హాయ్.. థాయ్.. జాయ్...

ఘనమైన చారిత్రక వారసత్వం థాయిలాండ్‌ సొంతం. మరోవైపు రాత్రి సమయాల్లో విందు వినోదాలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన దేశం. విశాలమైన సాగరతీరాలూ, ఇరుకైన కాలువల్లో కదుల్తూ సాగే మార్కెట్లూ, రుచి చూడక తప్పదనిపించే స్ట్రీట్‌ ఫుడ్‌... ఇలా థాయిలాండ్‌ ప్రత్యేకతలు అనేకం. ఆసియాలో ఎక్కువమంది విదేశీ పర్యాటకులు ఎంచుకొనే గమ్యం కూడా! ఇటీవల ఆ దేశాన్ని సందర్శించిన సుప్రసిద్ధ రంగస్థల నటుడు, రచయిత డాక్టర్‌ మీగడ రామలింగస్వామి పంచుకుంటున్నఅనుభూతులు...
 
‘‘ప్రతి మనిషికీ ఓ ప్రత్యేకత ఉన్నట్టే ప్రతి దేశానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. థాయిలాండ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాంకాక్‌ నగరం, పటాయా సాగరతీరం, కోరల్‌ ఐలాండ్‌... ఇలా అక్కడ ఎన్నెన్నో ఆకర్షణలు. మా కుటుంబ సభ్యులు ఆరుగురం ఇటీవల థాయిలాండ్‌లో పర్యటించాం. విశాఖపట్నంలో రాత్రి పన్నెండు గంటలకు మా విమానం బయలుదేరింది. మూడు గంటల్లో డిఎంకె బ్యాంకాక్‌ విమానాశ్రయంలో దిగాం. థాయ్‌ కరెన్సీని ‘బాత్‌’ అంటారు. ఒక బాత్‌ మనకు దాదాపు 2 రూపాయల 34 పైసలతో సమానం. విమానాశ్రయం నుంచి సిటీలోకి వెళ్ళడానికి 600 బాత్‌లు తీసుకున్నారు. అన్ని వర్గాలకూ అనువైన వసతి సదుపాయాలు థాయిలాండ్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఉన్నాయి. థాయిలాండ్‌ అనగానే చాలామందికి గుర్తుకువచ్చేవి వినోదాలూ, విలాసాలూ. థాయ్‌ మసాజ్‌లూ! అవి కోరుకున్న వారికి కోరుకున్నంత! థాయిలాండ్‌ ప్రజలు థాయ్‌ భాష మాట్లాడుతారు. ఇంగ్లీష్‌ మాట్లాడేవారు అరుదుగా కనిపిస్తారు. సైగలతోనో, వాళ్ళకు అర్థం అయ్యే భాషలోనో పర్యటకులు నెట్టుకు రావడమే!

ఎన్నెన్నో ఆలయాలు...

థాయిలాండ్‌లో ఆలయాలూ, వాటి నిర్మాణాలూ విలక్షణంగా ఉంటాయి. బుద్ధుని ఆలయాలు ఎక్కువ. నిలబడిన భంగిమలో వినాయకుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఏ ఆలయాన్ని చూసినా ఏదో ఒక విశేషం ఉంటుంది.

జాతి పచ్చ బుద్ధుడు

బ్యాంకాక్‌ నగరంలోని రాజమహల్‌ను ‘గ్రాండ్‌ ప్యాలెస్‌’ అంటారు. అందులో అత్యద్భుతమైన ఆలయం ఉంది. అదే ఎమరాల్డ్‌ బుద్ధ మందిరం. దీని సందర్శనకు 500 బాత్‌లు తీసుకుంటారు. లోపలికి ప్రవేశిస్తే చుట్టూ సమున్నతమైన భవనాలుంటాయి. వాటిని చూస్తూ ముందుకు వెళ్తే ఎత్తైన ఆలయంలో జాతి పచ్చతో చేసిన, కూర్చున్న భంగిమలో... ఎత్తైన సింహాసనంపై ఎమరాల్డ్‌ బుద్ధుడి విగ్రహం దర్శనమిస్తుంది. కళాచాతుర్యానికి చిహ్నమైన ఈ విగ్రహం సందర్శకుల్లో భక్తి భావాన్నీ, అమితమైన ఆనందాన్నీ కలిగిస్తుంది. ఈ ఆలయం లోపల ఫొటోలు తియ్యనివ్వరు.

గోల్డెన్‌ బుద్ధ

ఇంకాస్త దూరంలో మరో ఆకర్షణ గోల్డెన్‌ బుద్ధ టెంపుల్‌. ఈ అయిదున్నర టన్నుల బంగారంతో చేసిన విగ్రహం మూడో అంతస్థులో ఉంటుంది. ఆ తథాగతుణ్ణి ఎంత సేపు చూసినా తనివి తీరదు.

అంతస్థుకో దేశం!

బ్యాంకాక్‌లో మేము చూసిన ప్రధాన సందర్శనీయ స్థలాల్లో ‘టెర్మినల్‌ 21’ ఒకటి. ఇదో పెద్ద మాల్‌. దీనిలో ఒక్కో అంతస్థూ ఒక్కో దేశానికి ప్రతినిధిలా ఉంటుంది. ఆయా దేశాల్లోని వస్తువులను వాటిలో విక్రయిస్తారు. ఆ దేశాల సంస్కృతిని ఆ ఫ్లోర్‌ ప్రతిబింబిస్తూ ఉంటుంది.

అందాలకు నెలవు!

బ్యాంకాక్‌ పర్యటన ముగించుకొని పటాయా మహానగరాన్ని చేరుకున్నాం. ఇది సాగరతీరంలో ఉంది. అన్ని అందాలకూ నెలవుగా, సకల అనుభవాలకూ కొలువుగా దీన్ని అభివర్ణించవచ్చు. రాత్రీ-పగలూ అనే తేడా లేకుండా ఈ నగరం శోభాయమానంగా ఉంటుంది. ఇక్కడ సందర్శనీ
య స్థలాలు అనేకం. వాటిలో ప్రవేశానికి టిక్కెట్ల ధర 400 నుంచి 500 బాత్‌లు. చూడడానికి సమయం కూడా ఎక్కువే పడుతుంది. వీటిలో శ్రీరాచ టైగర్‌ జంతుప్రదర్శనశాలలో క్రోకడైల్‌ షో, టైగర్‌ షో, పిగ్‌ షో, ఎలిఫెంట్‌ షో లాంటివి ప్రత్యేక ఆకర్షణలు ఎన్నో! టిక్కెట్టు తీసుకొని లోపలికి వెళ్తే ఈ ప్రదర్శనలను ఉచితంగా తిలకించవచ్చు.

పులులతో ఆడుకోవచ్చు!

పటాయాలోని టైగర్‌ పార్క్‌లో దాదాపు వంద పులులు ఉంటాయి.. ప్రవేశ టిక్కెట్టు తీసుకొని లోపలికి వెళ్ళాక, మరో టిక్కెట్‌ తీసుకుంటే, పెద్దపులులు తిరిగే ప్రదేశానికి కరెంట్‌ వైర్లు ఉన్న వ్యాన్‌లో తీసుకువెళ్తారు. ఇరవై నిమిషాలపాటు అక్కడ విహరించవచ్చు. వ్యాన్ల చుట్టూ పెద్దపులులు అరుస్తూ, నోళ్ళు పెద్దగా చాచి తిరుగుతూ ఉంటే భయంతో, ఉద్వేగంతో సందర్శకుల ఒళ్ళు జలదరిస్తుంది. అదో గొప్ప అనుభవం. ఇక్కడ రోజుల పులి పిల్ల నుంచీ పెద్ద పులి వరకూ ఉంటాయి. వాటితో పదిహేను నిమిషాలు ఆడుకోవచ్చు. దీనికి టిక్కెట్లు 200 బాత్‌ల నుంచీ 800 బాత్‌ల వరకూ ఉంటాయి. యాభై వరకూ ఫొటోలు కూడా తీసుకోవచ్చు.
పులుల బోనుల్లోకి సందర్శకులు ప్రవేశించడానికి ముందు సంతకాలు తీసుకుంటారు. నిపుణులు మనతోనే ఉంటారు. కానీ ఎంతైనా అవి పులులు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తారు. ఈ బోన్లలో ప్రవేశానికి డబ్బుంటే చాలదు, ధైర్యం కూడా పుష్కలంగా ఉండాలి. అరవై అయిదేళ్ళున్న నా దగ్గర నుంచి ఏడేళ్ళ వయసున్న మా మనవడి వరకూ... మా బృందంలోని 

ఇలా మా ఆరు రోజుల పర్యటనను ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నాం- అపూర్వమైన అనుభూతులనూ, గొప్ప అనుభవాలనూ, జ్ఞాపకాలనూ గుండెల్లో దాచుకుంటూ!ఆరుగురం బోనుల్లోకి వెళ్ళాం. గొప్ప అనుభూతులను మూటగట్టుకున్నాం. పటాయాలో తప్పనిసరిగా చూడాల్సిన పార్క్‌ ఇది. అలాగే ప్రాచీనమైన బుద్ధుడి విగ్రహం ఒకటి పటాయాలో ఉంది. దీన్ని ‘బిగ్‌ బుద్ధ’ అంటారు. దాని చుట్టూ అనేక బుద్ధ విగ్రహాలు చూపరులకు కనువిందు చేస్తాయి.

పగడపు దీవి

పటాయా బీచ్‌లో ఉదయం ఆరు గంటల నుంచి కోరల్‌ ఐలాండ్‌ చేరడానికి స్పీడ్‌ బోట్లు, ఫెర్రీలూ సిద్ధంగా ఉంటాయి. సముద్ర జలాల్లో నలభై నిమిషాల ప్రయాణం ఉంటుంది. టిక్కెట్‌ ధర 30 బాత్‌లు. ఈ దీవిలో ఎనిమిది బీచ్‌లు ఉంటాయి. అవన్నీ తిరగడానికి ‘టుక్‌ టుక్‌’లు (ఆటోలు), కార్లూ ఉంటాయి. ఆటో గేర్‌ స్కూటర్లు కూడా అద్దెకిస్తారు. 200 బాత్‌లు చెల్లిస్తే, ఫుల్‌ ట్యాంక్‌ ఇంధనంతో స్కూటర్‌ అందిస్తారు. సాయంత్రం దాన్ని మళ్ళీ దాన్ని అప్పగించాలి. ఇక, మరో 30 బాత్‌లు చెల్లించి పటాయాకు బోట్లలో తిరిగి చేరుకోవచ్చు.

మరో లోకం!

బుద్ధుడి ఆలయం నుంచి ముందుకు వెళ్తే రాజమందిరం కనిపిస్తుంది. థాయిలాండ్‌ రాచరిక వ్యవస్థకు చెందిన ఈ మందిరంలో నాటి పాలకులూ, వారి భాగస్వాముల చిత్రపటాలు కనువిందు చేస్తాయి. ఇదంతా మరో లోకంలా కనిపిస్తుంది. థాయిలాండ్‌ రాజవంశీకులు ఇప్పటికీ ఈ భనవంలో నివసిస్తున్నారు. తెల్లటి యూనిఫారాల్లో సైనికులు చేసే కవాతులు చూపరుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అక్కడికి మరికొంత దూరంలో ‘రిక్లెయినింగ్‌ బుద్ధ ఆలయం’ ఉంది. ఆ ఆలయంలో బుద్ధుడు తల కింద చెయ్యి పెట్టుకొని శయనిస్తూ కనిపిస్తాడు. దానిలో ప్రవేశానికి టిక్కెట్టు 200 బాత్‌లు. ఈ భవనమంతా బుద్ధుడే ఉంటాడు. చాలా భారీ విగ్రహం అది. తలకూ, పాదాలకూ చాలా దూరం ఉంటుంది. ఇక్కడ ఫొటోలు తీసుకోవచ్చు.