పొట్ట విప్పి చూడు అప్పులుండు

డిస్కౌంట్లు, ఆఫర్లతో పీకలమీదకు
ఇంధన ధర, రూపాయి బలహీనతల ప్రభావం
భారత విమానయాన రంగం శరవేగంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వరుసగా మూడేళ్లు మన దేశ విమానయాన రంగంలోనే వేగవంతమైన వృద్ధి నమోదైంది. 2025నాటికి ప్రపంచ మార్కెట్లో మూడో స్థానానికి చేరుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దేశంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విదేశీ కంపెనీలూ రంగ ప్రవేశం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉండడంతో గత కొన్ని నెలల వరకూ కొద్దిగా ఊపిరి పీల్చుకున్న విమానయాన సంస్థలకు మళ్లీ అన్ని వైపుల నుంచి కష్టాలు ఎదురవుతున్నాయి. విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణత, కంపెనీల మధ్య పోటీ మొత్తం పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి.
 
దీంతో కంపెనీలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇప్పటికే రూ.కోట్ల అప్పుల భారంతో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ చరిత్రలో కలిసిపోయింది. విజయవాడ కేంద్రంగా కొన్నేళ్లు విమానయాన సర్వీసులు అందించిన ఎయిర్‌కోస్టా కార్యకలాపాలు నిలిపివేసింది. మరో విమాన కంపెనీ జెట్‌ ఎయిర్‌వేస్‌ చేతిలో చిల్లిగవ్వలేదు! ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొంది. ఎయిర్‌ ఇండియా అప్పుల భారంతో నెట్టుకువస్తోంది. ఈ కంపెనీలో మెజారిటీ వాటా విక్రయించేందుకు సర్కారు ముందుకొచ్చినా ఒక్క కంపెనీ ఆ వాటా కోసం ముందుకురాలేదంటే విమానయాన రంగంలో నెలకొన్న పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
అధిక వ్యయం ఎటిఎ‌‌ఫ్‌‌‌‌దే..
అన్ని రంగాల్లో మాదిరిగానే విమానయాన రంగంలోనూ పోటీ తీవ్రంగా ఉంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ కంపెనీలు టికెట్లపై విపరీతంగా డిస్కౌంట్లు, ఆఫర్లను ఇస్తున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీలపై ఆర్థిక భారం తడిసిమోపెడవుతోంది. కొన్నాళ్లు మాత్రమే ఈ భారాన్ని భరించిన కంపెనీలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నాయి. అధిక ఇంధన ధరల కారణంగా విమానయాన కంపెనీలపై దెబ్బపడుతోంది. కంపెనీ నిర్వహణ వ్యయంలో విమాన ఇంధనం (ఎటిఎఫ్‌) వాటాయే ఐదింట రెండు వంతులు ఉంటుంది. సిబ్బందికి జీతాలు, ఎయిర్‌పోర్ట్‌ చార్జీలు, విమానాలకు చెల్లించాల్సిన అద్దెలు తదితరాలు కలిపితే ఈ కంపెనీలకు ఏమీ మిగలకపోగా.. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. విమాన ఇంధనంపై విభిన్న రాష్ర్టాల్లో విలువ ఆధారిత పన్ను 15 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం వల్ల ఎటిఎఫ్‌ ధరలు మండిపోతున్నాయి. దీనిపై పన్నులతో టికెట్ల ధర భారీగా పెరుగుతోంది. ధరలు అధికంగా ఉంటే ప్రయాణికులు కాస్త ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గిస్తే వాటిల్లే నష్టాన్ని కంపెనీలే భరించాల్సి వస్తోంది. ఇవి క్రమంగా పెరిగి పెద్ద కొండలా మారుతున్నాయి.
 
ఇదీ పరిస్థితి
ప్రభుత్వరంగంలోని ఎయిర్‌ ఇండియాపై రూ.48 వేల కోట్లకుపైగా అప్పుల భారం ఉంది. దేశీయ విమానయాన కంపెనీల్లో ఒక్క ఇండిగోనే కాస్త మెరుగ్గా ఉంది. తీవ్రమైన పోటీ కారణంగా ఈ మధ్యకాలంలో ఈ కంపెనీ లాభాలు కూడా తగ్గిపోతున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండిగోను నడిపిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం 96.6 శాతం తగ్గి రూ.27.80 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ ఇంధన వ్యయం 54 శాతం పెరిగి రూ.1,759 కోట్ల నుంచి రూ.2,715 కోట్ల పెరిగింది. అధిక ఇంధన సామర్థ్యం కలిగిన విమానాలను వినియోగించడం, వ్యయాలను తగ్గించుకోవడం వల్ల ఈ సంస్థ కాస్త మెరుగ్గా ఉంది. స్పైస్‌జెట్‌ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఈ సంస్థ 38.1 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. అధిక ఇంధన ధరలు, రూపాయి బలహీనతే నష్టాలు పెరిగేందుకు కారణమైనట్టు ఈ సంస్థ చెబుతోంది. జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ ఇంధన బిల్లు 534 కోట్ల రూపాయల నుంచి 812 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది.
 
విదేశీ కంపెనీలు విలవిల
భారత్‌లో లాభాల పంట పడుతుందన్న విశ్వాసంతో దేశీయ కంపెనీలతో చేతులు కలిపిన విదేశీ కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఆశించిన లాభాలు లేకపోవడం వల్ల ఈ సంస్థలు విస్తరణపై దృష్టిపెట్టేందుకు ఆలోచిస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వే్‌సలో యుఎఇకి చెందిన ఎతిహాద్‌ ఎయిర్‌వే్‌సకు 24 శాతం వాటా ఉంది. విస్తారాను టాటా సియా ఎయిర్‌లైన్స్‌ ఏర్పాటు చేసింది. ఇందులో టాటా సన్స్‌కు, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు వాటాలున్నాయి. ఎయిర్‌ ఆసియా ఇండియాలో ఎయిర్‌ ఆసియా బెర్హాద్‌, టాటా సన్స్‌కు వాటాలున్నాయి.