అమెరికాలో అడుగుపెట్టామ్‌!

అమెరికాకు వెళ్లటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయి విమానం ఎక్కేసిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ రీజినల్‌ ఆఫీసర్‌ ప్రియా బహదూర్‌ అందిస్తున్నారు..

పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీకి సంబంధించి..
అమెరికాలో మనం ఏ నగరంలో అడుగుపెడతామో దానిని పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ అంటారు. విమానంలో నుంచి దిగేసమయంలోనే మనకు ఇమిగ్రేషన్‌ కార్డును ఇస్తారు. దీనిని పూర్తిచేసి ఇమిగ్రేషన్‌ ఆఫీసర్లకు అందించాలి. ఇమిగ్రేషన్‌ సెక్షన్‌కు వెళ్లే ముందు ఐ-20, పాస్‌పోర్టు, యూనివర్సిటీ ఇచ్చిన పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు రెడీగా ఉంచుకోవాలి. ఇమిగ్రేషన్‌ అధికారులకు వారు అడిగిన సమాచారం అందిస్తే సరిపోతుంది.
 
విద్యా వాతావరణం..
అమెరికాలో ఉన్నత విద్య మిగిలిన దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా అమెరికాలో విద్యా సంస్థలు- గ్రూప్‌ డిస్కషన్స్‌, లెక్చర్స్‌పై ఆధారపడతాయి. విజ్ఞానాన్ని కేవలం పాఠ్యపుస్తకాల ద్వారా కాకుండా ఇతర పద్ధతుల ద్వారా విద్యార్థులకు అందించటానికి ప్రయత్నిస్తాయి. అందువల్ల విద్యార్థులు క్లాసు రూమ్‌ల్లో నోట్స్‌ను రాసుకోవాల్సి ఉంటుంది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించాల్సి ఉంటుంది.
 
యూనివర్సిటీ కోడ్‌..

అమెరికాలో ప్రతి విశ్వవిద్యాలయానికి ఒక కోడ్‌ ఉంటుంది. విద్యార్థులందరూ వీటికి కట్టుబడి ఉండాలి. లేకపోతే విద్యార్థులపై కఠినమైన చర్యలు తీసుకొనే అధికారం విశ్వవిద్యాలయానికి ఉంటుంది. సాధారణంగా ఈ కోడ్‌లో- మోసం చేయటం, ఇతరులు రాసిన విషయాలను తమవేనని చెప్పుకోవటం, తప్పుడు సమాచారాన్ని అందించటం వంటి అంశాలుంటాయి. అందువల్ల అమెరికాలో చదివే విద్యార్థులు ఈ కింది విషయాలను గమనించాలి. అవి..

విద్యార్థులు చదువుకు సంబంధించిన తమ ప్లానింగ్‌ను తామే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో విద్యా సంస్థను మోసం చేయటానికి ప్రయత్నించకూడదు.

చదువు విషయంలో నిజాయితీని, నిబద్ధతను అమెరికా విశ్వవిద్యాయాలు చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. వీటిని అతిక్రమిస్తే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందువల్ల విద్యార్థులు నిజాయితీగా ఉండాలి.

కొన్ని సార్లు కోడ్‌లో ఉన్న అంశాలు- విద్యార్థులు స్వదేశంలో పాటించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ అమెరికాలో అవి తప్పనిసరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ప్రతి వర్సిటీ- తమ వద్ద కొత్తగా చేరిన విద్యార్థులకు ఈ కోడ్‌ను అందిసుంది. దీనిని క్షుణ్ణం గా చదివి అర్థం చేసుకుంటే ఇబ్బందులు ఉండవు.
 
ప్రొఫెసర్లతో కమ్యూనికేషన్‌
సాధారణంగా ప్రతి విద్యార్థికి ఒక అకడమిక్‌ అడ్వైజర్‌ ఉంటాడు. అతను విద్యార్థికి కోర్సు రిజిస్ట్రేషన్‌ దగ్గర నుంచి పూర్తయ్యే వరకూ సాయపడుతూ ఉంటాడు. అకడమిక్‌ అడ్వైజర్‌లతో సత్సంబంధాలు పెంచుకోవటం మంచిది. ఇదే విధంగా ప్రొఫెసర్లతో కూడా విద్యా సంబంధిత విషయాల గురించి మాట్లాడటానికి ముందే అపాయింట్‌మెంట్స్‌ను ఫిక్స్‌ చేసుకోవాలి.
 
క్యాంపస్‌లో అడుగుపెట్టిన తర్వాత..
ప్రతి విశ్వవిద్యాలయం కొత్తగా చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు పరిచయ (ఓరియంటేషన్‌) కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనిలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన విషయాలను వివరిస్తారు. దీనితో పాటు- బ్యాంకు అకౌంట్లు ఎలా ఓపెన్‌ చేయాలి? మొబైల్‌ ఫోన్లు, సిమ్‌ కార్డులు ఎక్కడ దొరుకుతాయి? వంటి అంశాలను కూడా చెబుతారు. ఒక సారి ఓరియంటేషన్‌ పూర్తి అయిన తర్వాత విశ్వవిద్యాలయం అంతా తిరిగి చూస్తే మంచిది. దీనితో పాటుగా విశ్వవిద్యాలయంలో లభించే అదనపు సేవలకు సంబంధించిన నెంబర్లను నోట్‌ చేసి పెట్టుకోవాలి.
 
అసిస్టెంట్‌షిప్‌లు..

అమెరికాలో అనేక విశ్వవిద్యాలయాలు అసిస్టెంట్‌షిప్ లను అందిస్తూ ఉంటాయి. అసిస్టెంట్‌షిప్ ల వల్ల ఉన్నత విద్యను అభ్యసించే వారికి రకరకాల ప్రయోజనాలుంటాయి. ప్రధానంగా ఇవి విద్యార్థులకు అదనంగా కొంత ఆర్థికంగా తోడ్పడటంతో పాటుగా ట్యూషన్‌ ఫీజు తగ్గింపునకు కూ డా దోహదపడతాయి. సాధారణంగా అన్ని విశ్వవిద్యాలయాలు- అంతర్జాతీయ విద్యార్థులకు వారానికి 20 గంటలు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రతి రెండు వారాలకు ఒక సారి ఈ స్టైఫండ్‌ను చెల్లిస్తాయి. ఈ అసిస్టెంట్‌షిప్ ల వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. వీటి వల్ల

విద్యార్థుల తాము అభ్యసిస్తున్న రంగంలో మరింత నైపుణ్యాన్ని పొందటానికి ఇవి ఉపయోగపడతాయి.
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల లీడర్‌షిప్‌ లక్షణాలను అభివృద్ధి చేస్తాయి
విద్యార్థులు రకరకాల అంశాలపై పేపర్లను పబ్లిష్‌ చేయటానికి ఇవి ఉపయోగపడతాయి
ఇవి కేవలం విద్యారంగంలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఉపయోగపడతాయి.
అసిస్టెంట్‌షిప్ ల కోరుకొనే విద్యార్థులు ఈ కింది అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
అసిస్టెంట్‌షిప్ లు కోరుకున్నవారు విద్య విషయంలో వెనకపడిపోకుండా చూసుకోవాలి
విద్యార్థులు తమ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ దెబ్బతినకుండా చూసుకోవాలి.
ఒక విద్యార్థికి ఎంత కాలం అసిస్టెంట్‌షిప్‌ ఇవ్వాలనే విషయాన్ని విశ్వవిద్యాలయమే నిర్ణయిస్తుంది.