష్యత్‌లో మళ్లీ ఎన్‌ఆర్‌ఐగా మారినా ఈ ఖాతాను ఎన్‌ఆర్‌ఇ/ఎ్‌ఫసిఎన్‌ఆర్‌ ఖాతాగా మార్చుకోవచ్చు.
ఈ ఖాతాను కూడా సేవింగ్స్‌, కరెంట్‌ లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా రూపంలో ఓపెన్‌ చేయవచ్చు.
ఈ ఖాతాలో డిపాజిట్లను గుర్తించిన విదేశీ కరెన్సీల రూపంలో మాత్రమే అనుమతిస్తారు.
ఆర్‌ఎఫ్‌సి ఖాతాల్లోని విదేశీ కరెన్సీలపై లభించే వడ్డీ ఆదాయంపై ఆయా వ్యక్తుల శ్లాబు ప్రకారం ఆదాయ పన్ను చెల్లించాలి.
ఎన్‌ఆర్‌ఒ ఖాతాలోని నిధులను ఎన్‌ఆర్‌ఇ/ఎఫ్‌సిఎన్‌ఆర్‌ ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు అనుమతించరు. ఖాతా ప్రారంభించే ముందే ఈ విషయం తెలుసుకోవాలి.
కొన్ని షరతులకు లోబడి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే ప్రతి ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల డాలర్లు మించకుండా విదేశాలకు బదిలీ చేసేందుకు ఆర్‌బిఐ ఇటీవల అనుమతించింది.

 ఆదిల్ షెట్టి