‘గోడ’ గొడవ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి విచిత్రమైనది. ‘గోడ కట్టడానికి సరేనంటారా, లేక ప్రజలను పస్తులుంచమంటారా?’ అని విపక్షంతో యుద్ధానికి దిగాడాయన. అమెరికా–మెక్సికో సరిహద్దు గోడ విషయంలో ఆయన ధోరణి దేశాధ్యక్షుడి స్థాయికి తగినట్టుగా లేదు. ఇరవైరోజులుగా దేశం పాక్షికంగా స్తంభించిపోతే, వ్యవస్థలన్నీ వరుసగా నిర్వీర్యమైపోతుంటే, ఆయన మాత్రం తన ‘అద్భుతమైన, ఎత్తయిన గోడ’ కోసం దేశంలో అత్యయిక స్థితి ప్రకటించడానికి సైతం సిద్ధమంటున్నారు. అడ్డుగోడకు అవసరమైన ఐదు బిలియన్‌ డాలర్ల మంజూరుకు సంబంధించి ఇప్పటికే విపక్ష డెమోక్రాట్లతో పలుస్థాయిలో జరిగిన చర్చోపచర్చలు విఫలమై, ప్రభుత్వ పాక్షిక స్తంభనకు దారితీసింది. మూతబడుతున్న ప్రభుత్వ శాఖలను తిరిగి తెరిపించేందుకు ప్రతినిధుల సభ నిధుల మంజూరుకు ఆమోదముద్ర వేసింది. బిల్లుకు అధ్యక్షుని ఆమోదం తప్పనిసరి కనుక ప్రతినిధుల సభ స్పీకర్‌తో అధ్యక్షుడి ముఖాముఖి సమావేశం ఏర్పాటైంది. ‘బిల్లుమీద సంతకం చేస్తే గోడ కట్టడానికి అవసరమైన నిధులు ఇస్తారా?’ అన్న ట్రంప్‌ ప్రశ్నకు నాన్సీ పెలోసీ ‘నో’ అనగానే, ‘మీతో మాట్లాడటం టైమ్‌ వేస్ట్‌’ అని ట్రంప్‌ చర్చలనుంచి బయటకు వచ్చేశారు. ‘ఇస్తారా, చస్తారా?’ అంటున్న ట్రంప్‌ తాను పాలకుడిననీ, ప్రజలకు జవాబుదారీనన్న విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నారు.

 
ఎవరిమీదో ఆగ్రహంతో తన ప్రజలను ఇక్కట్ల పాల్జేస్తున్నారు ట్రంప్‌. డెమోక్రాట్లను సాధించలేక ప్రజలను శిక్షిస్తున్నారు. పాలన పాక్షికంగా నిలిచిపోయి పదిలక్షలమంది ఉద్యోగులకు వేతనాలు రాని స్థితిలో సైతం అధ్యక్షుడికి ఉన్న అపరిమితమైన అధికారాలను దుర్వినియోగం చేయడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. డెమోక్రాట్ల చేత బలవంతంగా వారు వ్యతిరేకిస్తున్న గోడ నిర్మాణానికి ఒప్పించడానికి ట్రంప్‌ ఒక అమానవీయమైన పరిస్థితిని వాడుకుంటున్నారు. ప్రతినిధుల సభ మధ్యంతర నిధులను ఆమోదించినప్పటికీ తాను మాత్రం సంతకం చేయనని ఆయన ముందే ప్రకటించడంతో సెనేట్‌లో ఆధిపత్యం ఉన్న రిపబ్లికన్లు బిల్లు తొక్కిపెట్టేశారు. సెనేట్‌ సరేనన్నా అధ్యక్షుడు మొండికేస్తే బిల్లు ప్రయోజనం నెరవేరదన్నది అటుంచితే, రిపబ్లికన్లు సైతం ప్రజల పక్షాన కాక ట్రంప్‌ వెనుక నిలవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ట్రంప్‌తో గొడవెందుకనో, రాజకీయ కారణాలతోనో వారు ఈ పనిచేసి ఉండవచ్చును కానీ, ఒక ప్రధాన రాజకీయపక్షం ప్రజలకోసం కాక ఒక వ్యక్తికోసం ఇలా ప్రవర్తించడం అప్రదిష్ట తెచ్చేదే. సెనేట్‌ సభ్యులు రాజ్యాంగబద్ధంగా కాక, రాజకీయంగా వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లును సెనేట్‌ ఆమోదించడమో, తిరస్కరించడమో చేయవలసి ఉండగా చర్చకు కూడా రానివ్వకపోవడం విచిత్రం. సెనేట్‌లో ఎంతమంది రిపబ్లికన్లు బిల్లు ఆమోదానికి సానుకూలంగా ఉన్నారన్న లెక్కలు అటుంచితే, కనీసం బిల్లుకు సరేనని అధ్యక్షుడికి పంపివుంటే పార్టీ పరువు కొంతైనా మిగిలేది. బిల్లును ట్రంప్‌ అడ్డుకుంటే, అది అధ్యక్షుడికీ విపక్షానికీ మధ్య యుద్ధంగా మాత్రమే ప్రజల దృష్టిలో మిగిలేది. గోడ నిధుల కేటాయింపునకూ, ప్రభుత్వశాఖల బడ్జెట్‌కూ మధ్య లంకె పెడుతూ ట్రంప్‌ ఆరంభించిన ఈ యుద్ధానికి సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ అండగా నిలవడం దురదృష్టకరం.
 
విపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టేసి, దానిని విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్‌. భద్రత పేరిట ఆయన దేశ చరిత్రలోనే రెండవ అతిపెద్ద ప్రతిష్ఠంభనను సృష్టించారు. గోడ ఖర్చు మొత్తం మెక్సికోతో కక్కిస్తానని నిన్న మొన్నటి వరకూ గర్జించారు. ఇప్పుడది అసాధ్యమని తేలిపోవడంతో ఎన్నికల హామీ నెరవేర్చుకోవడానికి తన ప్రజల సొమ్ము మీద పడ్డారు. అవసరమైతే అధ్యక్ష అధికారాలు ప్రయోగించి దేశ రక్షణ నిధులు వాడేస్తానని కూడా హెచ్చరిస్తున్నారు. గోడ నిర్మాణం అమెరికా విలువలకు, ఘనచరిత్రకు అప్రదిష్ట తెచ్చిపెడుతుందనీ, గోడలు కట్టినంత మాత్రాన వలసల నివారణ పూర్తిగా సాధ్యం కాదనీ, మెక్సికో వలసదారులను నిలువరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయని డెమోక్రాట్లు అంటున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలతో వారు చర్చలకు సిద్ధపడ్డారు. కానీ, ‘గోడ’తో ముడివడిన తన వ్యక్తిగత ప్రతిష్ఠకు మాత్రమే ట్రంప్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. డెమోక్రాట్ల మద్దతు లేకుండా గోడ అసాధ్యమని ట్రంప్‌కు తెలుసు. ట్రంప్‌ ప్రతిపాదనకు సరేననకుంటే ఆయన గోడదిగడనీ, ఈ ప్రతిష్ఠంభన తొలగదనీ డెమోక్రాట్లకు తెలుసు. ఉభయులూ దేశశ్రేయస్సు పేరిట ప్రజలను శిక్షిస్తున్న విచిత్ర ఘట్టం ఇది.