గాంధీ జాత్యహంకారేనా?

ఆఫ్రికాలో నివసిస్తున్న కొద్దీ తన బాల్య, యవ్వన కాలాలలోని జాతి దురహంకార వైఖరులను గాంధీజీ విడనాడారు. ఆయనపై ఘనా విద్యార్థుల అభియోగపత్రంలో చివరి ఉటంకింపు 1906 నాటిది. ఆ తరువాత తన 42 సంవత్సరాల శేష జీవితంలో జాత్యహంకారాన్ని గాంధీజీ సంపూర్ణంగా త్యజించారు. అన్ని కులాల, జాతుల, మతాల, వర్గాల స్త్రీ పురుషులతో సమానస్థాయిలో ఆత్మీయ అనుబంధాలను పెంపొందించుకున్నారు.

మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ జాతి విద్వేషం చూపేవారా? ఘనాలో గాంధీ విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో ఈ ప్రశ్న సరికొత్తగా చర్చకు వచ్చింది. గాంధీ విగ్రహ తొలగింపునకు దారితీసిన ఘనా విశ్వవిద్యాలయ విద్యార్థుల పిటిషన్‌లో గాంధీజీ రచనలు, ప్రసంగాల నుంచి పలు ఉటంకింపులు ఇచ్చారు. అయితే అవన్నీ దక్షిణాఫ్రికాలో గాంధీ తొలి సంవత్సరాలనాటివి (1893లో దక్షిణాఫ్రికా వెళ్ళిన గాంధీజీ 1914లో భారతదేశానికి తిరిగివచ్చారు). తన పరిణత వయస్సులో ఆఫ్రికన్లు, ఆఫ్రికా గురించి గాంధీజీ ఏమి చెప్పారు? ఏమి మాట్లాడారన్న దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
 
గాంధీజీ, తన ఇరవైలలో నిస్సందేహంగా జాతి దురహంకార వాది. నాగరికతల శ్రేణీకరణను ఆయన విశ్వసించారు. ఆయన భావన ప్రకారం నాగరికతా శిఖరపు అగ్రభాగాన యూరోపియన్లు ఉంటారు. భారతీయులు వారి తరువాత స్థానంలోను, ఆఫ్రికన్లు అట్టడుగు స్థానంలోను ఉంటారని ఆయన అన్నారు. అయితే తన ముప్పైల నడిమి భాగానికి వచ్చేసరికి, ఆఫ్రికన్లు భారతీయుల కంటే తక్కువ వారని మాట్లాడడాన్ని ఆయన పూర్తిగా మానివేశారు. ఆ ప్రజలు తనకు ఇచ్చిన గౌరవానికి తగ్గట్టు ఎటువంటి వివక్ష లేకుండా అందరినీ సమభావంతో ఆయన సమాదరించేవారు. జాతిని గురించిన గాంధీ భావ పరిణామం 1908లో జోహోన్నెస్‌బర్గ్‌ వైఎమ్‌సిఏలో వెలువరించిన ఒక ఉపన్యాసంలో చక్కగా వ్యక్తమయింది. ‘బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ఆసియావాసులు, నల్ల జాతి ప్రజల నుంచి ముప్పు వాటిల్లనున్నదా?’అనే అంశంపై చర్చలో పాల్గొంటూ ఆయన ఆ ఉపన్యాసం చేశారు. ఆ చర్చలో పాల్గొన్నవారిలో శ్వేతజాతేతర వ్యక్తి ఆయన ఒక్కరే అయివుంటారు. కచ్చితంగా శ్వేతజాతేతర ఉపన్యాసకుడు ఆయన మాత్రమేనని చెప్పవచ్చు. ఆఫ్రికన్ల, ఆసియన్ల శ్రమతో బ్రిటిష్‌ సామ్రాజ్యం నిర్మాణమయిందని గాంధీజీ అన్నారు. భారత్‌ను విస్మరించి బ్రిటిష్ సామ్రాజ్యం గురించి ఎవరు మాట్టాడగలరు? అని గాంధీజీ ప్రశ్నించారు. ఆయన ఇంకా ఇలా అన్నారు ‘సామ్రాజ్య పాలిత ప్రజలనందరినీ తమతో సమాన స్థాయికి అభివృద్ధిపరచడం ఆంగ్ల జాతి విధ్యుక్త ధర్మం’.
 
ఈ ఉపన్యాసాన్ని బట్టి 1908 సంవత్సరం నాటికి ఆఫ్రికన్లు, భారతీయులను యూరోపియన్లతో సమానంగా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందనే భావానికి గాంధీజీ వచ్చారన్నది స్పష్టం. ఆ మరుసటి సంవత్సరం జెర్మిస్టన్‌లో వెలువరించిన మరో ప్రసంగంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆఫ్రికన్లు అహింసాత్మక పద్ధతులలో పోరాడితే ఆఫ్రికా ఖండంలో పరిష్కారం కాని సమస్యలంటూ ఉండబోవని గాంధీ అన్నారు. ఆఫ్రికాలో నివశిస్తున్న కొద్దీ తన బాల్య, యవ్వన కాలపు జాతి దురహంకార వైఖరులను గాంధీజీ విడనాడారు. 1910లో ఆయన ఇలా అన్నారు: ‘నీగ్రోలు మాత్రమే ఈ దేశపు మూలవాసులు. శ్వేత జాతీయులు ఎక్కడినుంచో వచ్చి ఈ భూమిని ఆక్రమించుకొని భూమి పుత్రులపై పెత్తనం చేస్తున్నారు’. 1910 నాటికి గాంధీ తన ‘ఇండియన్‌ ఓపీనియన్‌’ పత్రికలో ఆఫ్రికన్లపై శ్వేతజాతిపాలకుల వివక్షకు సంబంధించిన వార్తలు ప్రచురించడం ప్రారంభించారు. ప్రెటోరియాలో ఒక ఉన్నత పాఠశాల సంవత్సరాంత పరీక్షల్లో ఆఫ్రికన్ బాలలకు జరిగిన అన్యాయం అటువంటి వార్తల్లో ఒకటి. అంతకుముందు నల్లజాతి, శ్వేతజాతి విద్యార్థులు ఒకే చోట కలిసి కూర్చుని పరీక్షలు రాసేవారు. అయితే 1910లో టౌన్‌హాలులో జరిగిన ఈ పరీక్షలకు ఆఫ్రికన్‌ విద్యార్థులను అనుమతించలేదు. ఇటువంటి అన్యాయాలపై అహింసాత్మక పద్ధతిలో పోరాడాలని గాంధీజీ భావించారు.
 
గాంధీ 1914లో భారత్‌కు తిరిగి వచ్చారు. జాతిని గురించిన ఆయన భావాలు ప్రగతిశీలంగా పరిణామం చెందడం కొనసాగింది. 1920 వ దశకంలో ప్రచురితమయిన ‘సత్యాగ్రహ ఇన్ సౌత్‌ ఆఫ్రికా’అన్న తన పుస్తకంలో ఆఫ్రికన్‌ మతాన్ని ఆయన స్ఫూర్తిదాయకంగా సమర్థించారు. యూరోపియన్‌ మిషనరీల అభిప్రాయాలతో విభేదిస్తూ గాంధీ ఇలా రాశారు: ‘సత్యం, అసత్యం మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఆఫ్రికన్లకు స్పష్టమైన అవగాహన ఉన్నది. యూరోపియన్లు, భారతీయుల కంటే ఆఫ్రికన్లే సత్యమార్గాన్ని పరిపూర్ణంగా అనుసరిస్తున్నారు. సత్యాచరణలో ఆఫ్రికన్లనే మొదట చెప్పవలసివున్నది’.
 
1920, 30 దశకాలలో గాంధీజీ నిర్వహించిన సత్యాగ్రహ పోరాటాల గురించి ఆఫ్రికన్‌–అమెరికన్‌ పత్రికలలో విస్తృతంగా వార్తలు, వార్తా కథనాలు వెలువడ్డాయి. వీటిని శ్రద్ధగా చదువుతున్న షికాగో నగరవాసి అర్థర్‌ సెవెల్‌ అనే వ్యక్తి గాంధీజీకి రాసిన ఒక లేఖలో అమెరికాలోని నల్లజాతి ప్రజలు మీ ఉద్యమాలను శ్రద్ధగా, సానుభూతితో గమనిస్తున్నారని పేర్కొన్నారు. ‘భారత్‌ పట్ల, భారతీయుల పట్ల నీగ్రో ప్రజలకు సంపూర్ణ సానుభూతి ఉన్నది. ఈ దేశంలో వారు (శ్వేత జాతీయులు) మమ్ములను దోచుకోవడం, జైళ్ళలో పెట్టడమే కాదు, మూక దాడులు చేయడం, బహిరంగంగా చిత్రవధలకు గురిచేయడం, సజీవంగా దహనం చేయడం మొదలైన దురాగతాలకు కూడా గురి చేస్తున్నారు...’ భారత్‌లో బ్రిటిష్‌ వలసపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా నల్ల జాతి ప్రజలు, ఇతర అణగారిన జాతుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు దారి తీస్తుందని తాము విశ్వసిస్తున్నామని’ ఆ ఆఫ్రికన్‌–అమెరికన్‌ అన్నారు. అర్థర్‌ సెవెల్‌ ఇంకా ఇలా రాశారు: భగవంతుడు మిమ్ములను ఆశీర్వదించుగాక! ధర్మరక్షణకు, మానవ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం మీరు చేస్తున్న పోరాటాలు విజయవంతమవ్వాలని 140లక్షల మంది అమెరికన్‌ నీగ్రోలు ప్రార్థిస్తున్నారు’.
 
ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నాయకులతోను, అమెరికాలోని పౌర హక్కుల కార్యకర్తల తోను గాంధీకి సౌహార్ధ సంబంధాలు ఉండేవి. 1936లో గాంధీని కలవడానికి హోవార్డ్‌ థర్మాన్‌ –తదనంతర కాలం లో మార్టిన్‌ లూథర్‌ కింగ్ కు మార్గదర్శకత్వం వహించిన ఉదాత్తుడు– సేవాగ్రాంకు వచ్చారు. భారతీయ నాయకుడు వివిధ అంశాలపై తనను ఎంత నిశితంగా ప్రశ్నించిందీ థర్మాన్‌ వివరంగా రాశారు. అమెరికన్‌ నీగ్రోలు, బానిసత్వ పరిణామం, ఆ దుస్థితిని నీగ్రోలు ఎలా అధిగమిస్తుందీ మొదలైన అంశాలపై గాంధీ ఎంతో అర్థవంతమైన ప్రశ్నలు వేశారని ఆయన పేర్కొన్నారు. దుర్భరమైన అణచివేతను ప్రతిఘటించడానికి నీగ్రోలు ఇస్లాంకు ఎందుకు మారలేదని గాంధీ ప్రశ్నించారు. ఇస్లాం తన అనుయాయుల మధ్య ఎటువంటి అంతరాన్ని పాటించదని, ఇటువంటి సమానత్వాన్ని చూపే ఏకైక మతం ఇస్లాం మాత్రమేనని గాంధీ అన్నారని థర్మాన్‌ పేర్కొన్నారు. గాంధీజీ జిజ్ఞాస, అసక్తులు థర్మాన్‌ను ముగ్ధుడ్ని చేశాయి. ‘ఓటింగ్‌ హక్కులు, మూక హత్యలు, వివక్ష, పబ్లిక్‌ స్కూల్‌ విద్య,చర్చ్‌లు, వాటిని నిర్వహించే పద్ధతులు మొదలైన అంశాల గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి గాంధీజీ ఆసక్తి చూపారు. అమెరికన్‌ సమాజంలో నీగ్రో ప్రజల అనుభవాలను తెలుసుకోవడానికి ఆయన నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారని’ థర్మాన్‌ రాశారు.
 
1946లో దక్షిణాఫ్రికా భారతీయుల ప్రతినిధుల బృందం ఒకటి గాంధీజీని కలిసింది. వేర్పాటు వాద రాజకీయాలకు స్వస్తి చెప్పాలని వారికి ఆయన సూచించారు. ఆఫ్రికన్‌ తెగలవారయిన జులూ, బంటూలతో కలిసి మీ హక్కుల కోసం, వారి హక్కుల కోసం పోరాడాలని ఆయన పేర్కొన్నారు. ‘ఆసియా ఫర్‌ ఆసియాటిక్స్‌’, లేదా ‘ఆఫ్రికా ఫర్‌ ఆఫ్రికన్స్‌’ అనేది నేటి నినాదం కాదని, ఈ ధరిత్రిపై సకల అణగారిన ప్రజల ఐక్యతే నేటి నినాదం కావాలని గాంధీజీ అన్నారు. 1946 మే చివరివారంలో గాంధీజీ ఇలా రాశారు: ‘దక్షిణాఫ్రికాలోని భారతీయులకు ఒక బృహత్తర కర్తవ్యం ఉన్నది. వారు దానిని సమర్థంగా నిర్వర్తించగలరు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన ఆయుధమైన సత్యాగ్రహం ఆ దేశంలోనే అంకురించి, పెరిగింది. దానిని వారు ఒక పవిత్ర బాధ్యతా నిర్వహణకు సమర్థంగా వినియోగించాలి. ఈ ధరిత్రి పైన సకల అణగారిన ప్రజల విముక్తికి సత్యాగ్రహంతో పోరాడాలి’. దక్షిణాఫ్రికాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసు దాడులకు గాంధీ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ అమెరికా దక్షిణ రాష్ట్రాలలో మూక హత్యలను ఈ దాడులు గుర్తుకు తెస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రతి మానవుడిని తనతో సమానంగా చూడడాన్ని ప్రతి శ్వేత జాతీయుడు నేర్చుకోవాల్సిన సమయమాసన్నమయిందని, ఇదే ఇప్పుడు అతని విధ్యుక్త ధర్మమని గాంధీ పేర్కొన్నారు.
 
ఒక విశాల మానవతా స్ఫూర్తి ఈ మాటల్లో వ్యక్తం కాలేదూ? ఆశ్చర్యకరమైన విషయమమేమిటంటే గాంధీ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఘనాలో విద్యార్థులు నివేదించిన వినతిపత్రంలో ఉటంకించిన గాంధీజీ వ్యాఖ్యల్లో చివరిది 1906 సంవత్సరం నాటిది. ఆ తరువాత గాంధీ 42 సంవత్సరాలపాటు జీవించారు. ఈ కాలంలోనే ఆయనలో జాతివివక్షా భావాలు సంపూర్ణంగా అంతరించపోవడాన్ని మనం గమనిస్తాము. మరి గాంధీ జాత్యహంకారి అని ఆయన పై అభియోగపత్రం రూపొందించినవారు ఈ వాస్తవాలను ఎలా విస్మరించారు? తెలియకచేశారా లేక ద్వేషంతో చేశారా? ఎవరూ స్పష్టంగా చెప్పలేని విషయమిది. అయితే జాతిని గురించిన గాంధీ భావపరిణామంపై చారిత్రక రికార్డు చాలా స్పష్టంగా ఉన్నది. యువకుడుగా గాంధీ జాత్యహంకారికావచ్చుగానీ కాలక్రమేణా ఆయన తన జాతిదురహంకారాన్ని సంపూర్ణంగా అధిగమించారు. సకల కులాలు, జాతులు, మతాలు, వర్గాలకు చెందిన స్త్రీ పురుషులతో సమానస్థాయిలో ఆత్మీయ సంబంధాలను ఆయన పెంపొందించుకున్నారు. అన్ని జాతులవారూ తాము గురవుతోన్న అన్నిరకాల దోపిడీల నుంచి విముక్తి పొందడానికి అహింసాత్మక ప్రతిఘటనకు తార్కాణమైన సత్యాగ్రహం అనే రాజకీయ పోరాట పద్ధతినే అనుసరించాలని ఆయన పదేపదే చెప్పేవారు. ఇరవయ్యో శతాబ్దంలో ఆఫ్రికన్‌ సంతతికి చెందిన మహోన్నత నాయకులు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, నెల్సన్ మండేలాలు జాతి వివక్షకు వ్యతిరేకంగా తాము జరిపిన పోరాటాలలో గాంధీని తమ ఆదర్శంగా, మార్గదర్శకుడుగా భావించడంలో ఆశ్చర్యమేముంది?
                                                                                                                                                                                                                                రామచంద్ర గుహ 
                                                                                                                                                                                                                      (వ్యాసకర్త చరిత్రకారుడు)