ఇండియాలో ఆస్ట్రేలియా కాలేజీలు ఏర్పాటు చేయాలంటే ఈ 7 విషయాలూ ముఖ్యమేనట!

సిడ్నీ : భారతదేశంలో ఉన్నత విద్యకు గిరాకీ ఎక్కువగా ఉంది. విద్యార్థుల అవసరాలను భారతీయ విద్యా సంస్థలు మాత్రమే తీర్చడం కష్టం. 2020 నాటికి 4 కోట్ల యూనివర్శిటీ ప్లేసెస్‌ను భర్తీ చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రాబోయే నాలుగేళ్ళలో అదనంగా 1 కోటి 40 లక్షల మంది విద్యార్థులు చేరుతారన్నమాట. కానీ ప్రస్తుతం ఉన్న సప్లయ్ ఆ డిమాండ్‌ను తీర్చగలిగేలా లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆ దేశ ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. భారతదేశం గురించి పరిశోధించి, విశ్లేషించే ఏకైక జాతీయ సంస్థ ఇది. ఈ నివేదికలో పేర్కొన్న7 ముఖ్యాంశాలు ఏమిటంటే...

 
1. ఆస్ట్రేలియా, భారతదేశంలోని విశ్వవిద్యాలయాల మధ్య సహకారంపై కేస్ స్టడీస్ చేయాలి. వీటిని విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాల పాలకులు ఉపయోగించుకోవాలి.
 
2. ఆస్ట్రేలియా-ఇండియా ఉన్నత విద్యారంగంలో కొలాబరేషన్‌పై పని చేస్తున్న విద్యావేత్తలను గుర్తించి, కొలాబరేషన్ విలువను ప్రచారం చేసేవిధంగా ప్రోత్సహించాలి. ఇరు దేశాల మధ్య బలమైన అనుబంధం ఏర్పడటానికి కృషి చేసేవిధంగా చేయాలి.
 
3. ఇండియన్ యూనివర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీలను అభివృద్ధి చేయడానికి ఫ్యాకల్టీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇటువంటి డిగ్రీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారతదేశంలో పర్యటించాలి.
 
4. పరస్పర ఆర్థిక లాభాలకు అతీతంగా భారతదేశంతో సహకారం ఎంత విలువైనదో ప్రత్యేకంగా వివరించాలి. ఆస్ట్రేలియా స్వార్థంతో పనిచేస్తోందనే భావనతో ఆస్ట్రేలియా యూనివర్సిటీలతో కలిసి పనిచేయడానికి ఇండియన్ యూనివర్సిటీలు ఆసక్తి కనబరచడం లేదు.కొత్త పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయడానికి, ఉన్నత విద్య అభివృద్ధికి ఇరు దేశాల అనుబంధం దోహదపడుతుందని తెలిపింది.
 
5. కొత్త రూపాల్లో సహకారం కోసం ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు భారతదేశానికి ప్రతినిధులను పంపించాలి.
 
6. ఆస్ట్రేలియా, ఇతర అంతర్జాతీయ విద్యా సంస్థలు ఇస్తున్న డిగ్రీల గుర్తింపు విధానాలను మెరుగుపరచాలి. యునైటెడ్ కింగ్‌డమ్ నేషనల్ అకడమిక్ రికగ్నిషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రూపొందించిన డేటాబేస్‌ను పరిశీలించి, కొత్త విధానాన్ని రూపొందించాలి.
 
7. విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో అడుగు పెట్టడాన్ని అడ్డుకుంటున్న చట్టాన్ని రద్దు చేసే యోచనలో ఆ ప్రభుత్వం ఉంది. ఆస్ట్రేలియాలోని ఎనిమిది శ్రేష్ఠమైన విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను భారతదేశంలో ఏర్పాటు చేయడంపై అధ్యయనం జరపాలి.